Congress MLAs Pill: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నలుగురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. జాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మురళీనాయక్ భూక్యా, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబరు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. రెవెన్యూ, మునిసిపల్, జీహెచ్‌ఎంసీ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ఈ నెల 16న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభుత్వ అధికారులు ప్రతివాదులతో కుమ్మక్కై భూకబ్జా చేశారని పిటిషనర్ల తరఫున న్యాయవాది తీవ్ర ఆరోపణ చేశారు. వాదనలు విన్న ధర్మాసనం… పిటిషనర్లు హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో కబ్జాకు గురైన భూమి ఎక్కడ ఉందో తెలిపే సర్వే నెంబర్లు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. అనవసర అంశాలలో కోర్టు సమయం వృధా చేస్తున్నారంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేల తీరు ఈ అనుమానాలకు తావిస్తోంది. షేర్ లింగంపల్లిలోని ఖాజాగూడ చెరువు. దాని పరిధిలో 27 ఎకరాల 18 గుంటల భూమి. దాని విలువ 10 వేల కోట్లు. 2023 జనవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ఈ ల్యాండ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటున్నారు. అవేమీ పట్టించుకోకుండా కలెక్టర్ అనుమతి ఉండటంతో 2024 అక్టోబర్‌లో GHMC కూడా నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది. స్వయాన ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉంది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్లారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అక్రమ నిర్మాణం అడ్డుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలు ముందుగా హైడ్రాను ఆశ్రయిస్తే పట్టించుకోలేదట. దాంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. ఆరు నెలల క్రితం చేసిన ఈ ఫిర్యాదుపై ముఖ్యమంత్రి స్పందించలేదట. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఓ మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: KTR: కౌశిక్‌రెడ్డి అరెస్టుపై లండన్ నుంచి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Congress MLAs Pill: హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు. వారి నియోజకవర్గంలో ఈ భూమి లేదు. అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్‌రెడ్డిలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు. మురళీనాయక్ నియోజకవర్గం మెహబూబాబాద్‌లో ఉంది. వీరిలో ఏ ఒక్కరి నియోజకవర్గానికి కనీసం కనుచూపు మేరలో లేని భూమి కోసం.. వీళ్ల కొట్టాట దేన్ని ఆశించి? అన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూమిలో నిర్మాణాలకు అనుమతినిచ్చింది జీహెచ్‌ఎంసీ. అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉన్న శాఖే ఈ అనుమతులిచ్చింది. అంటే ఈ ఎమ్మెల్యేల ఉద్దేశం ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడమేనా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాజకీయ గురువే దీనినంతటినీ నడిపిస్తున్నారా? ఈ ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి మీద కూడా గతంలో ఆరోపణలు చేశారు. అసైన్డ్ ల్యాండ్స్‌ని కొట్టేస్తున్నారని, 30 శాతం కమీషన్లు గుంజుతున్నారని ఆరోపించారు. దీనిని బట్టి చూస్తుంటే… సొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే వీరి ఉద్దేశమా? అన్న అనుమానమూ కలుగుతోంది. తమ నియోజకవర్గాలకు సంబంధం లేని చోట వీళ్ల పోరాటం దేని కోసం? ఎందుకు ఈ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు? లాభాపేక్షతోనా? లేక ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకా? లేక నిజంగా ప్రజా ప్రయోజనం కోసమేనా? అన్న చర్చ జరుగుతోంది. కేవలం ముఖ్యమంత్రిని ఇరుకునపెట్టేందుకే ఇలా చేస్తున్నారనీ, అనిరుధ్ రెడ్డి రాజకీయ గురువైన ఆ మంత్రి వెనుకుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని జరుగుతోన్న ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.