KDP Corporation Chettha: జగన్ ప్రభుత్వం చెత్త పన్ను వసూల్ చేసి రాష్ట్రమంతా చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. రాష్ట్ర ప్రజలు చీదరించుకున్నా చెత్త పన్ను ముక్కు పిండి వసూలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తక్షణమే చెత్త పన్ను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇదే అదనుగా భావించిన కొంత మంది అధికారులు కడపలో సొంత అజెండాను అమలు చేసి.. నెల నెలా లక్షల్లో వసూళ్లకు తెరలేపారు. చెత్త పన్నుపై ప్రశ్నిస్తే ఏకంగా బెదిరింపులకు కూడా వెనుకాడలేదు కార్పొరేషన్ సిబ్బంది. చెత్తపై నోరు విప్పితే కేసులు పెడతారన్న భయంతో అక్రమార్కులు అడిగినంతా కట్టాల్సిందే. అక్రమంగా వసూలు చేస్తున్న చెత్త పన్నుకు ఏకంగా కార్పొరేషన్ పేరిట బిల్లులు కూడా ఇవ్వడం అందరినీ ఆశ్చరానికి గురి చేస్తోంది. నెలకు 20 నుంచి 30 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏడాదికి పైగా వసూళ్లు చేసారంటే ప్రజల సొమ్ము ఎంత దోచేసారో చూడండి.
వాణిజ్య సంస్థలపైనా కన్నేశారు ఆ కార్పొరేషన్ వసూళ్ల బ్యాచ్. చెత్త పన్నుకు వాణిజ్య, వ్యాపార సంస్థలనే టార్గెట్ చేసుకున్నారు. రోడ్డు పక్కన ఉండే టీ స్టాల్ దగ్గర్నుంచి పెద్దపెద్ద రెస్టారెంట్ల వరకు దేనినీ వదలని వసూల్ బ్యాచ్… పన్నుకు రసీదు అడిగితే వారు ప్రింట్ చేసిన రసీదులు కూడా ఇచ్చేస్తున్నారు. చెత్త పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించిన వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలా ఒక్కొక్కరి వద్ద 2 వందల నుంచి 2 వేల వరకు.. నెలకి 30 లక్షల మేర వసూళ్లతో చెత్తలో కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎన్‌సీఎల్‌టీలో ఊరట
చెత్త స్కామ్‌పై దాదాపు నెలనాళ్ల పాటు విచారించిన కమిషనర్.. ఈ చెత్త పన్ను అక్రమ వసూళ్లలో 30 మంది కార్పొరేషన్ సిబ్బంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వారిపైన చర్యలు తీసుకుంటారని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మౌనం వహించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చెత్త పన్ను వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలో అలసత్యం వహిస్తున్నారన్నది తెలియటం లేదు. MHO స్థాయి అధికారి ఏకంగా కార్పొరేషన్‌లో చెత్త పంచాయతీలు చేశారంటే… ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఏకంగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద చెత్త పన్ను వసూళ్లకు సంబంధించి గొడవలు కూడా జరిగినట్లు కడపలో ప్రజలు కోడై కూస్తున్నారు.
కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారులపై ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదన్న సందేహం కడప వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే నెల రోజుల పాటు విచారణ చేసిన కమిషనర్ మనోజ్ రెడ్డి.. ఆ అధికారులను సస్పెండ్ చేయకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారో మరి. ఇప్పటికైనా ఆ అధికారులపై చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టాలు చాలానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు.