Kommineni Character

Kommineni Character: లైవ్‌షోలో కన్నీరు… కర్మ ఫలితమేనా?

Kommineni Character: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు రీ ఎంట్రీ ఇచ్చారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచనలతో మంగళగిరి కోర్టు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల్లో టీవీ షోలు నిర్వహించవద్దని ఉన్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల మీడియా ముఖంగా పేర్కొన్నారు. అయితే అలాంటి షరతు ఏమీ లేదని తెలుస్తోంది. ఎందుకంటే… కొమ్మినేని బెయిల్‌పై విడుదలైన రెండు రోజులకే సదరు ఛానెల్‌లో ‘కేఎస్ఆర్ లైవ్ షో’ నిర్వహించారు. అయితే ఈ షోలో ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అరెస్టు అన్యాయమని, 70 ఏళ్ల వయసులో చేయని తప్పుకు నింద మోస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

రీ ఎంట్రీ తర్వాత తన మొదటి లైవ్‌ షోలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలకి కృతజ్ఞతలు తెలిపారు కొమ్మినేని. 1975లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను జర్నలిజంలోకి అడుగుపెట్టానని, అంతటి సీనియర్‌ జర్నలిస్టునైన తనకు విలువ ఇవ్వకుండా… తన అరెస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని వాపోయారు. తండ్రి వయసులో ఉన్న తనని కనీస మర్యాద లేకుండా ఓ మంత్రి గారు మాట్లాడినట్లు తన దృష్టికొచ్చిందని పరోక్షంగా మంత్రి లోకేష్‌ని నిందించారు. తన ఊపిరి ఆగిపోతుందేమోనని భయపడ్డానని చెప్పారు. మీడియా నీతి, జర్నలిజం విలువల గురించి మాట్లాడుతూ… రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే వ్యవస్థగా మీడియా మారిందని ‘సాక్షి’లో కూర్చుని క్లాస్‌ దంచారు.

కొమ్మినేని కేసు మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. కొమ్మినేని అరెస్టు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లని కొందరు వైసీపీ మద్దతు జర్నలిస్టులు వాదిస్తుండటం గమనార్హం. అయితే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వ్యతిరేక మీడియాపై ఆంక్షలు విధించిన సంగతిని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ నేతలు, వైసీపీ మద్ధతుదారులు, జగన్‌ కోసమే పాత్రికేయం చేసే కొమ్మినేని వంటి వారితో వచ్చిన చిక్కే ఇది. తన క్యారెక్టర్‌, తన కాండక్ట్‌, తన క్రెడిబులిటీ, తన ఇంటిగ్రిటీ దెబ్బతీస్తున్నారు అంటూ కన్నీరు కార్చిన కొమ్మినేని.. అవన్నీ ఒక్క వైసీపీ వారికే ఉంటాయా? ఇతరులకు ఉండవా? అన్న ఇంగితజ్ఞానాన్ని మర్చిపోయారు. కొమ్మినేని కంటే చంద్రబాబు నాయుడు నాలుగైదేళ్లు వయసులో పెద్దవారు. కొమ్మినేనిది 45 ఏళ్ల జర్నలిజం అయితే.. చంద్రబాబుది అంతే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం.

Also Read: SpaceX Starship: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్

ALSO READ  Pawan-Bunny: అల్లు-మెగా కుటుంబాలను కలిపిన కొణిదెల మార్క్‌ శంకర్‌!

Kommineni Character: నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన. అంతటి వ్యక్తిని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెడితే.. ఆ 53 రోజులు కూడా చంద్రబాబుని ఆడిపోసుకుంటూనే ఉన్నారు కొమ్మినేని తన డిబేట్లలో. 70 ఏళ్ల వయసులో ఉంటే ఏంటి? అరెస్ట్‌ చేయకూడదా? అంటూ లా పాయింట్లు మాట్లాడిన కొమ్మినేని.. ఇప్పుడు అదే వయసు చెప్పుకుని బావురుమనడం, జీవిత చరమాంకంలో ఉన్నా అంటూ వాపోవడం ఫక్తు డ్రమటిక్‌గా అనిపిస్తుంది. నిండు సభలో తన సతీమణి క్యారెక్టర్‌ని కించపరిస్తే.. భరించలేక కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబును… ఆనాడు హేళనగా మాట్లాడిన కొమ్మినేని.. నేడు ఇలా లైవ్‌ షోలో కన్నీరు మున్నీరు అవడం.. కర్మ ఫలితం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కొమ్మినేని చెప్తున్న క్యారెక్టర్‌, కాండక్ట్‌, క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ…. చంద్రబాబుకు, ఆయన సతీమణికి, ప్రతి ఒక్కరికీ ఉంటాయన్న సంగతి ఇప్పటికైనా సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని గుర్తెరగడం మంచిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *