HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నిజాలు తేల్చేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిద్దాంత్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. 10, 11 తేదీల్లో ఫీల్డ్ విజిట్, స్టూడెంట్స్, హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్‌తో భేటీ అయి పలు వివరాలు సేకరించనున్నారు. అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో కేంద్ర నిపుణుల కమిటీ భేటి అయి పలు కీలక విషయాలు సేకరించనుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసుకొని.. వారు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
అటవీశాఖ రికార్డుల ప్రకారం.. అవి రక్షిత అటవీ ప్రాంత భూములు కావని, అయితే చెట్లు పెరగడంతో పచ్చదనం ఉందని, అప్పుడప్పుడు వన్యప్రాణుల సంచారం ఉందని, పక్షులూ ఉన్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. కంచ గచ్చిబౌలిలోని భూముల్లో చెట్ల నరికివేతను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఆ భూముల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, చెట్ల నరికివేతకు అనుమతులు, పర్యావరణ మదింపు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుతాన్ని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు విడివిడిగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. అరణ్య భవన్లో, సచివాలయంలో తాజాగా జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి వారు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వివరించినట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు సగం భూముల్లో పెద్దపెద్ద బండరాళ్లున్నాయి. గచ్చిబౌలి స్టేడియం నిర్మించినప్పుడు అక్కడ తవ్విన బండరాళ్లను, సమీపంలో ఓ కాలనీ నిర్మాణ సమయంలో అక్కడి రాళ్లను తెచ్చి ఇక్కడ వేశారు. దీంతో సగం ప్రాంతం రాళ్లతో నిండి కనిపిస్తోంది. మిగతా సగ భాగంలో 150 ఎకరాల్లో చెట్లున్నాయి. మరో 50 ఎకరాల్లో హెచ్సీయూ భవనాలు, రహదారులు ఉన్నాయి. జింకలు, నెమళ్ల సంచారం ఉంది. అయితే అవి 400 ఎకరాల భూములకు మరోవైపున ఉన్నాయి. ఈ భూముల పక్కన ఓ నీటి వనరు ఉంది. అది నీటి పారుదలశాఖ నియంత్రణలో ఉంది. అందులోని నీళ్లు తాగేందుకు జింకలు, ఇతర వన్యప్రాణులు ఈ భూముల మీదుగా వచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: BRS Cader: వరంగల్ సభపైనే బీఆర్‌ఎస్ ఆశలన్నీ
HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూముల్లో 150 ఎకరాల్లో చెట్లు ఉండగా 90% సుబాబుల్ చెట్లే ఉన్నాయి. ఇవి మినహాయింపు జాబితాలో ఉన్నందువల్ల వీటిని నరికేందుకు అనుమతులు అవసరం లేదు. మరో 5% వరకు గ్లిరిసిడియా, ల్యాంటానా వంటి చెట్లు ఉన్నాయి. ఇవి కూడా నరికివేతకు మినహాయింపు జాబితాలోనివే. మిగిలిన 5% చెట్ల నరికివేతకు, ట్రాన్స్ లొకేషన్‌కు అనుమతి అవసరం. ఈ జాబితాలో ఉన్న వేప వంటి చెట్లను ఇటీవల భూములను చదును చేసిన సందర్భంగా నరికివేయ లేదని ప్రభుత్వానికి అటవీ అధికారులు వివరించినట్లు తెలిసింది.
సుప్రీంకోర్టు అడిగిన అంశాలపై క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఉన్నదున్నట్లుగా నివేదించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎస్ ద్వారా క్షేత్రస్థాయి నివేదికను ఈ నెల 16న కోర్టుకు సమర్పించనునట్లు సమాచారం. రాష్ట్రంలో పర్యటించే సుప్రీంకోర్టు నిపుణుల కమిటీకి కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం చెప్పనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.