Kavvampalli Vs RasamayIi

Kavvampalli Vs RasamayIi: సై అంటే సై.. మానుకొండూరు మంటలు!

Kavvampalli Vs RasamayIi: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా మానకొండూరుకు ప్రాతినిధ్యం వహించారు రసమయి బాలకిషన్. ఆ రెండు సార్లు కూడా రసమయి చేతిలో కాంగ్రెస్‌ నేత కవ్వంపల్లి సత్యనారాయణ ఓడిపోవడం జరిగింది. రసమయిపై కసితో ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ గత ఎన్నికల్లో పట్టుదలతో గెలుపొందారు. గత 15 ఏళ్లుగా ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తీవ్రత కూడా మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా ఉంటుంది.

రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతి, అభివృద్ధిపై తీవ్ర విమర్శలు గుప్పించారు కవ్వంపల్లి. ఇప్పుడు కవ్వంపల్లి ఎమ్మెల్యేగా ఉండగా, అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారు రసమయి. అయితే రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ, వీరి మధ్య విమర్శలు వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్నాయి. 6 నెలల క్రితం ఈ విమర్శలు, ప్రతి విమర్శలు శృతిమించాయి. రసమయి ప్రెస్మీట్ పెట్టి కవ్వంపల్లి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్నారు. మగ వారితోనూ ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారని అభ్యంతరకరంగా విమర్శలు చేశారు.

Kavvampalli Vs RasamayIi: మరోవైపు కవ్వంపల్లి సత్యనారాయణ సైతం అదే స్థాయిలో రసమయిపై విరుచుకుపడ్డారు. రసమయి బాలకిషన్‌కి ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని, అతనికి వచ్చిన వ్యాధి చాలా అరుదైనదని, అతని ఆరోగ్యం గురించి నియోజకవర్గ ప్రజలు, అతని ప్రక్కన ఉన్నవారే రకరకాలుగా చెప్పుకుంటున్నారని ప్రతిదాడికి దిగారు. ఇలా ఒకరికొకరు అభ్యంతరకరంగా మీడియాలో వాడకూడని పదజాలంతో విమర్శలు గుప్పించుకున్నారు.

ఇక మరోమారు వారి మధ్య అవినీతి, అక్రమాల అంశాలపై విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. సత్యానారాయణ కమీషన్ల నారాయణ అంటూ రసమయి విమర్శించారు. ప్రతి పనికి కమిషన్ తీసుకోకుండా ఎమ్మెల్యే పని చేయడంటూ విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటూ ఇసుక రవాణాలోనూ, మట్టి రవాణాలోనూ ఎమ్మెల్యే కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా సత్యనారాయణ స్పందిస్తూ.. అసలు రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన రసమయి బాలకిషన్ చేసిన నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆడడం, పాడడం తప్ప ఈ బాలకిషన్‌కు ఏమీ తెలియదంటూ ఘాటుగా స్పందించారు. ఇక ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఈ స్థాయిలో ఉంటే… వారి అనుచర వర్గం విమర్శలు, ప్రతి విమర్శలు ఘర్షణకు దారి తీసేలా ఉంటున్నాయి. నియోజకవర్గంలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటోంది.

Also Read: Land Scam: 600 ఎకరాలు భోంచేసిన భూరాబందులు!

Kavvampalli Vs RasamayIi: ఇక సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల అంశంలో అవినీతి జరిగిందంటూ రసమయి బాలకిషన్ తాజగా తెరపైకి తీసుకొచ్చారు. తప్పుడు పత్రాలు సమర్పించి సిఎంఆర్ నిధులు మంజూరయ్యేలా చేశారన్నది రసమయి ఆరోపణ. అక్రమాలపై విచారణ జరపాలన్నది ఆయన డిమాండ్. ఈ ఆరోపణల్ని తిప్పికొడుతూ ఎమ్మెల్యేకి అనుకూలంగా దళిత సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రసమయి బాలకిషన్‌ని తూర్పారబట్టారు. ఈ ఆరోపణలు నిరూపించకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు బెజ్జంకిలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి… తన ఆరోపణలకు ఆధారాలు చూపాలని రసమయికి సవాల్ విసిరారు.

ALSO READ  MS Dhoni: ఛాంపియన్స్ ట్రోఫీకి ధోనీ..! ఆటగాడిగా కాదండోయ్…!

అంతటితో ఆగకుండా బెజ్జంకి మండలం గుండారంలో ఉన్న రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు… కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రసమయి బాలకిషన్‌ను హౌస్ అరెస్ట్ చేసి బీఆర్ఎస్ నేతలు బయటకు రాకుండా కట్టడిచేశారు. మొత్తంగా ఈ వ్యవహారం మానకొండూరు నియోజకవర్గం అట్టుడికేలా చేసింది.

ఇలా రసమయి బాలకిషన్, కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటు నేతలు, కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో వీరి మధ్య వివాదాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *