Jagan Mama Get Ready: వైఎస్ షర్మిల కుమారుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముద్దుల మనవడు, వైఎస్ రాజారెడ్డి ముని మనవడు.. రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ వర్గాలు. కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల వెళ్తున్న సందర్భంగా.. తన తనయుడు రాజారెడ్డిని సైతం వెంటబెట్టుకుని వెళ్లారు. తల్లి వెంట అడుగుల్లో అడుగులు వేసుకుంటూ బయలుదేరే ముందు షర్మిల తనయుడు రాజారెడ్డి.. తన అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
జగన్ కూతుర్లు ఇద్దరూ బిజినెస్ స్కూల్స్‌లో చదువుకుని వ్యాపారాల్లోనే సెటిల్ అవడంతో.. వైఎస్ ఫ్యామిలీ తర్వాతి తరం వారసుడిగా షర్మిల కుమారుడు రాజారెడ్డే కనిపిస్తున్నారు. రాజారెడ్డి గత ఏడాది విదేశాల్లో బైబిల్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి అడుగు జాడల్లో క్రైస్తవ సమావేశాల్లో ప్రసంగిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన కూడా తండ్రి అనిల్ కుమార్ లాగే పాస్టర్ అవుతాడని అనుకున్నారు. అయితే అది కేవలం భక్తి కోసమేనని.. రాజకీయాలనే తన ఫ్యూచర్‌గా మలచుకోవాలని ఆయన డిసైడయినట్లుగా తెలుస్తోంది. షర్మిల కూడా ఆ దిశగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. జగన్, షర్మిల మధ్య అంత తీవ్రమైన గ్యాప్ రావడానికి కారణం షర్మిల కొడుకు రాజారెడ్డి అంశం కూడా ఒక కారణమన్న చర్చ వైఎస్ కుటుంబ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా, షర్మిలకు కొడుకు రాజారెడ్డితో పాటూ మరో కుమార్తె ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా తన మనవడికి తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టారట. చిన్నతనం నుండి రాజారెడ్డిని అత్యంత గారాబంగా చూసుకున్నారట వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం, జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగడం, ఇక తన వెంట వచ్చేది ఎవరని జగన్ చూస్తున్న సమయంలో… వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి, భారతి రెడ్డి మేనమామ వైఎస్ భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వజూపిందని, అలా భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని కూడా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ చూసిందని పులివెందుల రాజకీయవర్గాల్లో ఒక భోగట్టా.
Also Read: Malla Reddy: చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలి..
ఆ పరిస్థితులని క్యాష్ చేసుకుంటూ.. వైఎస్ అవినాశ్‌రెడ్డికి రాజకీయంగానూ, పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించినట్లయితే.. తామంతా జగన్ వెంటే నడుస్తామని భారతి రెడ్డి ద్వారా భాస్కర్‌రెడ్డి వర్గం ఆ రోజు కండిషన్ పెట్టిందని, అందులో భాగంగానే అవినాశ్ రెడ్డికి జగన్ కడప ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందని చెబుతారు. అలా పూర్తిగా అవినాశ్‌రెడ్డి కుటుంబానికి, భారతి కుటుంబానికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం చూసిన షర్మిల.. తన బిడ్డల పరిస్థితి ఏంటి? తన కుటుంబానికి కూడా ప్రియార్టీ కావాలని డిమాండ్లు వినిపించడమే.. ఇద్దరి మధ్యా వివాదానికి దారితీసిందట. వైఎస్సార్ వారసులుగా తన కుటుంబం, తన బిడ్డలు కూడా రాజకీయాల్లో ఉంటారని షర్మిల ఆనాడే తేల్చి చెప్పిందని చెబుతారు. ముఖ్యంగా ఆస్తిలోనూ తన బిడ్డలకు సమానంగా వాటా అడగటం కూడా షర్మిలని జగన్ దూరం పెట్టడానికి మరో కారణమని అంటారు.
ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ విఫలమవుతున్న నేపథ్యమే తన కుమారుడిని అరంగ్రేట్రం చేయించడానికి సరైన సమయం అని షర్మిల భావించినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌కి చరిస్మా లేకపోవడంతో ఆమె చేస్తున్న కార్యక్రమాలు కూడా ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల రాజారెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. జగన్, షర్మిల ఇద్దరిలో అసలైన వైఎస్సార్ వారసులు ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు వైఎస్ కుటుంబంలో కానీ, అభిమానుల్లో కానీ మెజార్టీ జగన్ వైపే నిలబడ్డారు ఇప్పటి వరకూ. అంటే వైఎస్సార్ లెగసీ పూర్తిగా జగన్ ఆక్రమించేశారని చెప్పొచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇందులో షర్మిల పైచేయి సాధించలేకపోయారు. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లో కొడుకుని కాదని, కూతుర్ని వారసురాలిగా గుర్తించే పరిస్థితులు లేవు. దీంతో షర్మిల సరైన టైం చూసుకుని తన కొడుకుని వైఎస్సార్ వారసుడిగా బరిలో దింపుతున్నారు. ఇప్పుడు వైఎస్సార్ లెగసీ కోసం వార్.. జగన్ రెడ్డి వర్సెస్ రాజా రెడ్డి మధ్య జరగబోతోందనమాట. రాజకీయ వ్యూహాల్లోకానీ, పట్టుదలలో కానీ, వాక్చాతుర్యంలో కానీ, తండ్రిని అనుకరించడంలో కానీ షర్మిల జగన్ కన్నా ఒక మెట్టు పైనే ఉంటారు కానీ, జగన్ కన్నా ఎందులోనూ తీసిపోరు. కానీ ఆమెకు లేనిది, ఆమె వెంట రానిది వైఎస్సార్ లెగసీ. కానీ నేడు వైఎస్సార్ మనవడిగా షర్మిల కుమారుడు ఆ లెగసీని ఈజీగా అందుకునే అవకాశం ఉంది. ఇక తల్లి చేతిలో రాజారెడ్డి రాజకీయ మెలుకవలు నేర్చుకుంటే… జగన్‌కి పోటీగా వైఎస్ కుటుంబంలోనే మరో పవర్ సెంటర్ పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటు కాంగ్రెస్‌ని విభేదించి సొంత పార్టీ పెట్టుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వైఎస్ జగన్ రెడ్డి, అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకూ విధేయుడిగా పని చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి అరంగేట్రం చేయబోతున్న రాజారెడ్డి మధ్య… రాజకీయం ఎలా ఉండబోతోందో రాబోయే రోజుల్లోనే చూడాలి. ఎలా చూసినా.. షర్మిల వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికే దక్కేలా పకడ్భందీగా ప్లాన్ చేస్తారనడంలో సందేహం లేదు. బ్రదర్ అనిల్ కుమార్ కూడా తన కుమారుడికే తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.