Doors Open To CBI

Doors Open To CBI: మూడేళ్ల తర్వాత మళ్లీ అడుగు పెడుతోన్న సీబీఐ!

Doors Open To CBI: గత 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐకి నోఎంట్రీ అంటూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 51 జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో ఏ కేసునైనా విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆ జీవోలో పేర్కొంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా విచారణకు వచ్చేముందు ఫార్మాలిటీగా జనరల్ కన్సెంట్ పేరుతో సమాచారం ఇచ్చేది సీబీఐ. కేసీఆర్ సర్కార్ జనరల్ కన్సెంట్ ఉపసంహరణ చేస్తూ ఆ జీవోని తెచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలోకి సీబీఐ రావాలంటే స్టేట్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి అయిపోయింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప తమంతట తాముగా రాష్ట్రంలోకి రాలేకపోయింది సీబీఐ. అయితే మూడేళ్ల తర్వాత తిరిగి ఇప్పుడు సీబీఐ తెలంగాణలో అడుగుపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనుంది సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌. అయితే వచ్చే నెల 7 వరకు ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాళేశ్వరం కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇప్పటికే వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ షురూ అయ్యింది. ఈ కేసుతో పాటూ ఇటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కాళేశ్వరం కుంగిన కేసు.. రెండూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనివే కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్‌పై పడింది.

2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన ఈ జంట హత్యల్లో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలతో కొంతమందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంది కేసీఆర్ సర్కార్. ఈ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తుపై వామన్ రావు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారకులను అరెస్ట్ చేసి హత్యకు ప్రేరేపించిన వారిని విడిచిపెట్టారని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆగస్టు 12న కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో నిందితులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు మొదలుపెట్టింది.

Also Read: 

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆది నుంచి ఆరోపిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్‌లో బ్లాక్ 7లో జరిగిన కుంగుబాటును అడ్వాంటేజ్‌గా తీసుకుంది కాంగ్రెస్. మేడిగడ్డ పిల్లర్లలో వచ్చిన పగుళ్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టులో బీటలు వారడంతో సహా టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్‌తో విచారణ జరిపించింది. ఇటీవల ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బహిర్గతం చేసి, అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది. శాసనసభ వేదికగా గులాబీ బాస్‌ను టార్గెట్ చేస్తూ అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసింది. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంతో అనూహ్యంగా సంచలన స్టెప్ తీసుకుంది కాంగ్రెస్. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ALSO READ  Revanth Reddy: మీకు నేనున్నా..అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని బీజేపీ ఢిల్లీ లీడర్ల నుంచి గల్లీ నేతల వరకు పదేపదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్‌పై తొందరపడి చర్యకు దిగితే పొలిటికల్ డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన కాంగ్రెస్‌ సర్కర్‌… విచారణను కేంద్ర సంస్థతో చేయించాలని నిర్ణయించి బంతిని తెలివిగా బీజేపీ కోర్టులోకి నెట్టింది. మన దేశంలో సీబీఐ అంటేనే… ఏళ్లకు ఏళ్లు కేసులు ఎటూ తేలవన్న అభిప్రాయం ఉంది. అలా విచారణ సాగినన్ని రోజులూ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్‌లను ఇరుకున పెట్టొచ్చనే వ్యూహంతోనే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

సీబీఐతో కేసీఆర్‌కు అంతగా కలిసిరావడం లేదనే చర్చలు సాగుతున్నాయి. అటు లిక్కర్ కేసు, ఇటు కాళేశ్వరం కేసు, తాజాగా వామన్ రావు దంపతుల కేసు ఇవన్నీ ఆయనకు ఇబ్బందికరంగానే మారాయి. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం, ఆ తర్వాత కుటుంబంలో చీలిక రావడం, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడం లాంటి పరిణామాలకు సీబీఐ విచారణే కారణం. ఇప్పుడు కాళేశ్వరం కేసు కూడా ఆ సంస్థ చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఆసక్తి రేగుతోంది. వామన్‌రావు దంపతుల కేసు కూడా పార్టీకి కష్టాలు కొనితెచ్చే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *