Ed Fear To IAS IPS Officers

Ed Fear To IAS IPS Officers: ఈడీ ఎంట్రీ: వొణుకుతున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు!

Ed Fear To IAS IPS Officers: భూదాన్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. వీరు భూములు కొనుగోలు చేశారా? లేదా కబ్జా చేశారా? అసలు వీరికి రిజిస్ట్రేషన్‌లు చేసింది ఎవరు? అనే పలు కీలక విషయాలపై ఈడీ దృష్టి సారించినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ వివాదాస్పద అంశం డీఓపీటీలో చర్చగా మారినట్టు తెలుస్తోంది. నిజాలు నిగ్గుతేల్చడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియజేయాలంటూ సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, జరిగిన ఈ తాజా పరిణామం బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సేల్ డీడ్‌లు చేయించుకున్నారంటూ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిర్ షరీఫ్ అనే వ్యక్తి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఖదీరున్నీసా, మహ్మద్ మునావర్ ఖాన్, అప్పటి మహేశ్వరం ఎమ్మార్వో, సబ్-రిజిస్ట్రార్ ఆర్.పీ.జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎస్.సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌ను గతేడాది అక్టోబర్‌లో ఈడీ ప్రశ్నించింది. తాజాగా సీఆర్‌పీఎఫ్ పోలీసుల బందోబస్తుతో యాకత్‌పురా, మీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉన్న ఖదీరున్నీసా, మహ్మద్ మునావర్ ఖాన్, షర్మాన్ తదితరుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు జరిపారు. మొయినాబాద్‌లో ఉన్న మహ్మద్ మునావర్ ఖాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భూదాన్ భూముల సేల్ డీడ్‌కు సంబంధించి పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

నాగారం గ్రామం సర్వే నెంబర్లు 181, 182, 194, 195లలో భూదాన్ భూములకు సంబంధించి మహేశ్వరం మండలానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇటీవలే సీరియస్‌గా స్పందించింది. భూదాన్ భూముల వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్నది తేల్చడానికి, విచారణ జరపటానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియజేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భూదాన్ భూముల అంశంలో త్వరలోనే సీబీఐ విచారణ మొదలు పెట్టవచ్చన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈడీ దాడులు చర్చనీయంగా మారింది. ఈ భూములను కొన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని భావిస్తుండటంతో బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

ALSO READ  Balasoury Bouncer: జగన్‌ ఎలాంటి నేతని వదులుకున్నారో తెలుస్తోందా?

Also Read: Seethakka: కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

తెలంగాణ బ్యూరోక్రాట్ల వ్యవహారం ఇప్పుడు డీఓపీటీలో ప్రత్యేక చర్చగా మారినట్టు సమాచారం. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కానీ, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల నుండి కానీ సెంట్రల్ డిప్యూటేషన్ పెట్టుకుంటే వెంటనే ఆమోదించే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని టాక్. సీబీఐ, ఈడీ విచారణ, కేసుల తర్వాత కేంద్రం కూడా ఎంటర్ అయ్యే ఆస్కారం లేకపోలేదని పలువురు సీనియర్ అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే కేంద్రం చేతిలో కీలు బొమ్మల మాదిరిగా వీరి పరిస్థితి మారనుందని, అది రాష్ట్ర ప్రభుత్వానికి తీరని ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *