Hodha Leni Yodhuḍu: “పెట్టండి డీజేలు. కొట్టండి జేజేలు. పెట్టండి కటౌట్లు. కొట్టండి చప్పట్లు. చల్లండి పూలు. వేయండి ఈలలు. సంబరాలకు సిద్ధం కండి. పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకోండి. జూన్ 4న మోత మోగిపోవాల.. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లి పోవాల. ఆ రోజు ఫ్యాన్ జోరు మామూలుగా ఉండదు. ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151 మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది వాళ్లో వీళ్లో చెప్పిన మాట కాదు. ఇది ఏపీ పొలిటికల్ స్ర్కీన్‌పై వందడుగుల కటౌట్.. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట ‘సరికొత్త చరిత్ర’ అనే మాట.. జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. ఈ సునామీలో కూటమి పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతోంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా ప్యాన్ పార్టీ క్లీన్ స్పీప్ చేయబోతోంది.. కుప్పంతో సహా.” ఇవీ.. గత ఏడాది ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీ మోగించిన బాజా భజంత్రీలు. సీన్ కట్ చేస్తే.. 2024 జూన్ 4 రానే వచ్చింది. గిరాగిరా తిరిగి ఫ్యాను 11 దగ్గర ఆగిపోయింది. కూటమి 164 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ప్రజలచ్చిన షాక్‌తో జగన్ ఫేస్ వాడిపోయింది. ఓటమిని ఓర్చుకోలేని జగన్.. ప్రెస్మీట్ పెట్టి ప్రజల్ని ఆడిపోసుకున్నారు. ఆ అక్కచెల్లెమ్మల ఆప్యాయతలు, అవ్వాతాతల అనురాగాలు ఏమయ్యాయో అంటూ ఫేస్‌లో క్వశ్చన్ మార్క్‌తో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఎందుకు ఓడానో తెలీదంటూ జగన్ ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్‌కి.. ఒకటి కాదు, రెండు కాదు వంద సమాధానాలు, వంద కారణాలు ఉన్నాయంటూ అన్ని మీడియాల్లోనూ పుంకాలు పుంకాలుగా కథనాలొచ్చాయి. ఐదేళ్లు వైసీపీ పాలనకు వంత పాడిన కొన్ని మీడియా చానళ్లు, కొందరు మేతావులు సైతం.. “ఇప్పటికైనా నిజం తెలుసుకో జగన్” అంటూ సుద్దులు చెప్పారు. “సిద్ధం సభలకు వచ్చిన ఆ జనమంతా ఏమయ్యారు? ఎటుపోయారు? ఎక్కడ ఓటేశారు? మీ సభలకు వచ్చి, కూటమి పార్టీలకు ఓటేశారా? ఇప్పటికైనా జగన్ రియాల్టీ షో నుండి బయటపడరా” అంటూ నిలదీశారు కూడా. కానీ చివరికి ఏమైంది. “చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే” అయిందని, ఏడాది తర్వాత కూడా జగన్‌లో ఏ మార్పు రాలేదని స్పష్టమైంది. వైసీపీ ఓటమికి కొన్ని వందల కారణాలు చెప్పినా.. ఒక్కటంటే ఒక్క కారణాన్ని కూడా జగన్ తలకెక్కించుకున్నట్లు కనబడటం లేదు.
