KTR BRS Vilinam Politics: రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్య రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. బిజెపిలో బిఆర్ఎస్ విలీనానికి సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యూచర్ సిటీలో రోడ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టును సీఎం రమేష్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి తెరలేపాయి. మరుసటి రోజు ఎంపీ సీఎం రమేష్ ఆ ఆరోపణలు ఖండిస్తూ కేటీఆర్‌పై మరిన్ని విమర్శలు గుప్పించారు. అసలు కేటీఆరే అవినీతిపరుడు అంటూ గతంలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. కవిత అరెస్టు సమయంలో బిజెపిలో పార్టీ విలీనం కోసం ప్రయత్నించలేదా..? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్‌కు సిరిసిల్లలో టికెట్టు ఇప్పించడానికి కేసీఆర్‌ను తానే ఒప్పించినట్లు అప్పటి పాత విషయాలను గుర్తు చేశారు. ఇందులో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయని ప్రజలు ఆలోచనలో పడేలోపే… బండి సంజయ్ రూపంలో మరో బాంబు పేలింది.
విలీనం అంశంలో సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్ధించారు. ఇదే విషయాన్ని నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాననే ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని బహిరంగ సభలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు బండి సంజయ్.
Also Read: Telangana Medical Council: సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్
అసలు కేటీఆర్‌కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించిన సమయంలో ఎంపీ సీఎం రమేష్‌ను కలిసిన విషయం నిజమా..? కాదా…? అని ప్రశ్నించారు బండి సంజయ్. అప్పటికే సిరిసిల్లలో పోటీకి సిద్ధమైన సుధాకర్ రావును తప్పించి కేటీఆర్‌కు టికెట్ ఇచ్చింది నిజమా? కాదా..? అంటూ ప్రశ్నించారు. ఈ అంశాలను ధ్రువీకరించేలా సీఎం రమేష్.. తన ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బయటపెడతానంటున్నారని, దీనిపై చర్చించేందుకు కరీంనగర్ వేదికగా తాను మీటింగ్ ఏర్పాటు చేస్తానని, అందుకు కేటీఆర్ సిద్ధమేనా..? అని సవాల్ విసిరారు. సీఎం రమేష్‌ను తీసుకొచ్చే బాధ్యత తనదేనని కూడా చెప్పారు బండి సంజయ్. కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని… డేట్, టైం ఫిక్స్ చేయాలని సవాలు విసిరారు. అంతేకానీ, ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నారు బండి సంజయ్. ఇక మరోవైపు ఈ ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పార్టీ విలినంపై కవిత ఎప్పుడో చెప్పారని, ఇప్పుడు అదే విషయాన్ని సీఎం రమేష్ దృవీకరిస్తున్నారని అన్నారు. ఇలా విలీనం అంశంలో బిఆర్ఎస్ వరుస దాడులతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇలా విలీనానికి సంబంధించినటువంటి అంశంలో బిఆర్ఎస్ పార్టీ అటు ఆంధ్ర పార్టీలు, ఇటు తెలంగాణ నేతలతో ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ ఆరోపణల్ని బిఆర్ఎస్ తిప్పి కొట్టలేక పోతుండటంతో ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే అటు వైపు ఎంపీ సీఎం రమేష్ సీసీ కెమెరా సాక్ష్యాలు బయటపెడతా అని బెదిరిస్తున్నారు. ఇటు వైపు కేటీఆర్ లైట్ తీసుకుంటున్నారు తప్ప, సూటిగా స్పందించడానికి వెనుకడుగు వేస్తున్నారు. జగదీష్ రెడ్డితో మాట్లాడించినా.. సీఎం రమేష్ సవాల్‌కి సమాధానం ఆయనా చెప్పలేకపోయారు. ఒకవేళ సీసీ కెమెరా పుటీజీ బయటకు వస్తే బిఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. మరోవైపు బండి సంజయ్ కూడా కరీంనగర్ కేంద్రంగా చర్చకు ప్రకటించడంతో ఈ అంశంలో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.