Dharmavaram Change: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ రాజకీయాలంటేనే రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. 2024 ఎన్నికల వరకూ ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ప్రధానంగా రాజకీయం నడిచేది. బీజేపీ లీడర్ సత్యకుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ దక్కించుకుని… కేవలం 30 రోజుల్లోనే వైసిపిని మట్టి కరిపించి కాషాయం జెండా ఎగరవేయడంతో అక్కడ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎన్నికల తర్వాత వైసీపీ దాదాపుగా సైడ్ అయిపోవడంతో కూటమిలోని బిజెపి, టిడిపి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ వచ్చింది. ఇరు పార్టీలు రాజకీయ ఆధిపత్య పోరులో తలమునకలై పోవడంతో… మరోవైపు ఆశించిన విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు అందట్లేదని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది.
అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన తరుణంలో.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించడానికి సుపరిపాలనలో తొలి అడుగు అంటూ టిడిపి ప్రజా ప్రతినిధులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. కూటమిలో భాగస్వాములైన బిజెపి, జనసేన పార్టీలు కూడా ప్రభుత్వ పాలనపైన వివరించేందుకు వివిధ రూపాల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అందులో భాగంగానే ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని జూలై 11 నుంచి మూడు రోజులు పాటు ధర్మవరం పట్టణంలో వివిధ వార్డుల్లో ఆయన పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ పాదయాత్రలో మొన్నటివరకు టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొంటారా లేదా అన్న సస్పెన్స్ ఉండేది. టీడీసీ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండటంతో అందరిలోనూ అదే సస్పెన్స్. అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. టీడీపీ ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, ధర్మవరం జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి మంత్రి పాదయాత్రకు జత కట్టారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటాం, నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం… అంటూ మంత్రితో పాటూ ఈ ఇరువురు నేతలు కలిసి మీడియా సాక్షిగా వెల్లడించడంతో… స్థానిక ప్రజలు, క్యాడర్ ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యారట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముగ్గురు నాయకుల నుంచి ఒకే మాట వచ్చిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న విధంగా చర్చ జరుగుతుందట నియోజకవర్గ వ్యాప్తంగా.
Dharmavaram Change: సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ధర్మవరం అభివృద్ధిలో ఓ రేంజ్‌లో దూసుకెళ్తుందని అక్కడి ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూడా నియోజకవర్గంలో అనుకున్న విధంగా అభివృద్ధి పలాలు అందట్లేదనే చర్చే నడుస్తోంది. నియోజకవర్గ ప్రజలకి మంత్రి అందుబాటులో లేకపోవడం కూడా పెద్ద మైనస్ అంటున్నారు అక్కడి క్యాడర్. రాజకీయంగా మంత్రి సత్యకుమార్ బిజీ బిజీగా ఉండడం వల్లే నియోజకవర్గంపై ఫోకస్ చేయలేకపోయారనే మరో వాదన కూడా ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో టిడిపి వర్సెస్ బిజెపి వర్గపోరు కూడా అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందనే అభిప్రాయం ఉంది. ఇప్పటికీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వంటి వివిధ పోస్టులు నేటికీ నియమించుకోలేక పోతున్నామని టిడిపి క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోందట. ఇక కొందరు వైసీపీ నుంచి బిజెపి కండువా కప్పుకుని పెత్తనం చెలాయించడం నియోజకవర్గంలో వర్గపోరుకి ఆజ్యం పోసినట్లయింది. ముగ్గురు నేతలు కలిసి చర్చించుకుని ఈ పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్లి ఉంటే కనుక ఖచ్చితంగా అభివృద్ధి అనుకున్న దాని కంటే ధర్మవరంలో వేగంగా ఉండేదని ప్రజల అభిప్రాయం, విశ్లేషకుల మాట.
ధర్మవరంలో ఎట్టకేలకు కూటమిలో రాజకీయం కుదట పడినట్టేనా..? మంత్రి సత్యకుమార్ యాదవ్ పాదయాత్రలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొనడం వెనక ఆంత్యర్యం ఏంటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నాయకులు ముగ్గురు ఒక తాటిపైకి వచ్చారా…? వర్గ విభేదాల్ని పక్కన పెట్టి, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఇక నుంచైనా ముందుకు వెళ్తారా..? లేదా యథా తథంగా ఆధిపత్య రాజకీయం కంటిన్యూగా కొనసాగుతుందా? అనేది చూడాలి. మొత్తానికి ఏడాది పాలన తర్వాత ముగ్గురు నాయకులు ఓకే అజెండాతో ముందుకు రావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే ఈ నాలుగు సంవత్సరాల పాటు ఇదే ఐక్యతతో ధర్మవరంలో కూటమి నేతులు ముందుకు వెళ్తారా? లేదా? అనేది కాలమే చెప్పాలి.