Knr Cong Leaders Fight: సాధారణంగా ఒక జిల్లాకు ఒకటే జిల్లా పార్టీ కార్యాలయాన్ని చూస్తుంటాం. కానీ కరీంనగర్ కాంగ్రెస్‌లో మాత్రం ఎవరి దుకాణం వారిదే. అసలు దుకాణాన్ని మూసేసి ఎవరి దుకాణం వారు తెరిచేసి చేస్తున్న హంగామాతో జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. తాజాగా ఇరువర్గాల మధ్య డీసీసీ ఆఫీస్ వేదికగా జరిగిన గొడవతో పాటు, సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలోనూ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల గొడవలు పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మూడు రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ నేతృత్వంలో పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఆయన ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. ఆ తర్వాత రోజే అదే ఘర్షణాత్మక దృశ్యం సిరిసిల్లలో కనబడింది.
కాగా, కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారనే అంశం వెనుక ఆసక్తికరమైన కథ ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వనాథన్ పెరుమాళ్ కరీంనగర్‌కు రాగానే కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి క్యాడర్‌లో కొందరు ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. వారితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. వారంతా ఇక్కడి కాంగ్రెస్ పరిస్థితిని వివరించారు. అంతేకాకుండా కీలక నేతలే గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు కాంగ్రెస్ భవన్‌లో జరిగిన సమావేశంలో కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎదగకపోవడానికి, ప్రతి పనికీ వారే అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. అదే సమయంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఒకతను హైదరాబాద్‌లో ఉంటాడు. ఇక్కడికి రాడు. ఎవ్వరినీ ఏమీ చేయనీయడు. తాను చేయడు” అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్‌లో ఓ వర్గీయులు పురమళ్ల శ్రీనివాస్‌పైన ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ ముందే దాడికి తెగబడ్డారు. అర గంట నానా హంగామా చేశారు.
మరోవైపు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనూ ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. చీటీ ఉమేష్ రావు అనే నాయకుడు స్టేజ్‌పైకెక్కగానే, “ఇంతకాలం కనిపించకుండా పోయిన నీవు, ఇప్పుడు వచ్చి ఫోజులు కొడుతున్నావా?” అంటూ అక్కడ కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముందే ఈ గొడవంతా జరిగింది. దీంతో ఓ వైపు కరీంనగర్ ఘటన మరవకముందే ఇంకో వైపు సిరిసిల్ల ఘటన.. కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఏ స్థాయికి చేరుకున్నాయో స్పష్టమౌతోంది.
Also Read: IND vs PAK: భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ ప్రకటించిన పాక్ దౌత్యవేత్త
కాగా, ఉద్యమకాలం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకూ, ఆ తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం నుంచి ఈసారి కాంగ్రెస్‌కు అధికారం దక్కే వరకూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం తెలంగాణలో ఎంతో కీలకం. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలకమైన కరీంనగర్‌లో మాత్రం విభేదాలతో రచ్చకెక్కుతోంది. ప్రతిపక్షాలకు అస్త్రాలను తానే అందించడం పక్కన పెడితే, ఏకంగా తమలో తామే కుమ్ములాడుకుంటూ పార్టీ పరువును, ప్రభుత్వ పరువును నిండా మునిగేలా చేస్తోందనే టాక్ ఇప్పుడు బలపడుతోంది. అధికార పార్టీలో ఇలాంటి కుమ్ములాటలను విపక్షాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నాయి. కుమ్ములాటల విజువల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడుతున్నారు. ఇకనైనా అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలపై దృష్టి సారించి, పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది.

