Journalist Should Be Unity

Journalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!

Journalist Should Be Unity: “ఎక్కడ ఉంటున్నరు? ఎవరి తిండి తింటున్నరు?” అంటూ మహాన్యూస్‌పై బీఆర్‌ఎస్‌ గూండాల దాడిని సమర్థించుకున్నారు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. ఆయన మాటల్ని తప్పుబడుతూ ఏబీఎన్‌ రాధాకృష్ణ విశ్లేషణాత్మక విమర్శ చేస్తే… ఇదే జగదీష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి… “రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మధ్యలో మీ మీడియా బలుపేంది?” అంటూ హూంకరించారు కూడా. మరి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నపై జరిగిన దాడి ఏంటి? రాజకీయంగా తేల్చుకోవడం అంటే.. దాడులు చేయడమా? హత్యాయత్నం చేయించడమా? తప్పుగా దొర్లిన థంబ్‌ నెయిల్‌ విషయంలో మహాన్యూస్‌ ఏమీ సమర్థించుకోవడం లేదు. తీన్మార్‌ మల్లన్న.. కవితపై చేసిన కంచం-మంచం వ్యాఖ్యల్ని సమర్థించడమూ లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది… మహాన్యూసా, ఆంధ్రజ్యోతా, క్యూ న్యూసా మరొకటా అని కాదు. ఇది తమని ప్రశ్నించినా, విమర్శించినా దాడులతోనే సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ తీసుకున్న రాజకీయ నిర్ణయం. దీనివల్ల బీఆర్ఎస్‌ లాభపడుతుందా? రాజకీయంగా మరింత నష్టపోతుందా? అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఈ దాడుల సంస్కృతిని తప్పుబట్టి, ఎదిరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఇదే మీడియా వ్యవస్థలో ఎదిగి, ఇందులోనే పాతుకుపోయిన మేధావులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటిది… మీడియా సంస్థల మీద దాడులు జరుగుతుంటే అండగా నిలబడాల్సిన యూనియన్ నేతలు (కొందరు) సన్నాయి నొక్కులు నొక్కుకుంటూ దాడులకు పరోక్షంగా సహకరిస్తున్నారు.

Also Read: Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్‌

యూనియన్లు, వాటి నాయకులు జర్నలిస్టుల సంక్షేమంతో పాటు జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎటాక్స్ కమిటీల పేరిట జర్నలిస్టులపై దాడులను ప్రతిఘటించేందుకు ప్రత్యేక కమిటీలు ప్రతీ జిల్లాకు ఉండేవి. ఆ కమిటీలో కలెక్టర్ అధ్యక్షునిగా, జిల్లా పోలీస్ అధికారితో పాటు సీనియర్ జర్నలిస్టులు సభ్యులుగా ఉండేవారు. గ్రామ స్థాయి జర్నలిస్ట్ నుండి జిల్లా స్థాయి ప్రతినిధి వరకూ ఈ కమిటీ కాపాడుకునేది. తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ కమిటీలు అడ్రస్ లేకుండా పోయాయి.

జర్నలిస్టు యూనియన్ నాయకులు, గౌరవనీయ స్థానంలో ఉన్నవారు స్పందించి దాడులు జరిగిన మీడియా సంస్థలకు అండగా నిలబడాలి కదా! ఆనాడు మహా న్యూస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు జర్నలిస్ట్ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి, దాడిని తీవ్రంగా ఖండించి ఉంటే… ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడులు చేస్తానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించేవారా? ఇవ్వాళ తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడులు చేసేవారా? రేపు మరో కార్యాలయం మీద దాడి చేయరని గ్యారెంటీ ఇవ్వగలరా? గౌరవ జర్నలిస్ట్ యూనియన్ నాయకులను ఆలోచించమని తెలంగాణ మీడియా సమాజం అడుగుతోంది. ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా మన పరువు బజారున పడేలా చేయవా? అది మన సమాజానికి మంచిదేనా? మీడియా వ్యవస్థలపై, ప్రశ్నించే వ్యక్తులపై.. ఈ రకమైన వరుస దాడులు, అనాగరిక చర్యలతో మన సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారో విజ్ఞులు, మేధావులు ఆలోచించాలి. ఇకనైనా మౌనం వీడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *