Gajwel Political Heat: గజ్వేల్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు అదే గజ్వేల్‌ని సెంటర్‌గా చేసుకుని కేసీఆర్‌ని టార్గెట్ చేస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గజ్వేల్‌లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. అసెంబ్లీలో నల్లపూసలా మారారు. ఆయన అసెంబ్లీ గడప తొక్కింది కేవలం రెండంటే రెండు రోజులు మాత్రమే. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు రోజులు.. తీసుకున్నది 57 లక్షలు… అంటూ ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ కూడా పేల్చారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
అధికార కాంగ్రెస్‌తో పాటూ బీజేపీ నాయకులు కూడా.. మాజీ సీఎంను లక్ష్యంగా చేసుకొని సరికొత్త రాజకీయం మొదలు పెట్టారట. మల్లన్నసాగర్ భూనిర్వాసితులు ఈనెల 18న కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తమ 14 ముంపు గ్రామాల సమస్యలపై గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి అన్నది ఆ లేఖ సారాంశం. సీఎంగా ఉన్నప్పుడు తమకు ఇచ్చిన హామీలపై.. ఇప్పటికైనా అసెంబ్లీలో కొట్లాడాలని కోరారు నిర్వాసితులు. లేకపోతే మరుసటి రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ని ముట్టడించి.. అక్కడే టెంట్లు వేసుకుని కూర్చుంటామని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడే వంట వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీంతో 19వ తారీఖున ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోలీసులు భద్రత పెంచారు. అయితే మల్లన్న సాగర్ నిర్వాసితులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. అదే రోజు బీజేపీ నాయకులు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌ని ముట్టడించారు. గేట్‌కు టూలెట్ బోర్డ్ పెట్టి.. వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Gajwel Political Heat: ఇక కాంగ్రెస్ నేతలైతే.. అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై గవర్నర్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో.. ఏకంగా పాదయాత్రే చేపట్టారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్ భవన్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర ప్లాన్ చేశారు. అసలు గజ్వేల్‌కి ఎమ్మెల్యే ఉన్నాడో, లేడో అనుమానం కలుగుతోందని, కేసీఆర్ తమ సమస్యలు ఎప్పుడు వింటారోనని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ క్రమంలోనే గజ్వేల్ కాంగ్రెస్ క్యాడర్ పాదయాత్ర చేసుకుంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వం రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఇకపై నేనే చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం ఇక్కడ కొసమెరపు.
అయితే కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకున్న కొత్త రాజకీయ ఎత్తుగడకి గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు గట్టి కౌంటరే వేశారు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి గజ్వేల్ రూపు రేఖలే మారాయంటూ చెప్తున్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని కేసీఆర్ 50 ఏండ్లు ముందుకు తీసుకెళ్లారని, కళ్లుండి చూడలేని కబోతులకు ఈ విషయాలు అర్థం కావని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కానీ, బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు కానీ ఈ ఏడాదిలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్తారా అంటూ సవాల్ విసిరారు. చూడాలి మరి గజ్వేల్ నియోజకవర్గంలో రాను రాను ఏం జరగబోతుందో!