Go back Marwadi

Go back Marwadi: ఎందుకో..? గీ పంచాయతి..! ఎవరి కోసమో.. గీ లొల్లి..??

Go back Marwadi: తెలంగాణలో ఇప్పుడు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం హాట్ టాపిక్‌గా మారింది. మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరతీశాయి. రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడీలు ప్రజలకు బిజినెస్ అవకాశాలు లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతుగా మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన మార్వాడీ వ్యాపారాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడంతో, స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు వెలువడుతున్నాయి.

ఈ ఉద్యమం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది పక్కనపెడితే, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇలాంటి వివాదాలు పురుడుపోసుకోవడం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. మరి దీనిపై ఎవరికి ఆసక్తి ఉంది? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని అంటే, అదంతా రాజకీయ నిరుద్యోగుల పని అని మరికొందరు అంటున్నారు. ఒకరకంగా ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అంటూ సరికొత్త వాదనను తెరమీదికి తెస్తున్నాయి హిందూ సంస్థలు. దీనికి మొదట్లోనే చెక్ పెట్టకుండా ఇలాగే కొనసాగిస్తే, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కూడా అంటున్నారు మరికొందరు. వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి, దాన్ని ఒక సెంటిమెంట్‌గా మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. అసలు ఈ ‘గో బ్యాక్’ నినాదం ఆషామాషీగా చేసింది కాదని, దీని వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని, అర్బన్ నక్సల్స్ పాత్ర కూడా ఉందంటూ ఇటు బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Also Read: TikTok: టిక్‌టాక్‌పై నిషేధం..? కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

బీజేపీకి అండగా నిలిచే మార్వాడీలను అణిచివేసేందుకు ఈ ఉద్యమం పుట్టిందని బీజేపీ ఆరోపిస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కొందరు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడటంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. మార్వాడీలు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేయడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారు కనీసం జీఎస్టీ, రాష్ట్ర పన్నులు కూడా చెల్లించడం లేదని, ఆన్‌లైన్ లావాదేవీలను అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ నేతలు దీనిని ఖండిస్తున్నారు. మార్వాడీలను బీజేపీకి దూరం చేయడానికే ఈ ఉద్యమాన్ని బీఆర్ఎస్ తెరమీదకు తెచ్చిందని ఆరోపిస్తూ, మార్వాడీలు రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేస్తున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద, తెలంగాణలో మరో ఉద్యమం రూపుదిద్దుకోవడం రాజకీయంగా ఎవరికి లాభమో తెలియదు కానీ, క్షేమకరం మాత్రం కాదని పలువురు తెలంగాణ సామాజికవేత్తలు అంటున్నారు. అయితే, ఈ నిరసనలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి.

ALSO READ  Mahaa Vamsi: మిస్ మ్యాగీ సంచలనం..విచారణకు రేవంత్ ఆదేశం..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *