Koya Puli in Pulivendula: 30 ఏళ్ల తరువాత అక్కడ స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు పడ్డాయి. పోలింగ్ జరిగింది. అరాచక శక్తుల దౌర్జన్యకాండ ఈ సారి సాగకుండా పోయింది. తొలి సారి శాంతియుతంగా, సక్రమంగా పులివెందులలో జెడ్సీటీసీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏదైనా అక్కడ ఎన్నిక ఏక పక్షమే. ఒకవేళ ఎన్నిక జరిగితే రిగ్గింగ్ అత్యంత సహజమే. ఈసారి అలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా రంగంలోకి దిగారు పోలీసులు. అయితే అరాచకాలకు అలవాటు పడిన సోకాల్డ్ పులివెందుల పులులు కింది స్థాయి సిబ్బందికి మాట వినేలా కనబడకపోవడంతో స్వయంగా రింగు మాస్టారే రంగంలోకి దిగారు. ఆయనే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. నిజాయితీ పని చేసుకునే అధికారి. ముక్కుసూటిగా వెళ్లే ఆఫీసర్. పులివెందుల ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా చేయడం కోసం బెత్తం పట్టారు డీఐజీ కోయ ప్రవీణ్. పులివెందుల రప్పా రప్పా బ్యాచ్‌కు పోలీస్ పవర్ ఏంటో అర్థమయ్యేలా చేశారు.
డీఐజీ కోయ ప్రవీణ్ చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటారు కానీ, లా అండ్ ఆర్డర్‌లో మాత్రం తగ్గేదేలే అంటారు. పులివెందుల ఎన్నికల్లో రప్పా రప్పా బ్యాచ్‌కు సైలెంట్ గానే వార్నింగులిచ్చారు. పులివెందుల ఎన్నికల్లో వైసీపీ ట్రబుల్ షూటర్స్‌గా చెప్పుకునే వారికి డీఐజీ కోయ ప్రవీణ్ బిగ్ ట్రబుల్ ఇచ్చారు. పులివెందులలో పులిలా పహారా కాశారు. తనతో పాటూ తన సిబ్బందిని ఫుల్ జోష్‌తో పరుగెత్తించారు. పోలింగ్ రోజున ఏదో చేద్దామని బయలుదేరిన వైసీపీ ఎంపీ అవినాష్‌కు సింప్లీ వార్నింగ్‌తో బ్రేకులేశారు. అవినాశ్‌ని హౌస్ అరెస్ట్ చేసి, పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న డీఐజీ కోయ ప్రవీణ్ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఆ చిత్రంలో కోయ ప్రవీణ్‌ని చూసి.. పులిని ఆడించే రింగ్ మాస్టార్‌లా ఉన్నారంటూ పులివెందులలో తెగ చర్చించుకుంటున్నారట.
Also Read: Shubhanshu Shukla: భారత్‌కు చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లాకు అపూర్వ స్వాగతం
ఒక రెండేళ్లు వెనక్కి వెళితే… వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు నుండి తప్పించుకునేందుకు అవినాశ్ రెడ్డి కర్నూలులో విశ్వ భారతి హాస్పిటల్‌ని హైజాక్ చేసిన ఘటన గుర్తుకొస్తుంది. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ బృందం మూడు రోజులు హాస్పిటల్ బయటే పడిగాపులు పడి, చివరికి వెనక్కి వెళ్లిపోయారు తప్ప అవినాశ్‌ని టచ్ చేయలేకపోయారు. కనీసం హాస్పిటల్ గేటు కూడా తాకలేక పోయారు. ఆనాడు కర్నూలు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అదే కర్నూలు రేంజి డీఐజీగా నేడు కోయ ప్రవీణ్.. అవినాశ్‌ని తన ఇంట్లోనే కదలకుండా కూర్చోబెట్టారంటే… డిపార్ట్‌మెంట్‌లో ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సీన్‌లో కోయ ప్రవీణ్ పక్కనే చిన్న పిల్లాడిలా కామ్‌గా కూర్చున్న అవినాశ్‌ని చూస్తే.. మాస్టారు బెత్తం పట్టుకుంటే దడిసిన స్టూడెంట్ ఎలా సైలెంట్ అయిపోతాడో.. అలా కనిపించారు. అలా లా అండ్ ఆర్డర్‌ను లాయల్‌గా లాగించిన కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ని చూసి.. ముప్పై ఏళ్ల కిందట ఇదే కడప గడ్డపై బెబ్బులిలా తిరగాడి, ఫ్యాక్షనిస్టుల గుండెల్లో ఒణుకు పుట్టించిన ఉమేష్ చంద్ర ఐపీఎస్‌ని గుర్తు చేసుకుంటున్నారు కడప జిల్లా ప్రజలు.

