Kaleswaram Plan: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు గుదిబండగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 620 పేజీల నివేదికలో కేసీఆర్ పేరు 132 సార్లు ప్రస్తావించబడింది. ఆయన నిర్ణయాలు రాష్ట్రాన్ని లక్ష కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను ఆయుధంగా మలచుకొని, కేసీఆర్‌ను రాజకీయంగా ఇరుక్కునే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు అర్థమౌతోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కోట క్రమంగా కూలుతున్నట్లు కనిపిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ హయాంలో రూ.87,449 కోట్ల అప్పులతో మొదలైంది. ఇప్పటివరకు రూ.29,737 కోట్లు తిరిగి చెల్లించినా, రూ. 64,212 కోట్ల అసలు మిగిలే ఉంది. ఆ అసలుకురూ.41,638 కోట్ల వడ్డీ పోగయ్యింది. అసలు, వడ్డీ కలిపి ఇంకా చెల్లించాల్సిన అప్పు 1 లక్షా 5 వేల 850 fఉంది. వెరసి ఈ ఆర్థిక భారం తెలంగాణను కుదేలు చేసింది. జస్టిస్ ఘోష్ నివేదిక ప్రకారం, కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు, నిబంధనలను ఉల్లంఘించారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పు వంటి నిర్ణయాలు ఖర్చును భారీగా పెంచాయి. ఈ అవకతవకలు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని నివేదిక స్పష్టం చేసింది.
Also Read: Viveka Case CBI Task Over: దర్యాప్తు ముగిసింది… సీబీఐ తేల్చిందేంటి?
రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా ఈ ఆరోపణలను నిరూపించేందుకు చాలా కూల్‌గా అడుగులు ముందుకువేస్తున్నారు. ఎక్కడా తొత్తరపాటు లేదు. ఆవేశం లేదు. క్రమశిక్షణగా, గోడ కట్టినంత పద్దతిగా ఇక్కడ రేవంత్ వ్యూహాలు కనబడుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇక మంత్రివర్గ ఉపసంఘం 62 పేజీల సంక్షిప్త నివేదికలో కేసీఆర్ 32 సార్లు, హరీష్ రావు 19 సార్లు, ఈటల రాజేందర్ 5 సార్లు ప్రస్తావించబడ్డారు. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సమగ్ర చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని రేవంత్ ప్లాన్ చేశారు. సిట్ ఏర్పాటు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు, కానీ కక్షసాధింపు ఆరోపణలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కేసీఆర్ ఆదేశాలతో నిబంధనలను పట్టించుకోకుండా పనిచేసిన అధికారులు, ముఖ్యంగా స్మితా సబర్వాల్ వంటి వారు కూడా నివేదికలో బాధ్యులుగా పేర్కొనబడ్డారు. ఈ అవినీతి వల్ల కాంట్రాక్టర్లు, అధికారులు అక్రమాస్తులు సంపాదించారని, కొందరు ఇప్పటికే జైళ్లలో ఉన్నారని నివేదిక సూచించింది.
కేసీఆర్ రాజకీయ చాణక్యుడిగా గతంలో పేరుగాంచినా, ఇప్పుడు రేవంత్ వ్యూహాల ముందు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. కేటీఆర్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్, హరీష్ రావు డ్యామేజ్ కంట్రోల్ స్ట్రాటజీలు కూడా బీఆర్ఎస్‌ను కాపాడలేకపోతున్నాయి. కాళేశ్వరం అవినీతి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెట్టిందని చర్చ జరుగుతోంది. మొత్తానికి రేవంత్ స్లో అండ్ స్టడీ వ్యూహం బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.