Cong Failures On Lands: తెలంగాణ ఇంటెలిజెన్స్ పనితీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని సీఎంకు ఉప్పందించడంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల్లో ఇంటలిజెన్స్ వైఫల్యాలు బయట పడ్డాయి. తమ గ్రామాలకు యమపాశంగా మారుతుందన్న కారణంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్ పూర్ గ్రామాల ప్రజలు నిరాహార దీక్షలను చేపట్టారు. గ్రామాల్లో అధికారులపై భౌతిక దాడులు జరిగాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై పునరాలోచన చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు తమ ఆందోళనను విరమించారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల, హాకింపేట గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ సభలకు వెళ్లిన కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ఫార్మా కంపెనీలను కొన్ని నెలలుగా రైతులు వ్యతిరేకిస్తున్నా ఆ అంశంలోని సున్నితత్వాన్ని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారా? కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్‌తోపాటు ‘కడా’ ప్రత్యేకాధికారి పర్యటిస్తారని తెలిసి కూడా.. రైతుల ఆందోళనను పసిగట్టలేకపోయారా? అని జిల్లా అధికారులు వాపోయారు. గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత ఏడాది అక్టోబర్ రెండో వారంలో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేసినా ఇంటెలిజెన్స్ విభాగం ఆ చర్యను ముందస్తుగా పసిగట్టలేకపోయింది. చివరికి వారంతా సెక్రటేరియట్‌ను ముట్టడిస్తారని తెలిసి.. ఏం చేయాలో తెలియని గందరగోళంలో అభ్యర్థుల రూముల్లోకి చొచ్చుకెళ్లి.. బయటకు లాక్కొచ్చి వ్యాన్లలోకి ఈడ్చి పడేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్లెక్కి నిరసన తెలిపారు. కుటుంబాలతో సచివాలయాన్ని ముట్టడించారు. హోంగార్డులు ఆందోళన బాటపట్టారు. వారు కూడా కుటుంబాలతో సచివాలయం ముట్టడికి యత్నించడంతో.. అప్పటికి తేరుకొని.. జిల్లాల సరిహద్దుల్లోనే నిలువరించారు.
Cong Failures On Lands: తాజాగా HCU భూముల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి పరిధిలోని కంచె గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆ భూమిని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేసింది. అయితే ఆ 400 ఎకరాలు యూనివర్సిటీవేనని విద్యార్థులు రోడ్డెక్కారు. అక్కడ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు జరిగినా.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి చిన్నగా చేసి చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా సుప్రీం కోర్టు కేసు సుమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పైగా పోలీసు అధికారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన నివేదికలో అక్కడ వన్య ప్రాణులు ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ముందు అభాసు పాలు అయింది. అయితే ఘటనలపై ఇంటలిజెన్స్ అధికారులు గుణపాఠం తెచ్చుకున్నారా అంటే సందేహంగానే సమాధానం ఇస్తున్నారు విశ్వసనీయ ప్రభుత్వ వర్గాలు.
Also Read: Pawan Kalyan Humanity: డిప్యూటీ సీఎం జత చెప్పుల కథ!
Cong Failures On Lands: తాజాగా సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్‌కి వెళ్లేటప్పుడు నోవాటెల్ హోటల్ లిఫ్ట్‌లో స్ట్రక్ అయ్యారు. లిఫ్టులో పరిమితికి మించి సీఎంతో పాటు ఇతర నాయకులు ఎక్కడంతో లిఫ్ట్ రెండు అడుగులు కిందకి దిగింది. దీంతో హడావిడి చేసిన సీఎం సెక్యూరిటీ.. మొత్తానికి ఆయన్ను బయటకు సేఫ్‌గా తీసుకు వచ్చారు. ఇక్కడ 8 మంది కెపాసిటీ గల లిఫ్ట్‌లో 13 మంది ఎక్కుతుంటే సీఎం సెక్యూరిటీ అడ్డుకోలేదు. పైగా హోటల్ వాళ్లు మాకు లిఫ్ట్ కెపాసిటీపై సరైన సమాచారం ఇవ్వలేదని హోటల్ యాజమాన్యంపై తోసేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగం సీఎం పర్యటన ముందు రోజే అక్కడ అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పరిశీలించాలి, కానీ భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం స్పష్టం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ టీం, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ISW సిబ్బంది పని తీరుపై సున్నితంగా మందలించినట్టు తెలిసింది. ఎవరిపై ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదని సీఎంవో వర్గాలు అంటున్నాయి.
మొదటి నుండి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్‌తో ప్రభుత్వం సతమతం అవుతుందని సీఎంవో అధికారుల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలు, ముందస్తు వ్యూహాలు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల మూడ్‌ను పసిగట్టడంలో నిఘా విభాగం విఫలం అయిందని అంటున్నారు. అయితే నిర్లక్యం వెనుక గల కారణాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించినట్టు చెప్తున్నారు. నిఘా వర్గాల పనితీరు మెరుగు పరిచేందుకు ప్రభుత్వ పెద్దల స్పెషల్ నజర్ ఏ మేరకు పనిచేయనుందో వేచి చూడాలి మరి.