Delhi Diwali Effect: నిన్న దీపావళి – నేడు అంధకారం. కాలుష్యకోరల్లో దేశ రాజధాని నగరం. ఢిల్లీ బాటలోనే హైదరాబాద్. అసలీ నగరాలకు ఏమైంది? సకల సౌభాగ్యాలు కలుగాలని చేసుకునే పండుగలతో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందా? ప్రాణం కంటే పండుగలే ముఖ్యమా అన్న చర్చ తెరపైకి వస్తోంది. దీపావళి రాత్రి బాణాసంచా ప్రభావంతో ఢిల్లీని మళ్లీ కమ్మేసింది వాయు కాలుష్యం. ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది. దీపావళి వచ్చిందంటే చాలు.. ఢిల్లీ గజగజ వణికిపోతోంది. ఈసారి కూడా రాత్రి బాణాసంచా వెలుగులు పూర్తవగానే.. ఉదయాన్నే భీకరమైన పొగమంచు ఢిల్లీని కప్పేసింది. ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 347 వద్ద నమోదైంది. ఇది “వెరీ పూర్” లెవెల్‌గా వర్గీకరించబడింది. గత ఏడాది దీపావళి తర్వాత ఉదయం 6:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 359గా నమోదైనట్లు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది గాలిలో కాలుష్య స్థాయిని సులభంగా అర్థమయ్యేలా తెలియజేసే ఒక ప్రజా ఆరోగ్య సూచీ. ఇది పీఎమ్ 10, పీఎమ్ 2.5, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సీసం, అమోనియా అనే 8 కాలుష్య పదార్థాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0–50 ఉంటే గుడ్ అని, 51–100 మధ్య నమోదైతే తృప్తికరమైన స్థాయిగా, 101–200 మధ్య ఉన్నట్లయితే మోస్తరు స్థాయిగా, 201– 300 మధ్య ఉంటే దారుణమైన స్థాయిగా, 301–400 మధ్య నమోదైతే అత్యంత దారుణమైన స్థాయిగా, 401–500 మధ్య నమోదైతే తీవ్రమైన స్థాయిగా అర్థం చేసుకోవాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం… మంగళవారం ఉదయం నగరంలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో 38 కేంద్రాలు “అత్యంత దారుణమైన” కేటగిరీలోకి వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: ChatGPT Atlas: ఓపెన్ఏఐ నుంచి కొత్త AI వెబ్ బ్రౌజర్!ఇక గూగుల్ క్రోమ్‌కి కష్టమే..!
ఢిల్లీలో కేవలం గ్రీన్ క్రాకర్స్ పేల్చేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అది కూడా అక్టోబర్ 20, 21 తేదీల్లో రెండు రోజులు మాత్రమే పేల్చాలి. ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల పొల్యూషన్ ఉండదని కాదు. పొల్యూషన్ స్థాయిని కొంత మేర తగ్గించవచ్చు అంతే. క్రాకర్స్‌పై పూర్తిగా నిషేధం విధిస్తే.. ప్రజలు చట్టవిరుద్ధంగా సాధారణ బాణాసంచా తెచ్చుకుంటారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అవి మరింత హానికరమైన ప్రభావం చూపుతాయని, అందుకే గ్రీన్ క్రాకర్స్‌కి అనుమతి ఇస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ రెండు రోజుల్లో బాణాసంచా పేల్చే సమయాన్ని కూడా పరిమితం చేసింది. ఉదయం 6:00 నుంచి 7:00 గంటల వరకు, రాత్రి 8:00 నుంచి 10:00 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్‌ని పేల్చడానికి అనుమతి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంతమేరకు అమలయ్యాయో కానీ… ఫలితంలో మాత్రం ఏ మార్పు లేనట్లు తెలుస్తోంది.
ఇటు భాగ్యనగరంలోనూ దీపావళి బంబుల మోత మోగింది. దీపావళి బాంబుల శబ్దాలతో వెలువడిన కాలుష్యం వల్ల జంట నగరాల ప్రజలు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం కాలుష్యం పెరిగిందాని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెపుతున్నాయి. సోమవారం రాత్రికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 338గా నమోదైనట్లు సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లైవ్ రిపోర్ట్ తెలిపింది. ఎయిల్ క్వాలిటీ ఇండెక్స్ 150-200 ఉంటేనే చాలా అనారోగ్యకరమైనది.. అలాంటిది 338 స్థాయికి చేరింది. ముఖ్యంగా కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్ వంటి నిర్దిష్ట ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు కాల్చిన టాపాసులతో నగరంలో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి. కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగయ్యే వరకు ఎక్కువగా బయట తిరగవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం సురక్షితమని చెబుతున్నారు. పేల్చిన టపాసులతో కాలుష్యం పెరగడమే కాదు… కేవలం హైదరాబాద్ లోనే దాదాపుగా 9 కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరిగినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే దీపావళి…. ఒక్కరోజునాడే 9 కోట్లు బూడిదయ్యాయి.