G.D. Nellore Gravel Mafia: అధికారం ఎక్కడుంటే అక్కడ గద్దలా వాలిపోతారు. ప్రకృతి సంపదను నిలువునా దోచుకునే బ్యాచ్. ఈ రాష్ట్రం కాదు.. అయినప్పటికీ వారి దందాకు అడ్డే లేదు. వీరి చర్యలకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం ఉండటంతో అధికారులు చేష్టలుడిగిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జీ.డి.నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న తంతు ఇది.
రోజుకు వందలాది టిప్పర్లతో అధిక టన్నేజీతో యథేచ్ఛగా ఎర్రమట్టిని చెన్నైకి తరలిస్తున్నారు అక్రమార్కులు. ఒక టిప్పర్‌కు 5 వేల చొప్పున, రోజుకు 60 ట్రిప్పర్ల మట్టిని ఒక్క పాలసముద్రం మండల పరిధిలో దోపిడీ చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ నాయకులు చేస్తున్నారా అంటే అది కూడా కాదు. గత ఎన్నికలలో వైసీపీకి వీరవిధేయులుగా పనిచేసిన వారు ఇక్కడ దందాలు చేయడం గమనార్హం. శరవణ్ అనే వ్యక్తి, గత ఐదు సంవత్సరాలు నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజాకు అండగా ఉండి, నగిరి నియోజకవర్గం నుంచి బాగా మట్టి తరలించాడు. అయితే, ఎన్నికల చివరి నాటికి శరవణ్ వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని భావించిన రోజా, అక్కడ నుంచి అతనిని పంపేసింది. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత అతను జీ.డి.నెల్లూరు టీడీపీలో ప్రత్యక్షమయ్యాడు. ఏకంగా సీఎం క్వానాయ్ బస్సులో కూడా అతను ప్రయాణించాడంటే, స్థానిక ప్రజా ప్రతినిధి అతనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థమవుతుంది. ఇతనే ప్రస్తుతం తమిళనాడుకు అడ్డగోలుగా గ్రావెల్ తరలిస్తున్నాడని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంటుంది.
అయితే ఈ దందాకు ఎమ్మెల్యే థామస్ వ్యవహార శైలి కూడా ఓ కారణమని అంటున్నారు స్థానిక నాయకులు. సొంత పార్టీ వారందరినీ దూరం పెట్టి, వైసీపీ నుంచి ఎన్నికల తర్వాత వచ్చిన హరీష్ యాదవ్, శరవణ్, రాందేవ్, చంద్ర లాంటి వారితో కలిసి మొత్తం యంత్రాంగాన్ని స్థానిక ప్రజా ప్రతినిధి నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పాలసముద్రం మండలంలో పెద్ద ఎత్తున ఎర్రమట్టి తరలిపోతోంది. ఎస్.ఆర్.కండ్రిగ పరిధిలోని వేపకోన, పల్లిపట్టు చింత కండ్రిగ, వనదుర్గాపురం, బలిజ కండ్రిగ ప్రాంతాలలో హిటాచీ యంత్రాలను పెట్టి.. పెద్ద ఎత్తున అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. దీని ద్వారా వీరి ఆదాయం రోజుకు 30 లక్షల వరకు ఉంటుందట. తమిళనాడు నుంచి వచ్చే ట్రిప్పర్లకు వీరు లోడ్ చేస్తున్నారు. ట్రిప్పర్‌కు ఐదు వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పక్క నియోజకవర్గం నగిరిలోని పర్మిట్లతోనే వీరు ఇక్కడ అక్రమ రవాణా చేస్తుండటం గమనార్హం. దీనికితోడు, 20 టన్నుల వరకే ఉండాల్సిన లోడింగ్‌ని.. 40 టన్నుల వరకూ పెంచేసి తరలిస్తున్నారు. ప్రభుత్వానికి వీళ్లు కట్టేది… ఒక క్యూబిక్ మీటర్ నుంచి 10 క్యూబిక్ మీటర్ వరకే అయితే, తీసుకెళ్లేది మాత్రం 25 నుంచి 30 క్యూబిక్ మీటర్ల గ్రావెల్. టాక్స్ ఇన్‌వాయిస్‌లు ఉండవు, బయ్యర్, సెల్లర్‌ల జీఎస్టీ నంబర్ ఉండదు, చలానాలతో మాత్రమే తరలిస్తున్నారు.
