KNL Aluru TDP Incharge: కర్నూలు జిల్లాలో నాలుగు నెలలుగా ఆలూరు ఇన్‌చార్జి మార్పు తథ్యం అంటూ జరుగుతున్న చర్చకు అధినేత చంద్రబాబు తెర దించారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇన్‌చార్జిగా కొనసాగిన వీరభద్ర గౌడ్‌ను బాధ్యతల నుండి టీడీపీ తప్పించింది. ఆలూరు సారథిగా… పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీపీ వైకుంఠం ప్రసాద్ సతీమణి.. వైకుంఠం జ్యోతిని అధిష్ఠానం నియమించింది. 2015 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆమె.. గత ఎన్నికల్లో ఆలూరు టీడీపీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో ఆమెను ఆలూరు ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో వైకుంఠం వర్గీయులు, టీడీపీ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
గత ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్ర గౌడే ఆ తర్వాత ఇన్‌చార్జిగా కొనసాగారు. అయితే, వర్గవిభేదాలు వీడి అందరిని కలుపుకొని పోవాలని, పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచిస్తూ… వీరభద్ర గౌడ్‌కు అధిష్ఠానం పలు అవకాశాలు కల్పించింది. అయినా ఆయనలో మార్పు కనిపించలేదని టీడీపీ భావించింది. ఆయన ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే, ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరక దాదాపు 30 ఏళ్లు అవుతోంది. ఇక్కడ నాయకుల వర్గపోరుతో క్యాడర్ సతమవుతున్న నేపథ్యంలో సమర్థుడిని ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించాల్సిన అవసరం అధిష్టానానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆలూరు సారథిగా వైకుంఠం జ్యోతికి అవకాశం కల్పించింది.
Also Read: AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
వైకుంఠం కుటుంబం మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే కొనసాగుతుంది. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి… వైకుంఠం శ్రీరాములు కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. 2011లో వైకుంఠం ప్రసాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో టికెట్ ఆశించినా.. అధిష్ఠానం వీరభద్ర గౌడ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి వీరభద్రగౌడ్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగారు. 2019లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను బరిలో దింపితే ఆమె కూడా ఓటమి చెందారు. ప్రతిపక్షంలో పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో మళ్లీ వీరభద్ర గౌడ్‌కు టికెట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామి సృష్టించినా.. ఆలూరులో ఓటమి చెందారు. 15 నెలలుగా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ అన్ని వర్గాలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారని, ఆయన ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వైకుంఠం జ్యోతిని ఆలూరు ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఆలూరు టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన వైకుంఠం జ్యోతి ఎదుట పార్టీ అంతర్గతంగా పలు సవాళ్లు ఉన్నాయి. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉన్నా.. వర్గవిభేదాలు వల్ల పార్టీ ఓటమి చెందుతూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 11 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. చివరిగా 1994 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత గత 30 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ జెండా ఎగరలేదు. టీడీపీలో వైకుంఠం, కోట్ల, వీరభద్ర గౌడ్, గుమ్మనూరు వర్గాలు బలంగా ఉన్నాయి. వీరితో పాటు ఏపీ వాల్మీకి/బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ కూడా తన వర్గాన్ని బలపేతం చేసుకునే క్రమంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ 2029 ఎన్నికల్లో ఆలూరులో పసుపు జెండా ఎగురవేసే దిశగా పార్టీని బలోపేతం చేయడం వైకుంఠం జ్యోతికి కత్తిమీద సాములాంటిదే అని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. మరి వైకుంఠం జ్యోతి ఎలా పార్టీని బలోపేతం చేస్తారో వేచి చూడాలి.