Khammam Leaders: 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. 10 స్థానాలకు గానూ 8 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి గెలుపొందారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో, 2023లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో అనేకమంది ఆస్తులు కోల్పోయారు, మరికొంతమంది కేసులు పాలై తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారి కష్టం ఫలించింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఊహించని విధంగా ఖమ్మం జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. ఏకంగా ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ముగ్గురికి ఒకేసారి మంత్రి పదవులు రావడం అనేది జరగలేదు. నేడు ఒకరికి డిప్యూటీ సీఎం, మిగిలిన ఇద్దరికీ కీలకమైన శాఖలు కేటాయించడంతో కార్యకర్తలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
అసలు కథ ఇక్కడ నుంచే ప్రారంభమైంది. తమ కష్టానికి ప్రతిఫలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తమ నాయకులకు మంత్రి పదవులు వచ్చాయి. తదుపరి ఘట్టం ఇక తమకు న్యాయం జరగడమే మిగిలిందని, తమ సమయం ఆసన్నమైందని కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు ఆశించారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో తమ పేరు లేకపోవడంతో కంగుతిన్న నాయకులకు ఏమి జరిగిందో అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. తర్వాతి దశలో జిల్లా స్థాయిలో ఉన్న గ్రంథాలయం చైర్మన్, సుడా చైర్మన్, భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌తో పాటు మరికొన్ని ప్రధాన ఆలయాల్లో చైర్మన్ పదవుల భర్తీ కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఇక మార్కెట్ కమిటీల్లో స్థానం ఆశించి బంగపడ్డ వారిది ఒక బాధ అయితే, ఇంకా మార్కెట్ కమిటీలను ప్రకటించని చోట్ల ఎదురు చూసేవారిది మరో రకమైన బాధ.
Also Read: TG Vishwa Prasad: ఖరీదైన ఫ్లాట్ కొన్న ప్లాప్ నిర్మాత?
Khammam Leaders: ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన కాంగ్రెస్ కార్యకర్తల విషయం దగ్గరికి వద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరారా పేరు పెట్టి పిలిచే తమ నాయకులు, ఎమ్మెల్యేలుగా గెలవడం, కొందరికి మంత్రి పదవులు రావడంతో సంబరపడ్డ కార్యకర్తలు… ఒక్కసారి తమ నాయకులను చూసి వద్దామని వెళ్లిన కార్యకర్తలకు కోలుకోలేని షాక్‌లు తగులుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను పేరు పెట్టి నోరారా పిలిచిన నాయకుడు నేడు ఎదురు వెళ్లినా చూడనట్లుగానే వెళ్లిపోతుండటం, వెళ్లి నమస్కారం చేసినా తమను గుర్తుపట్టనట్లు వ్యవహరించడంతో కొందరు కార్యకర్తలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కనీసం తమకు పని చేయకున్నా పర్వాలేదు కానీ, ఆప్యాయతతో ఒక్కసారి పలకరించినా చాలని కార్యకర్తలు వాపోతున్నారు.
ఇక మరికొంతమంది నాయకులు, కార్యకర్తల బాధలు వర్ణనాతీతం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో ఆ నాయకులే తమ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం, తమ నాయకులు సైతం వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారు చెప్పినట్లుగానే అధికారులు కూడా వినడంని ఆదేశిస్తుండటాన్ని కొందరు నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తాము నవ్వుల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ కార్యకర్తలు లోలోపల రగిలిపోతున్నారు. కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లాలో ఈ పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.
