Dhulipalla vs Agnyathavasi: ధూళిపాళ్ల నరేంద్ర. టీడీపీలో ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ కోసం దేనికైనా సిద్దమనే అంకిత భావం ఆయన సొంతం. నిజాయితీకి చిరునామాగా నిలుస్తారు. ఎక్కడా ఎలాంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నేత. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతీ సారి నరేంద్రకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం, తెర వెనుక నుండి వాయిస్ వస్తుంది. చివరి నిమిషంలో దక్కకపోవటం అలవాటుగా మారి పోయింది. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో.. ప్రతిపక్షంలో ఉన్న వేళల్లో పార్టీ కోసం ఒంటరి పోరాటమే చేసారు. వైఎస్సార్ హయాంలో పార్టీ నుంచి గుంటూరు జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా టీడీపీ వాయిస్ వినిపించటంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కాంగ్రెస్ యోధులతో ఢీ అంటే ఢీ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సొంత నిధులతో కార్యక్రమాలు నిర్వహించారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో నరేంద్రకు మంత్రి పదవి ఖాయమని పార్టీ నేతలు భావించారు. అయినా దక్కలేదు. ఆ సమయంలో నరేంద్ర అనుచరులు ఒకింత అసహనం వ్యక్తం చేసినా వారికి సర్దిచెప్పారు. పార్టీ కోసం పని చేసారు. 2019 ఎన్నికల్లో ఓడినా.. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించారు. నాటి అధికార పార్టీ కేసులు పెట్టి జైలు పాల్జేసినా వెనుకడుగు వేయలేదు. తిరిగి 2024 ఎన్నికల్లో గెలిచారు. ఈసారి మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. మరోసారి ఆశాభంగం కలిగింది. నరేంద్ర మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా, మంత్రి వర్గ విస్తరణ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Also Read: Cm chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తాం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో ఇద్దరు ధూళిపాళ్ల నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే, మారుతున్న సమీకరణాల వేళ ముగ్గురిలో ఒకరిని తప్పించి నరేంద్రకు అవకాశం ఇస్తారని పార్టీ ముఖ్య నేతల సమాచారం. దీంతో, సొంత పార్టీలోనే నరేంద్రకు చాలా కాలంగా వ్యతిరేకంగా ఉంటున్న ఓ సీనియర్.. పార్టీలోని అజ్ఞాతవాసి.. తెరచాటు రాజకీయం మొదలు పెట్టారనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలతో, వైసీపీ అనుకూల మీడియాతో కలసి అసత్య ప్రచారం మొదలు పెట్టారనే చర్చ జరుగుతోంది. నరేంద్ర వ్యక్తిత్వం దెబ్బ తీసే పనులు చేస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. నరేంద్రపై వస్తున్న అసత్య కథనాల వెనుక అజ్ఞాతవాసి కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. నరేంద్రను టార్గెట్ చేయటం ద్వారా మంత్రివర్గంలో అవకాశం లేకుండా చేయాలనేది ఆ అజ్ఞాతవాసి లక్ష్యంగా కనిపిస్తోంది.
కాగా, ఇప్పడు ఈ అజ్ఞాతవాసి వ్యవహారం టీడీపీ అధినాయకత్వం వద్దకు వెళ్లింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పైన ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారనే ఆరోపణల పైన ఆరా తీస్తోంది పార్టీ అధిష్టానం. దీంతో, ఇప్పుడు నరేంద్రకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్న ఆ అజ్ఞాతవాసి క్యాంప్‌లో కలకలం మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

