Dandakaranyam News: ఓ వైపు భద్రతా బలగాల నిర్బంధం కొనసాగుతుండగా, మరోవైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నాయకత్వ బాధ్యతలను తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి అప్పగించినట్టుగా సమాచారం. సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది… కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యత మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే దక్కింది. పీపుల్స్ వార్ ఆవిర్భావం తర్వాత కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించగా, ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి ముప్పాళ లక్ష్మణ్ రావు సుదీర్ఘ కాలం పనిచేశారు. 2005లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆవిర్భావం తర్వాత కూడా ముప్పాళే ఆ బాధ్యతల్లో కొనసాగారు. పార్టీలో సంస్థాగత మార్పులు, చేర్పులు జరిగినప్పుడు నంబళ్ల కేశవ రావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబళ్ల కేశవ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న 28 మంది సహచరులతో చనిపోయారు. ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్ కమిటీల సంయుక్త సమావేశం జరగలేదు. దీంతో పార్టీకి సీనియర్ నేత ముప్పాళ లక్ష్మణ్ రావు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా కేంద్ర కమిటీ బాధ్యతలను తిప్పిరి తిరుపతి @ సంజీవ్ @ చేతన్ @ రమేష్ @ సుదర్శన్ @ దేవన్నకు అప్పగించినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి తెలుగు నాయకత్వానికే మావోలు పట్టం కట్టారు…
Also Read: Telangana: తెలంగాణ సర్కార్ మరో వినూత్న కార్యక్రమం
మరోవైపు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా మడావి హిడ్మా బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కట్టా రామచంద్ర రెడ్డి అలియాస్ రాజును ఆ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత, సమర్థుడిగా పేరున్న తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్నను కాదని, మిలిటరీ ఆపరేషన్‌లో దిట్టగా ఉన్న మడావి హిడ్మాను దండకారణ్యం కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. సంచలనాత్మక మిలిటరీ యాక్షన్‌లలో, గెరిల్లా పోరాటాలలో హిడ్మాకు పట్టు ఉండటంతో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మాకు దండకారణ్యం ప్రాంతాన్ని అప్పగించడాన్ని బట్టి చూస్తే, మిలిటరీ ఆపరేషన్‌లను మరింత వేగవంతం చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉందని, ఈ కారణంగానే మిలిటరీ కమిషన్ బాధ్యులకు కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…
మరోపక్క, వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని దేశం నుంచి తుడిచిపెట్టేయాలన్న లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు మరింత ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా మావోయిస్టు అగ్రనేతలను మట్టుబెట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు చెందిన 30 కొత్త స్థావరాలు, ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి… వర్షాకాలం తర్వాత అగ్రనేతలే టార్గెట్‌గా దాడులను మరింత ముమ్మరం చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నట్లు సమాచారం.