Kadiri YCP office closed: అనంతపురం ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయంతో, మరో 30 ఏళ్లు తిరుగులేదనే విధంగా క్యాడర్‌కు సంకేతాలు పంపింది. కానీ, ఒకే టర్మ్, అంటే 5 సంవత్సరాలలో, ఆ పార్టీ పాతాళానికి పడిపోయిందా? అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక వైసీపీ బొక్కబోర్లా పడింది. ఈ దారుణమైన ఓటమికి స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే కారణమని ప్రజలు అంటున్నారు. విచ్చలవిడిగా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, అనేక ప్రకృతి వనరులను కొల్లగొట్టడంతో నేతలు జేబులు నింపుకున్నారు తప్ప, అభివృద్ధి జరగలేదనేది వాస్తవం.
కొన్ని గ్రామాలు, నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ, ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీడీపీ కొట్టిన దెబ్బకు బలమైన నియోజకవర్గాల్లో కూడా వైసీపీ చిన్నాభిన్నమవుతోంది. “మేమున్నాం మీకు” అని చెప్పే నాయకుడు కరువయ్యాడు. ఇక కదిరి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో వేళ్లూనుకుని పోయిన అవినీతి సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం… విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్నారు… మున్సిపాలిటీని బ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే కందికుంట ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, వచ్చే స్థానిక ఎన్నికల నాటికి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి, మరోసారి టీడీపీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే అంటున్నారు.
Kadiri YCP office closed: అధికారం కోల్పోయిన తర్వాత, పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి జంప్ చేస్తుండటంతో ఇప్పటికే పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను వైసీపీ కోల్పోయింది. తాజాగా, సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలోనూ అదే జరిగింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గింది. దీంతో కదిరి మున్సిపాలిటీని కూడా వైసీపీ కోల్పోయింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఛైర్‌పర్సన్‌తో సహా వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
Also Read: Agent Sai Reddy On Duty: గత మూడు నెలలుగా అసలేం జరుగుతోంది?
Kadiri YCP office closed: కోరం ఉన్నందున, హాజరైన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అందరూ అనుకున్నట్లే కూటమి కదిరి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కదిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టీడీపీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అవిశ్వాసం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్నారు. కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసా అవినీతికి పాల్పడ్డారని, కదిరిలో అభివృద్ధి లేదని ఆరోపించారు. అందుకే వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారని, కదిరి అభివృద్ధి కోసమే ఈ తీర్మానం పెట్టినట్లు ఆయన తెలిపారు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనడానికి అనేక ఉదాహరణలు మన కళ్లముందే కనిపిస్తాయి. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయని చెప్పడానికి కదిరి నియోజకవర్గం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.2014, 2019లో వరుసగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి, తమకు తిరుగులేదనుకున్నారు. అయితే, పదేళ్ల వైసీపీ పాలనలో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని నియోజకవర్గ ప్రజలు 2024లో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను గెలిపించారు. మైనారిటీలను నమ్ముకుని వైసీపీ రంగంలోకి దిగింది. అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఎవరినైనా తిరస్కరిస్తారనడానికి కదిరి నియోజకవర్గం ఒక ఉదాహరణ.