Konda Controversy

Konda Controversy: వీళ్లు మారరా? సరిపోయారు ఇద్దరూ..!

Konda Controversy: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు దంపతులు ఇప్పుడు వివాదాల కేంద్రబిందువుగా మారారు. వామపక్ష భావజాలం నుంచి ఉద్భవించి, గుడిసెలలో నివసించే పేదల కన్నీటిని తుడిచిన ఈ దంపతులు ఇప్పుడు తమ వ్యాఖ్యలు, నిర్ణయాలతో సొంత పార్టీలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, తన నిర్ణయాలతో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా నిలుస్తున్నారు. సినీ నటి సమంతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అమల.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీకి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. అంతేకాదు, “మంత్రుల వద్దకు పనుల కోసం వచ్చేవారు డబ్బులు ఇస్తారు, కానీ నేను మాత్రం తీసుకోను” అంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు సహచర మంత్రులను ఆగ్రహానికి గురిచేశాయి. “మేమంతా డబ్బులు తీసుకుంటామా? మీరు మాత్రం తీసుకోరా?” అంటూ మంత్రులు మండిపడ్డారు. అలా సురేఖ వ్యాఖ్యలతో పార్టీలో తీవ్ర అసంతృప్తి రగిలింది.

ఇక సురేఖకు తోడు ఆమె భర్త కొండా మురళి కూడా తోడయినట్లు కనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ అయిన కొండా మురళీధర్ రావు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలు పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయి. కడియం శ్రీహరిని “కనుబొమ్మలు లేనోడు” అని, రేవూరి ప్రకాష్ రెడ్డిని “75 ఏళ్ల ముసలోడు” అని, తన కాళ్లు పట్టుకుంటే గెలిపించానని, ఎర్రబెల్లి దయాకర్ రావును కొడితే కుక్కను కొట్టినట్టేనని.. ఇలా ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను కలవరపెట్టాయి. ఇక వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో బోనాల పండుగ జరపాలన్న కొండా సురేఖ నిర్ణయం మరో వివాదానికి తెరలేపింది. ఈ నెల 22న తొలి బంగారు బోనం సమర్పించేందుకు సురేఖ సిద్ధమయ్యారు, కానీ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహా భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?” అని నాయిని ప్రశ్నించారు. ఈ వివాదంతో వరంగల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Konda Controversy: కొండా దంపతుల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలపై అగ్గిమీద గుగ్గిలమైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారట. ఈ క్రమంలో ఇవాళ పీసీసీ చీఫ్‌ కూడా స్పందించి, కొండా దంపతుల వ్యాఖ్యల్ని ఖండించారు. దీంతో ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి ప్రమాదంలో పడినట్లు చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పేదల ఆశాజ్యోతిగా నిలిచిన ఈ దంపతులు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుని, సొంత పార్టీలోనూ అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఈ వివాదాల నుంచి వారు బయటపడతారా, లేక అధిష్ఠానం నుంచి షాక్‌కి గురవుతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *