Janasena LP Meeting: స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృస్టించేలా పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమిలోని టీడీపీ, బీజేపీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, ఒకే గొంతుకతో ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. అదే సమయంలో ‘త్రిశూల్ వ్యూహం’ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పవన్.
సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మూడు గంటలపాటు పవన్ సుదీర్ఘ చర్చలు జరిపారు. పాలన, రాజకీయ అంశాలపై మార్గదర్శనం చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తలో ఐదు నియోజకవర్గాల బాధ్యత తీసుకొని, అక్కడ పార్టీ శ్రేణులతో మమేకమై, పర్యటనలు నిర్వహించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. రహదారుల నిర్మాణం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసి ఆరు వారాల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
Also Read: Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వానికి జగన్ భయం’ పట్టుకుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు
పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, ‘జెన్ జీ’ ఆలోచనలను అర్థం చేసుకోవాలని పవన్ నొక్కి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ‘జనవాణి’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారాల కోసం కృషి చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కు వందల కోట్లు వృథా చేసిందని విమర్శిస్తూ, దాని సద్వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం నిలబడి, బలమైన నియోజకవర్గాల్లోనూ పోటీ నుంచి తప్పుకున్న జనసేన కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని, వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల ఓ కీలక సూచన చేశారు. గత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన నష్టాన్ని వివరిస్తూనే… రెగ్యులర్‌గా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించి, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ముందుగా స్పష్టత తెచ్చుకోవాలన్నారు.
2024 ఎన్నికల్లో 21 సీట్లకు 21 గెలిచిన జనసేన, ఇప్పుడు 100కు పైగా నియోజకవర్గాల్లో బలపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూటమితో సమన్వయం, యువత ఆకాంక్షలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలతో జనసేన మరో ప్రభంజనం సృష్టించేందుకు పవన్ సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తున్నారు.