Chevireddy Over Acting: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం రోజుకో మలుపుతో రసవత్తరంగా సాగుతోంది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణలో ఒక్కో రోజూ వింతలు, విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డ్రామాలో అందర్ని ఆకట్టుకుంటోంది మాత్రం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి వ్యవహార శైలి అరెస్టు తర్వాత పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు ఆయన ప్రెస్మీట్లు పెడుతూ అందరి మీదా కేకలేస్తూ, వార్నింగులు ఇచ్చేవారు. ఓ ఫాదర్ సెంటిమెంట్ స్టోరీని పదేపదే చెబుతూ.. తాను అత్యంత సచ్ఛీలుడినని చెప్పుకొచ్చేవారు. ఇక అరెస్టైన తొలినాళ్లలో తనను అక్రమంగా బంధించారంటూ.. దేవుడు చూస్తున్నాడంటూ, అందరూ నాశనం అయిపోతారంటూ.. గట్టి గట్టిగా అరుస్తూ సిట్ అధికారులకు శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేశారు. నిన్న కోర్టులో అయితే న్యాయమూర్తి ముందు బోరుమని విలపించారు. ఒళ్లు నొప్పులు, నడుము నొప్పులతో తాళలేకపోతున్నానని, కనికరించి మధ్యంత బెయిల్ ఇప్పించాలని వేడుకున్నాడు. ఇక కోర్టులో ఆయన డ్రామాలు చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి.. కనీసం కోర్టులో అయినా నెమ్మదిగా ఉండలేరా అంటూ వ్యాఖ్యానించారట.
Also Read: Bandi Sanjay: సిద్ధంగా ఉన్న తెలంగాణకు రాని ఆర్మీ హెలికాప్టర్ల .. బండి సంజయ్ ఆరా..
లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి పాత్రను సిట్ బృందం ఎప్పుడో గుర్తించింది. మద్యం దందా ద్వారా వచ్చిన డబ్బును చెవిరెడ్డి ఎన్నికల్లో ఖర్చు చేశారని, అందుకోసం తన అనుచరులు, సన్నిహితుల సాయం తీసుకున్నారని సిట్ ఆరోపిస్తోంది. అయితే, చెవిరెడ్డి మాత్రం తనకు ఈ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు కావాలనుకుంటే అరెస్టు చేయొచ్చని గట్టిగా సవాల్ విసిరారు. కానీ, సిట్ అధికారులు ఆయన అరెస్టుకు పక్కా ప్రణాళిక వేస్తుండగా, చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్‌పోర్టు మీదుగా పారిపోయేందుకు యత్నించారు. అయితే, ఎయిర్‌పోర్టు అధికారుల సహకారంతో సిట్ బృందం ఆయన్ను అడ్డుకుని, అరెస్టు చేసింది. తాజాగా, లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు అందరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తరలిస్తున్న సందర్భాల్లో చెవిరెడ్డి చేస్తున్న ఓవరాక్షన్ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సిట్ అధికారులు.. చెవిరెడ్డిని వర్చువల్‌గా హాజరు పరిచేందుకు అనుమతి కోరారు. దీంతో కంగారుపడిపోయిన చెవిరెడ్డి లాయర్లు.. తమ క్లయింట్‌ని కోర్టుకు తీసుకురావాల్సిందేనని వాదించడంతో.. ఆయన్ను నేరుగా కోర్టుకు తీసుకురాక తప్పలేదు. అక్కడ న్యాయమూర్తిని చూసిన వెంటనే చెవిరెడ్డి బోరుమని ఏడుస్తూ డ్రామా స్టార్ట్ చేశారట. అయితే ఏసీబీ కోర్టుకు తీసుకువస్తున్న ప్రతిసారి అరుస్తూ, కోర్టు ప్రాంగణంలో హల్‌చల్ చేస్తున్న చెవిరెడ్డి తీరును న్యాయమూర్తి ఆక్షేపించారట. ‘కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా.. మిగిలిన నిందితులు ఎలా ఉంటున్నారు? మీరెలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి’ అంటూ మందలించారట.
రాజకీయాల్లో ఎంతో స్ట్రాంగ్ అనుకున్న చెవిరెడ్డి బేలతనాన్ని చూసి ఇప్పుడు వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. చెవిరెడ్డి ఈ డ్రామా కష్టాలు ఇంకెన్నాళ్లో వేచి చూడాలి.