వైసీపీ ఘోర పరాజయానికి నేటికి సరిగ్గా ఏడాది. హోదా లేని ప్రతిపక్ష నేతగా జగన్ రాజకీయ జీవితానికి కూడా నేటితో ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో జగన్ చేసిన రాజకీయం, ఏపీ రాజకీయాల్లో ఆయన పోషించిన రోల్.. 11కు పడిపోయిన వైసీపీని కోలుకునేలా కాకుండా.. మరింత దిగజారేలా చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఓడాక తొలిసారి 11 మంది ఎమ్మెల్యేలతో ధీన వదనంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్… పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన 2 నిమిషాలకే సభ నుండి తుర్రుమన్నారు. సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాల పాటు అసెంబ్లీకి హాజరు కాకుంటే సభ్యత్వం రద్దవుతుందని కూటమి పార్టీల నేతలు ప్రచారం చేయడంతో.. అటెండెన్స్ కోసం మరోసారి అసెంబ్లీకి వచ్చారు. కానీ పట్టుమని 11 నిమిషాలు కూడా సభలో ఉండలేక వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో ట్రోలింగ్స్‌కు గురై పరువు పోగొట్టుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోవడానికి జగన్ చెప్తున్న కారణాన్ని ఏ ఒక్కరు కూడా సమర్థించడం లేదు. ప్రజాసామ్యంలో అధికారం కట్టాబెట్టాలన్నా ప్రజలే. ప్రతిపక్షంగా గుర్తించాలన్నా ప్రజలే. జగన్ నిజంగా ప్రజల కోసం నిలబడి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే.. ఆ ప్రజలే ప్రతిపక్షంగా గుర్తిస్తారు. దానికి సంఖ్యా బలంతో, సీట్లతో నిమిత్తం లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జనసేన పార్టీని బలమైన ప్రతిపక్షంగా గుర్తించింది ప్రజలే. అప్పుడు ఆ పార్టీకి ఉన్నది ఒక్క సీటే.
Also Read: Pawan On Yuvagalam: ఆనాటి నుండి మొదలైన పవన్-లోకేష్‌ల మైత్రి..
Hodha Leni Yodhuḍu: ఇక ఏడాదిలో జగన్ మూడు రోజులు తాడేపల్లిలో ఉంటే.. నాలుగు రోజులు బెంగళూరులో గడుపుతున్నారు. నెలకో పోరాటానికి పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకులను, క్యాడరును రోడ్డెక్కమని చెప్తున్నారు. కానీ పార్టీని నడిపే అధినేతగా తాను మాత్రం రోడ్డెక్కరు. పోరాటంలో పాల్గొనరు. 2014 నుండి 2019 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తీరు ఇలా ఉండేది కాదు. నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. నేడు శవం ఉందంటే తప్ప బయటకు రావడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ ప్లాన్ చేస్తున్న నిరసనలు వరుసగా బ్యాక్ ఫైర్ అవుతుండటం చూస్తే.. ఒక వ్యూహం అంటూ లేకుండా జగన్ గుడ్డిగా రాజకీయం చేస్తున్నారని అర్థమౌతుంది. విద్యార్థుల ఫీజు బకాయిల్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలో.. జగన్ “ఫీజుపోరు” అంటూ పిలుపిచ్చారు. నేడు సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసి, ఫ్రీ బస్సు, తల్లికి వందనం, అన్నదాతకు భరోసా వంటి పథకాలకు నిర్ధిష్టమైన తేదీలను సైతం ప్రకటించాక.. “వెన్నుపోటు దినం” అంటూ నిరసనలు జరుపుతున్నారు. ఇలా జగన్ పిలుపునిస్తున్న పోరాటాలన్నీ అనవసర రాద్ధాంతాలుగా మిగిలిపోతున్నాయి తప్ప.. ఆ పార్టీకి మైలేజీ ఎక్కడా రావడం లేదు. కేవలం కక్ష, విద్వేషంతోనే జగన్ రాజకీయం నడుస్తోంది తప్ప.. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఎక్కడా కనబడటం లేదు.
ఇక ప్రపంచంలో ఏ నాయకుడూ చేయని పని.. తనకు మాత్రమే సాధ్యమవుతుందని తన తెనాలి పర్యటన ద్వారా రుజువు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఏకంగా సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లకు మద్ధతిచ్చి వచ్చారు. జగన్ మారాలని ఇప్పుడు కోరుకుంటోంది ప్రజలో, కూటమి పార్టీల నేతలో కానే కాదు. జగన్ ఇలా ఉంటేనే… తమ అధికారం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని కూటమి పార్టీలు నిశ్చింతగా ఉన్నాయి. జగన్ మారాలని కోరుకుంటోంది ఆ పార్టీ క్యాడర్, లీడర్లే. చూడాలి మరి. జగన్‌లో మార్పు వస్తుందో రాదో.