Jagadeesh Inner Politics

Jagadeesh Inner Politics: మాజీ ఎమ్మెల్యేలపై కర్ర పెత్తనం

Jagadeesh Inner Politics: అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అడ్డుకట్ట పడటం లేదట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు సెగ్మెంట్‌లలో ప్రస్తుతం గులాబీ పార్టీకి సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోటలో బిఆర్ఎస్ పార్టీకి అన్ని తానైన జగదీష్ రెడ్డి సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు చెక్ పెడుతున్నాడని చర్చ జరుగుతోంది. మాట వినని మాజీ ఎమ్మెల్యేల విషయంలో.. తనకు దగ్గరగా మెలిగే స్థానిక నేతలను రంగంలోకి దింపి ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారనే టాక్ వినపడుతుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా అదే ఆటిట్యూడ్ చూపిస్తున్నారట జగదీశ్ రెడ్డి. దాంతో కొంతమంది మాజీలు రగిలిపోతున్నారట. అవకాశం వస్తే మహబూబ్ నగర్ తరహాలో జంపింగ్ జపాంగ్‌ పాలిటిక్స్‌ చేయాలని స్కెచ్‌లు వేస్తున్నారట.

తెలంగాణ ఉద్యమం నుంచి మాజీ సీఎం కేసీఆర్‌కు జగదీశ్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి తన ప్రాబల్యం పెంచుకుంటూ గట్టి పట్టు సాధించే ప్రక్రియలో భాగంగా తనతో ఉద్యమంలో కలసి పనిచేసిన సహచర సమకాలిన లీడర్లను ఒక్కొక్కరిగా సైడ్ చేసుకుంటూ పాలిట్రిక్స్ చేశారనే టాక్ ఉంది. అదే సమయంలో తన మాట వినని వారిని పెద్దాయన పేరు చెప్పి నయానో భయానో తన దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నాలూ చేశారట. ఇక కొందరి విషయంలో పొమ్మనలేక పొగబెట్టారనే గుసగుసలు వినిపించాయి. నాగార్జున సాగర్, నకిరేకల్, భువనగిరి, కోదాడ సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యేలకు తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తూ చిక్కాకు తెప్పిస్తున్నాడట. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉండగా అక్కడ ప్రసన్న రాజ్ అనే లీడర్‌ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ చిరుమర్తికి చెక్ పెడుతున్నారట.

Also Read: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక ఆధారాలతో సిట్ ముందుకు బండి సంజయ్

నాగార్జున సాగర్‌లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉండగా తన అనుచరుడు, ఎమ్మెల్సీ కోటిరెడ్డిని… అదేవిధంగా భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా చింతల వెంకటేశ్వర్ రెడ్డిని, ఆలేరులో గొంగిడి సునీతకు బదులుగా బూడిద భిక్షమయ్య గౌడ్‌ని, కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు పోటీగా శశిధర్ రెడ్డికి సహాయ సహకారం అందిస్తూ మాజీలకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం వచ్చే ఎన్నికల నాటికల్లా తన అనుచరులను తయారు చేసే పనిలో పడ్డారట జగదీశ్ రెడ్డి. ఇక మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీరుతో విసుగు చెందిన మాజీలు, సీనియర్ లీడర్లు… ఎన్నో సార్లు ముఖ్య నేతల వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నా కూడా… ఆయనతో సర్దుకుపోవాలని సూచించడంతో ఇక చేసేదేమి లేక రానున్న రోజుల్లో తమదారి తాము చూసుకోవడమే బెటర్ అని ఫిక్సయారట.

ఇదిలావుంటే ఓ వైపు జగదీశ్ రెడ్డి తీరుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు లోలోపల రగిలి పోతుండగా, మరోవైపు తాజాగా ఆ జాబితాలోకి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరిపోయారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌ నాశనం కావడానికి కారణమే ఆ లిల్లీపుట్ నాయకుడంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు కవిత. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరుంటూ విరుచుకుపడ్డారు. గత ఎలక్షన్‌లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచాడు తప్ప… ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదంటూ జగదీశ్ రెడ్డిపై మండిపడ్డారు. మొత్తానికి సొంత పార్టీ నాయకురాలు సైతం విమర్శలు గుప్పించడం పొలిటికల్ సర్కిల్‌లో తెగ చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో జగదీశ్ రెడ్డి ఒంటెద్దు పోకడలు తగ్గించుకొని పార్టీలో లీడర్లను కలుపుకొని పోకపోతే వచ్చే ఎన్నికల్లో ఉన్న ఆ ఒక్క సీట్ కాస్త హుష్ పటాకే అన్న టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *