Jounior vs MLA: అనంతపురం జిల్లాలో ఊహించని సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయా? గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనంతపురం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 2న అనంతపురం వస్తున్నారని ఆయన ఫ్యాన్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటమే. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాయిస్ అంటూ విడుదలైన ఆడియోపై అభిమానులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా జూనియర్ ఎన్టీఆర్‌ని సెప్టెంబర్ 2న అనంతపురం తీసుకురావాలని ఆయన అభిమాన సంఘం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ రోజు నందమూరి హరికృష్ణ పుట్టినరోజు కావడంతో, అనంతపురంలో ఆయన జన్మదిన వేడుకలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమ అభిమాన హీరోపై రోత వ్యాఖ్యలు చేశారంటూ.. అందుకు ఖండనగా జూనియర్ ఫ్యాన్స్ ఓ ప్రెస్మీట్ నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఏపీలో ప్రెస్మీట్ నిర్వహణకు అనుమతి లభించలేదని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్‌లోనే జూనియర్ ఫ్యాన్స్ సమావేశమై చర్చించారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కొందరు అసభ్య పదజాలం ఉపయోగించినప్పుడు చాలామంది ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా, జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభిమానుల సమావేశానికి కొంతమంది నిర్మాతలు, ముఖ్యులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారని చెబుతున్నారు.
Also Read: TVK VS JANASENA: విజయ్‌ది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..?
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇప్పటికే ఆ వాయిస్ తనది కాదని మీడియాకు స్పష్టం చేశారు. అయితే, ఆ ఆడియో ఎవరిది, అందులో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు మాట్లాడారు అనే విషయాలను ప్రభుత్వం, పోలీసులు తేల్చాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. ఎన్టీఆర్ తల్లిని దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ మహిళపైన అనుచితంగా మాట్లాడినా అదే విధమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ స్పందించకపోవడం పట్ల వారిలో అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తారక్‌ని సీమకు రప్పించాలని వారు పట్టుదలగా ఉన్నారట. అందుకు వేదికగా సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదిన వేడుకలను అనంతపురంలోనే నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి తారక్‌ని ఆహ్వానించి, ఎలాగైనా సరే ఒప్పించి తీసుకురావాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.
అయితే, ఎక్కడైతే అవమానం జరిగిందో అదే గడ్డపై గర్జించాలన్న అభిమానుల కోరికని తారక్ నెరవేరుస్తారో లేదో అనుమానమే. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి ఆడియో కాల్ విషయంలో చాలా సీరియస్‌గా రియాక్ట్ అయినట్లు సమాచారం. నారా లోకేష్ సైతం సదరు ఎమ్మెల్యే పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయాలని తారక్ అనుకోవడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాను అనంతపూర్ వస్తే అటు పార్టీకి, ఇటు అభిమానులకు దూరం మరింత పెరుగుతుందని సున్నితంగానే అభిమానుల కోరికని తిరస్కరిస్తున్నారని సమాచారం. జరుగుతున్న ప్రచారంలో ఎంతమేర వాస్తవం ఉందో తెలీదు కానీ, ఒక వేళ తారక్ సీమలో అడుగుపెడితే మాత్రం రచ్చ మామూలుగా ఉండదని సినీ, రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.