Kodumur Tammullu

Kodumur Tammullu: కొరకరాని కొయ్యగా ‘కోడుమూరు’ తయారైందా?

Kodumur Tammullu: కడప గడపలో మహానాడు సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు జోరు మీద ఉన్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహానాడు కంటే ముందు నిర్వహించిన మినీ మహానాడు తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న వర్గపోరును బహిర్గతం చేసింది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఈ రచ్చ ముదిరి పాకాన పడింది. అక్కడున్న తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. మినీ మహానాడు ప్రోగ్రామ్‌ను నియోజకవర్గ కేంద్రంలో కాకుండా కర్నూల్ నగరంలో నిర్వహించడంపై డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి చెందిన టీడీపీ వర్గీయులు భగ్గుమన్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో ఆగకుండా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వారికి టీడీపీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

40 ఏళ్ల తర్వాత కోడుమూరు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరుడు బొగ్గుల దస్తగిరిని పోటీలో నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే కోడుమూరు నియోజకవర్గంలో ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం కూడా ఉంది. గత ఎన్నికల్లో కోట్ల వర్గాన్ని దూరం పెట్టడంతో పాటు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. కోట్ల వర్గానికి, విష్ణు వర్గానికి మొదటి నుంచి వైరం ఉంది. దీనికితోడు గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది కోట్ల వర్గానికి నచ్చలేదు. అంతేకాక మినీ మహానాడు కార్యక్రమానికి కూడా తమను ఆహ్వానించలేదని కోట్ల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కోట్ల వర్గం కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరికి, విష్ణువర్ధన్‌ రెడ్డి వర్గానికి సవాల్ విసురుతోంది.

Also Read: Elon Musk: ట్రంప్‌పై మస్క్ బాంబ్: ఎప్‌స్టైన్‌తో సంబంధాలపై సంచలన ఆరోపణలు

Kodumur Tammullu: డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సొంత ఊరు లద్దగిరి… కోడుమూరు నియోజకవర్గంలోనే ఉంది. గతంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూల్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో కోడుమూరులో కోట్ల వర్గానికి చాలా ప్రాధాన్యత ఉండేది. అయితే గత ఎన్నికల్లో సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో కోడుమూరులో కోట్ల వర్గానికి చెక్ పడినట్లు అయింది. దీనికి తోడు విష్ణువర్థన్‌రెడ్డి అనుచరుడైన బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కోట్ల వర్గానికి ప్రాధాన్యత రాను రాను తగ్గుతూ వచ్చింది. మొన్నటి మినీ మహానాడు కార్యక్రమానికి కూడా తమను పిలవలేదని కోట్ల వర్గం ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్‌గా విష్ణువర్థన్‌రెడ్డి వర్గం కూడా ప్రెస్ మీట్ పెట్టి కోట్ల వర్గంపై భగ్గుమంది. గత ఎన్నికల్లో వైసీపీకి సహకరించారంటూ మండిపడింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని, లేనిపోని ఆరోపణలు చేసి పార్టీకి నష్టం కలిగించవద్దంటూ హితవు పలికింది. సెగ్మెంట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతోంది. ఇలా కోడుమూరు నియోజకవర్గ టీడీపీలో కోట్ల వర్సెస్ విష్ణు వర్గాలుగా విడిపోయి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు మహానాడు సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ మీద ఉంటే, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో మాత్రం ఒకరిపై ఒకరు వర్గ పోరుతో రగిలిపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. మరి కోడుమూరు తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *