Kuppam Municipal Election: కుప్పం పురపాలక సంఘంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 28న జరిగే ఛైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. 24న నోటీసులు విడుదల కానున్నాయి. కుప్పం పురపాలక సంఘంలో 25 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ 19, టీడీపీ 6 వార్డులు గెలుచుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రాజకీయ సమీకరణలు మారాయి. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే, 24వ వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ అలీ.. మళ్లీ వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఏడాది వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచిన ఛైర్మన్ డా.సుధీర్… కౌన్సిలర్ మరియు ఛైర్మన్ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుతం కుప్పం పురపాలక సంఘంలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా…. టీడీపీకి 10, వైసీపీకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. తమ బలాన్ని నిలుపుకోవాలని వైఎస్ఆర్‌సీపీ, ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉన్నాయి.
Also Read: USA: వీసాల రద్దు ఆపండి: అమెరికాలో భారతీయ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట
Kuppam Municipal Election: స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌లు కుప్పం పురపాలికలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నారు. చైర్మన్ ఎన్నికలో వీరి ఓట్లే కీలకంగా మారాయి. ఇక ఛైర్మన్ పదవి కోసం రెండు సామాజిక వర్గాల నాయకులు టీడీపీ అధిష్ఠానానికి విన్నవించుకున్నారు. వైసీపీ మున్సిపల్ మొదటి వైస్ ఛైర్మన్ మునస్వామి సార్వత్రిక ఎన్నికల తర్వాత దూరంగా ఉండగా… రెండో వైస్ చైర్మన్ హఫీజ్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరు ఎటు వైపు వెళ్లనున్నారో 28న ఎన్నికలో తేలనుంది.