Etukani Aa Naluguru: రాజకీయాల్లో విలువలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ విలువలకు తిలోదకాలిచ్చి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తే, ఒకనాటికి విలువ అనేదే లేకుండా పోతుంది. ఇప్పుడీ ఉపోద్ఘాతం చెప్పుకోవడానికి కారణం ఆ నలుగురు. వారే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు డోక్కా మాణిక్యవరప్రసాద్, రావెల కిషోర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి 2009లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది టీడీపీ. ఆ తర్వాత 2014లో గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ తరఫున పోటీ చేసిన రెండు సార్లు మోదుగుల భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి వెళ్లారు. అయితే, తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన టీడీపీని కాదని, 2019లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మోదుగుల. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 2019లో వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల, టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌పై ఓటమి పాలయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 6 స్థానాలను భారీ మెజారిటీతో వైసీపీ కైవసం చేసుకుంది. కానీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగులకు మాత్రం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు జలక్ ఇచ్చారు. ఇక 2024లో మోదుగులను పూర్తిగా దూరం పెట్టారు ఆ పార్టీ అధినేత జగన్. దూరం పెట్టడం సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం వైసీపీలో ఒక సామాన్య కార్యకర్తకు ఇచ్చే విలువ కూడా మోదుగులకు లేదంట. దీంతో తిరిగి టీడీపీలోకి రావాలా? లేక విలువలేని వైసీపీలో ఉండి ఇలాగే మగ్గిపోవాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో పడ్డారట మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.
Also Read: Phone Tapping Case: నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ..?
Etukani Aa Naluguru: టీడీపీ నుంచి వైసీపీలోకి మారి, తన పొలిటికల్ కెరీర్‌ను జీరో చేసుకున్న మరో నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన డొక్కా, విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో అవ్వడంతో, తన రాజకీయ గురువు రాయపాటితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, డోక్కాకు పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పార్టీ మారిన వెంటనే డొక్కాకు ఎమ్మెల్సీతో పాటు మండలి విప్ కట్టబెట్టారు. ఎమ్మెల్సీ పదవికి మూడు సంవత్సరాల టైం ఉండగానే, 2019 ఎన్నికల్లో పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. అయితే, 2019లో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తర్వాత.. తక్కువ టైంలో తనకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన టీడీపీని కాదని, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు డొక్కా. ఇక్కడి నుంచే డొక్కాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్‌లో, ఆ తర్వాత టీడీపీలో ఒక వెలుగు వెలిగిన డొక్కాకు వైసీపీలో లభించిన ఆదరణ జీరో. చివరికి ఒక కార్పొరేటర్‌కు ఇచ్చిన విలువ కూడా ఆ పార్టీలో డొక్కాకు దొరకలేదు. ఇక 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి భారీ విజయంతో అధికారంలోకి రావడంతో.. తిరిగి టీడీపీ గూటికి చేరారు డొక్కా. అయితే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరిపోతారంటూ విమర్శలు మూటగట్టుకోక తప్పలేదు డొక్కా మాణిక్యవరప్రసాద్.
టీడీపీని వీడి రాజకీయంగా జీరో అయిన ఇంకో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. 2014లో పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రావెల, చంద్రబాబు సర్కారులో మంత్రిగా ఉన్నారు. అయితే, రావెలపై తక్కువ టైంలోనే పెద్ద సంఖ్యలో అవినీతి ఆరోపణలు రావడంతో, ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించారు చంద్రబాబు. 2019లో పార్టీ మారి, జనసేన తరపున పత్తిపాడు అభ్యర్థిగా బరిలో దిగిన రావెల కిషోర్ బాబుకు డిపాజిట్లు కూడా రాలేదు. దాంతో జనసేనకు రాజీనామా చేసి బీజేపీలోకి, బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లోకి, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి మళ్లీ వైసీపీలోకి.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలూ చుట్టేశారు రావెల. ప్రస్తుతం తిరిగి టీడీపీ పంచన చేరే ప్రయత్నం చేస్తున్నారట.
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. కేసు నమోదు
Etukani Aa Naluguru: టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని, పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వైసీపీలోకి జంప్ అయిన మరో నేత మద్దాలి గిరి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరికి టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 2014లో గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మద్దాలి గిరి, వైసీపీ అభ్యర్థి ముస్తఫాపై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా పంపించింది టీడీపీ. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ గెలిచిన సీటు గుంటూరు వెస్ట్ మాత్రమే. అయితే, వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి, రెండు సార్లు అవకాశం ఇచ్చిన టీడీపీని కాదని, వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే మద్దాలి గిరిని ఫుల్లుగా వాడుకొని కిళ్లీ ఊసినట్లు ఊసేసింది వైసీపీ. దీంతో వైసీపీకి రాజీనామా చేసి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు మద్దాలి.
ఇలా రాజకీయాల్లో విలువలు లేకుండా పార్టీలు మారే వారిని పార్టీలే కాదు, ప్రజలు సైతం తిరస్కరిస్తున్నారు. ఇలా తమ అవసరాల కోసం నిరంతరం పార్టీలు మారుతూ, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు, ప్రోత్సహించిన పార్టీలకు పంగనామం పెట్టేవారికి ఇదే కరెక్ట్ శిక్ష అంటున్నారు అనలిస్టులు. ఈ కోవలో సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చందు సాంబశివరావు ఇంకా చాలా మందే ఉన్నారు.