Also Read: BJP: తెలంగాణ బీజేపీకి గుడ్‌న్యూస్.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అప్‌డేట్
G.D. Nellore Gravel Mafia: క్షేత్రస్థాయిలో తమిళనాడు స్కూల్ వెనుకవైపు ఉన్న ఓ క్వారీ వద్ద మేనేజర్‌ను ప్రశ్నిస్తే, తమకు ఐదు వేలు కట్టి మట్టి తీసుకుపోతున్నారని, ఎమ్మెల్యే సోదరుడు శరవణ్‌దే ఈ క్వారీ అని చెప్పడం విశేషం. అయితే, సదరు క్వారీ ఎమ్మెల్యే సోదరుడు శరవణ్‌ది కాదని స్థానికులు అంటున్నారు. పాలసముద్రం మండలంలోని నాలుగు క్వారీల నుంచి ప్రతి రోజు 600 ట్రిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. గత ఆరు నెలలుగా మట్టి తరలింపు యధేచ్ఛగా జరిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, మైనింగ్ అధికారులు అసలు గ్రావెల్‌కు ఎక్కడా పాలసముద్రం మండలంలో పర్మిషన్లు లేవంటున్నారు. పక్క నియోజకవర్గంలో ఇచ్చిన పర్మిట్లతోనే తరలిస్తున్నారు కదా అంటే, రహదారుల కోసం ప్రభుత్వం ఇచ్చి ఉండొచ్చంటూ అయోమయంగా సమాధానం చెబుతున్నారు. మైనింగ్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి, పాలసముద్రంలో గ్రావెల్ తరలింపుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాడని, అతను హరీష్ యాదవ్ కనుసన్నలలో నడుస్తున్నాడని, గత 6 సంవత్సరాలుగా ఆ అధికారి ఇక్కడ కొనసాగుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. జీ.డి.నెల్లూరు నియోజకవర్గంలో ఆ నలుగురే మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నారని టీడీపీ క్యాడర్ అంటోంది. పార్టీతో సంబంధం లేని వారు, రాష్ట్రంతో సంబంధం లేని వారు, గతంలో అధికారంలో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, జీ.డి.నెల్లూరులో వైసీపీ పాలన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సత్యవేడు నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే తమకు అడ్డు వస్తాడని భావించిన మాఫియా, అతనిని సెక్స్ స్కాండల్స్‌లో ఇరికించి, అవినాష్ రెడ్డి అనుచరుడైన విక్రమ్‌కు ఉన్న లీజు పర్మిట్లతో యథేచ్ఛగా రోజుకు ఐదారు వందల ట్రిప్పర్ల ఎర్రమట్టిని తరలిస్తున్నారని తెలుస్తోంది. తెలుగు గంగ కాలువ మట్టిని సైతం తరలిస్తూ దోపిడీ సాగిస్తున్నారట. ఇదేమని ప్రశ్నిస్తే, వారిని పోలీసులు వివిధ రకాల కేసులలో ఇరికిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ నలుగురు ఓ కింగ్ మేకర్‌తో కలిసి ఇక్కడ ప్రకృతి దోపిడీ దందా చేస్తున్నారని అంటోన్నారు. మొత్తం మీద, సత్యవేడు, జీ.డి.నెల్లూరు నియోజకవర్గాలలో జరుగుతున్న దోపిడీ దందాతో పాటు, పక్క పార్టీల నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న వారిని పార్టీకి దూరం చేయకపోతే, స్థానిక సంస్థల ఎన్నికలలో బొక్క బొర్లా పడ్డం ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు.