Cycle vs Car: కేటీఆర్ చేసిన పార్టీ విలీనం ప్రయత్నాలు ఆధారాలతో సహా రివీల్ అవ్వడం, ఆ సందర్భంగా తెలంగాణలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలపై తనకున్న అభిప్రాయాన్ని బయట పెట్టుకుంటూ దూషించాడన్న ఆరోపణలు.. అందుకు సాక్షాలుగా నిలుస్తున్న గత సంఘటనలు, తాజా పరిణామాలు… ఇవన్నీ కలిసి బీఆర్‌ఎస్‌కు గుది బండగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌కు ఉపద్రవంలా మారుతున్న ఈ పరిణామాలు.. ఆ పార్టీని అంచెలంచెలుగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికతో మొదలు పెడితే… స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బలు తగిలే సూచనలే కనిపిస్తున్నాయి.
మొదట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనే పరిశీలిస్తే.. ఈ నియోజకవర్గంలో కమ్మ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఎపిసోడ్‌లో ప్రధానంగా వినిపించిన అంశం… తుమ్మల నాగేశ్వర్రావును ఉద్దేశించి కమ్మ సామజికవర్గం వారి గురించి కేటీఆర్ దురుసుగా మాట్లాడారని సీఎం రమేష్ అంటున్నారు. తాను అలా అనలేదని కేటీఆర్ ఖండించలేకపోతున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లో ప్రాబల్యమున్న కమ్మ సామాజికవర్గం బీఆర్‌ఎస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోయే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానాన్నే గెలవలేక పోయారన్న ప్రచారం ప్రజల్లోకి వెళితే.. తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నెగటివ్‌గా మారే ప్రమాదముంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉన్నచోట్ల రెడ్డి సామాజికవర్గం నేతలు పోటీ చేస్తారు. లేదంటే వారి అనుయాయులను పోటీలో పెడతారు. మళ్లీ అదే కేటీఆర్-సీఎం రమేష్ ఎపిసోడ్‌లో… సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రెడ్లను కూడా కేటీఆర్ దుర్భాషలాడారన్న ఆరోపణ వెలుగుచూసింది. దీనినీ కేటీఆర్ ఖండించట్లేదు. ఈ దెబ్బతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గోవిందా.
Also Read: Chandrababu: సోనూ సూద్ పై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెట్టింటా వైరల్!
ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయానికొస్తే… గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నామరూపాలు కోల్పోకుండా కాపాడింది ఈ గ్రేటర్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాలే అని చెప్పొచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, షేర్‌లింగం పల్లి, కూకట్ పల్లి, అమీర్‌పేట్, ఎల్బీ నగర్… ఇలాంటి ప్రాంతాల్లో కమ్మ సామాజికవర్గం లేదా సెటిలర్లు ఎక్కువ. ఇటీవల కేటీఆర్ స్పీచ్‌లు చూస్తుంటే.. ఆయన మళ్లీ ఆంధ్రా – తెలంగాణ విభజన, విద్వేష రాజకీయాలనే నమ్ముకున్నారన్న విమర్శ వ్యక్తమవుతోంది. దీనికి తోడు తాజాగా సీఎం రమేష్ బయటపెట్టిన విషయాలపై గ్రేటర్ ప్రాంత ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కమ్మ సామాజికవర్గం ఓటర్లు, సెటిలర్లు కూడా దూరమైతే.. బీఆర్‌ఎస్ ఊపిరి పీల్చుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనూ ఆ పార్టీకి ఆక్సిజన్ వైర్ కట్టయ్యే చాన్స్ ఉంది.
ఇక బీఆర్‌ఎస్ విలీన రాజకీయాలపై గతంలో జరిగిన నిజామాబాద్ బహిరంగ సభలో స్వయానా మోడీనే ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా విలువైన శాలువాలు, భారీ బొకేలు తీసుకొచ్చి.. తన కొడుకును ముఖ్యమంత్రిని చేస్తాను, సహకరించండి అని అడిగేవారని, అయితే వారసత్వ రాజకీయాలను మేం ప్రోత్సహించమని తాను ఖరాఖండిగా చెప్పానని మోడీ ఆ సభలో రివీల్ చేశారు. ఆ తర్వాత కవిత కూడా ఇదే అంశాన్ని రివీల్ చేశారు. బీఆర్‌ఎస్‌ని బీజేపీలో విలీనం చేసే ప్రపోజల్‌తో తనవద్దకు వస్తే… తిరస్కరించానని, జైల్లో ఉండటానికే సిద్ధ పడతాను తప్ప, విలీనానికి ఒప్పుకోనని తేల్చి చెప్పానని కవిత ఇటీవల బయటపెట్టారు. తాజాగా సీఎం రమేష్.. కేటీఆర్ విలీన రాయబారాలను ఆధారాలతో సహా బయటపెడతానని బాంబు పేల్చారు. ఇక సీఎం రమేష్ వ్యాఖ్యల్ని బలపరుస్తూ… దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. విలీనం కోసం బీఆర్‌ఎస్, ముఖ్యంగా కేటీఆర్ పరితపించారు అనడానికి సీక్వెన్స్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనలే నిదర్శనమని రాష్ట్రంలో చర్చ జరుగుతున్నప్పటికీ.. బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం నుండి ఎక్కడా స్పందన రాలేదు. కేవలం చోటా మోటా నాయకులతో మాత్రమే మాట్లాడిస్తున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒక గందరగోళం, అనిశ్చితి నెలకొంది. ఇంత కష్టపడి కాంగ్రెస్‌పై పోరాటం చేస్తే.. తీరా బీఆర్‌ఎస్‌ను తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తే… తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ఆలోచనలో పడిందట.