HCU Fake Movement

HCU Fake Movement: సేవ్ హెచ్‌సీయూ.. నాణేనికి మరో కోణం!

HCU Fake Movement: తెలంగాణలో నిరుద్యోగం ఒక దీర్ఘకాల సమస్యగా మారింది. లక్షలాది యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ సమీపంలోని 400 ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ భూములు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. అలాంటి ఖరీదైన భూములు ఉపయోగం లేకుండా ఉండటం కంటే, వాటిని అభివృద్ధికి వినియోగించి, ఉద్యోగాలు సృష్టించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇది తప్పు ఎలా అవుతుంది? అని రేవంత్‌ సర్కార్‌ వాదిస్తోంది.

ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ రంగాన్ని విస్తరించి, ఆర్థిక వృద్ధిని సాధించడమే ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్‌గా పేరొందింది. ఈ ప్రాంతంలో కొత్త కంపెనీలు వస్తే, వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ఇది నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా మారుతుంది. అయితే, విద్యార్థులు, పర్యావరణ వాదులు ఈ నిర్ణయాన్ని పర్యావరణ విధ్వంసం అంటూ వ్యతిరేకిస్తున్నారు. వారి వాదన… ఈ భూముల్లో అనేక రకాల వృక్ష జాతులు, కొన్ని వన్యప్రాణులు ఉన్నాయని, వాటిని కాపాడాలని. కానీ, ప్రభుత్వం చెబుతోంది… ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏమీ కాదనీ, అంతగా జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం కూడా కాదని. ఈ 400 ఎకరాల్లో పెద్దగా పచ్చదనం లేదని, కానీ ఉన్నదానికంటే అతిగా చూపిస్తూ భావోద్వేగ ఉద్యమం నడుస్తోందని అధికారులు వాదిస్తున్నారు.

HCU Fake Movement: పర్యావరణ పరిరక్షణ ముఖ్యమే. ఎవరూ దాన్ని కాదనడం లేదు. కానీ, అభివృద్ధి లేకుండా రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది? ఈ భూములను వేలం వేసి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటూ, వచ్చే నిధులను రాష్ట్ర అవసరాలకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్తోంది. విద్యార్థుల ఆందోళన వెనుక రాజకీయ ప్రోద్భలం ఉందన్న సందేహాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతూ, యువతను రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Also Read: Warangal Chpata Chilli: వ‌రంగ‌ల్ చ‌పాటా మిర్చికి అరుదైన గుర్తింపు

ఎమోషన్స్‌ను పక్కనపెట్టి, వాస్తవికంగా ఆలోచిస్తే…. ఈ భూములు ఎప్పటికైనా అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిందే అన్న వాస్తవం కనబడుతుంది. నగర విస్తరణలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు అనివార్యం అన్న నిజం అర్థమవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇక్కడ మరే దురుద్దేశాలు కనబడవు. అయితే… పర్యావరణాన్ని కాపాడుతూనే, అభివృద్ధిని సాధించే సమతుల్యతను ప్రభుత్వం పాటిస్తుందని ఆందోళనకారుల్లో నమ్మకం కల్పించాల్సి ఉంది. ఇది కేవలం ధ్వంసం కాదు, భవిష్యత్తు కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అని అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. యువత కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, రాష్ట్రం మరింత ముందుకెళ్లే అవకాశం ఉందంటున్నారు ప్రభుత్వ వాదనలో ఏకీభవిస్తున్న పలువురు పరిశీలకులు, మేధావులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *