Jagan Security Game: నాకు సానుభూతి కావాలి. అందుకోసం నాపై హత్యా ప్రయత్నం జరగాలి. కానీ నేను బతకాలి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాపై అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. టీవీ వాళ్లు కవర్ చేస్తారు. అది చూసి నా అభిమానులు ఇద్దరు ముగ్గురు కిరోసిన్ పోసుకుని కాల్చుకుని చస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్టెచర్ మీద పడుకుని ఇంటర్వూలు ఇస్తాను. వీల్ చైర్‌లో వెళ్లి ఓటేస్తాను. వీల్ చైర్ టు సీఎం చైర్ అనమాట. ఇదంతా ఏంటంటారా? అతడు సినిమాలో షియాజీ షిండే ముఖ్యమంత్రి అవ్వడానికి వేసే స్కెచ్. ఆ స్కెచ్‌ను అమలు చేయడానికి ఫ్రొఫెషనల్ షార్ఫ్ షూటర్ మహేష్‌బాబును రంగంలోకి దింపుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటారా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ ముహూర్తంలో ఆ సీన్ రాశాడో కానీ.. ఏపీలో ఇప్పుడు అదే సీన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ‘అతడు’ సినిమాలోని సీన్ ఏపీ రాజకీయాల్లో రిపీట్ కాబోతోందా? అన్న చర్చ జరుగుతోంది.
ఓటమి నిర్వేదంతో తొలి ఆరు నెలలు ప్రజల్ని ఆడిపోసుకున్న జగన్… తర్వాత కోలుకుని, రాజకీయం మొదలు పెట్టాడు. అయితే ఆయన చేస్తున్న రాజకీయం గతంలో ఏ పొలిటీషియన్ కూడా చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు. పద్ధతిగా ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రశ్నించడం, ప్రజల పక్షాన పోరాడటం అసలే ఉండదు. దానికి బదులుగా బల ప్రదర్శనలనే నమ్ముకుని ముందుకెళ్తున్నారు. “ప్రజలు జగన్‌ని ఓడించడానికి ఒక్క కారణం కూడా లేదు. జగన్ అందించినంత గొప్ప పాలన చరిత్రలోనే ఏ పాలకుడూ అందించలేదు. అసలు జగన్‌ని ఓడించింది ఈవీఎంలే కానీ ప్రజలు కాదు. కాబట్టి ప్రజా పోరాటాలు చేయాల్సిన పనే లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు చంద్రబాబును దింపేసి, సీఎం కుర్చీపై జగన్‌ను కూర్చోబెడతారు” ఇదీ వైసీపీ రచించుకున్న స్క్రిప్ట్. తమ వాదనకి బలం చేకూర్చేలా.. జగన్ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటూ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పెళ్లికి వెళ్లినా, చావుకు వెళ్లినా బల ప్రదర్శన జరగాల్సిందే. జనం వచ్చినా, రాకున్నా వీఎఫ్‌ఎక్స్ దట్టించైనా సొంత మీడియా, సోషల్‌మీడియాలలో ప్రచారం చేయాల్సిందే. ఇదే తరహా రాజకీయం చేసుకుంటూ వెళ్లి… చివర్లో కోడికత్తి డ్రామా లాంటి ఓ క్లయిమ్యాక్స్ ప్లాన్ చేస్తే సరిపోతుందని వైసీపీ భావించినట్లుందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read: Andhra Premier League: నేటి నుంచి ఐపీఎల్ తరహాలో ఆకట్టుకుంటున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్
పరామర్శల పేరిట జగన్ జనంలోకి రావడం ఎప్పుడైతే మొదలైందో.. అప్పటి నుండే వైసీపీ ఓ వాదన బలంగా వినిపిస్తోంది. జగన్‌కి ప్రాణ హాని ఉందని, కూటమి ప్రభుత్వం కావాలనే భద్రత కుదించిందని, జగన్ ప్రాణాలకు అసలు రక్షణే లేదని ఒకటే ఊదరగొడుతున్నారు వైసీపీ నాయకులు. తమకు అనుకూలమైన మీడియాలో ఇదే తరహా వార్తల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా చానల్‌లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు చేత “షార్ప్ షూటర్” కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది వరకే చెప్పుకున్నాం కదా.. అతడు సినిమా కాన్సెస్ట్. అదేననమాట. అయితే అక్కడ ఒక్కడే షార్ప్ షూటర్. ఇక్కడ 200 మంది షార్ప్ షూటర్లు అంటూ స్క్రిప్ట్ రాసేసుకున్నారు. సదరు జర్నలిస్టు అత్యుత్సాహంతో అమెరికా నుంచి షార్ప్ షూటర్లు, ఆఫ్రికా నుంచి అడవి మనుషులు, నార్త్ కొరియా నుండి కిమ్ మనుషులు దిగారంటూ పైత్యపు కథనాలను వండి వార్చాడు. అయినా ఫిజికల్‌గా ఎలిమినేట్ చేయాలంటే ఒక షార్ప్ షూటర్ సరిపోడా? 200 మంది కావాలా? ట్రంప్‌కు కూడా ఇంత ఎలివేషన్ ఇవ్వరేమో. కానీ జగన్‌ని ఆ రేంజ్‌లో ఊహించుకున్నారు సదరు పేటీఎమ్ జర్నలిస్టు. ప్రస్తుతం ఆయన పోలీసుల విచారణలో చెబుతున్న అబద్దాలు వేరే లెవెల్ అనుకోండి. అది వేరే విషయం.
మొదట జగన్‌కి రక్షణ లేదంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం మొదలెట్టారు. తర్వాత అనుకూల మీడియాలో షార్ప్ షూటర్ కాన్సెప్టులను వండి వార్చారు. తాజాగా జగన్ 40 మంది ప్రయివేటు బాడీ గార్డులను నియమించుకున్నారు. ఇదంతా ప్రజల్ని నమ్మించడానికి ఒక సీక్వెన్స్‌లో క్రియేట్ చేస్తున్న కాన్సిరెసీ థియరీగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ కోడికత్తి, గులరాయి అనుభవాలు ఎదుర్కొన్నారు ఏపీ ప్రజలు. ఈసారి ఏం చేసినా జనం నమ్మరని.. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారన్న ఆందోళనలు, భయాలు పలువురిలో వ్యక్తమవుతున్న మాట వాస్తవం. కాబట్టి భద్రత పేరిట జగన్ చేస్తున్న రాజకీయంపై కూటమి ప్రభుత్వం, నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉండటం మంచిదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

