KMM Kallur Candidate: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా రూరల్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కల్లూరు రెవెన్యూ డివిజన్‌గా ఉండటంతో కల్లూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఇక మరో నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడే చాన్స్ ఉంది. కల్లూరు నియోజకవర్గంగా ఏర్పడితే అక్కడ నుండే బీఆర్‌ఎస్ తరుపున పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త దేవరపల్లి పట్టాభి.
ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత… దేవరపట్టి పట్టాభి సొంతూరు అయిన కల్లూరు మండలం లింగాలకు రావడం, కవితకు భారీ ర్యాలీ ద్వారా స్వాగతం పలకడం, అక్కడకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి రాబోయే రోజుల్లో పట్టాభికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని కవిత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీతో పాటు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పేరుకు పట్టాభి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైనట్టు చెప్తున్నా, రాత్రి పట్టాభి ఇంట్లోనే కవిత బస చేయడం, ఎన్నికలను తలపించేలా ర్యాలీ చేయడం, జన సమీకరణ, పట్టాభి గురించి కవిత మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, రాబోయే ఎన్నికల్లో పట్టాభి పోటీ చేయడం ఖాయమన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. పట్టాభికి కవితతో ఉద్యమ సమయం నుండి అనుబంధం ఉంది. పట్టాభి తన మనిషని, రాబోయే రోజుల్లో తనను ఆదరించాలని చెప్పడానికే కవిత లింగాలలో పర్యటించారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Seethakka: కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి
KMM Kallur Candidate: పట్టాభి కుటుంబానికి కల్లూరు మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల నేతలతో సంబంధాలు కలిగి ఉండటం, వామపక్ష పార్టీలతో ఉన్న సంబంధాలు, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, విద్యావంతుడు, యువకుడు, సౌమ్యుడిగా పేరు ఉండటం, బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అన్నింటికీ మించి కవితతో పాటు కేటీఆర్‌తో ఉన్న సంబంధాలు పట్టాభికి కలిసివచ్చే అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టాభి తన సొంత టీమ్‌ను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ర్యాలీ, ఒక్క సభతోనే సత్తా చాటి జిల్లాలో చర్చకు తెరతీశాడు. ఇప్పటి నుండే చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కల్లూరు జనరల్ స్థానం అయితే పట్టాభి బీఆర్‌ఎస్ తరుపున బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి, రాబోయే రోజుల్లో పట్టాభికి పట్టాభిషేకం జరగబోతుందా? అసెంబ్లీలో ‘పట్టాభి అను నేను’ అని అడుగుపెడతారా, లేదా… తెలియాలి అంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.