Chevireddy Liqueur Stories: మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి, ఆయన అనుచరులదే కీలక పాత్ర అనడానికి తిరుగులేని ఆధారాలు సేకరించింది సిట్. చెవిరెడ్డి స్కామ్ మేట్ అయిన వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కిస్తున్న విజువల్స్ బయటకు రావడంతో చెవిరెడ్డితో పాటూ వైసీపీ నేతలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకవైపు సెంటిమెంట్ కథలు చెప్తూ, మరోవైపు సిట్ అధికారులపై రంకెలేస్తున్న చెవిరెడ్డికి, కేవలం వ్యక్తిగత కక్షతోనే కేసులు పెట్టారంటున్న జగన్ రెడ్డికి ఇది షాకింగ్ పరిణామం అంటున్నారు పరిశీలకులు.
హైదరాబాద్ కేంద్రంగా తన అక్రమ సామ్రాజ్యం నెలకొల్పుకున్న చెరుకూరి వెంకటేష్ నాయుడుకి మొదటి నుండి చెవిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ సంబంధాల వల్లే వైసీపీలోని అగ్రనాయకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలే వెంకటేష్ నాయుడుని మద్యం స్కామ్‌లో కీలక సూత్రధారిగా మార్చింది. ఇతనిని జూన్‌లో అరెస్ట్ చేసిన సిట్, ఏ-34 నిందితుడిగా చేర్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతుండగా…. బెంగళూరు విమానాశ్రయ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్… గురు శిష్యులు, ప్రాణ మిత్రులు, స్కామ్‌స్టర్లు అయిన ఈ ఇద్దర్నీ అదుపులోకి తీసుకుంది. ఇక అరెస్టు నాటి నుంచి చెవిరెడ్డి చెబుతున్న సుభాషితాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మద్యం అంటేనే తనకు గిట్టదంటాడు. మద్యం వ్యాపారం తమ ఇంటా వంటా లేదంటాడు. “ఐ లాస్డ్ మై ఫాదర్.. బికాజ్ ఆఫ్ దిస్ బ్లడీ బద్మాష్ లిక్కర్” అంటూ సెంటిమెంట్ పండిస్తాడు. ఒక్కోసారి బెదిరింపులు, ఒక్కోసారి బేల చూపులు. ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మీడియా టీఆర్‌పీ రేటింగ్ పెంచుతున్నాడు. అయితే చెవిరెడ్డి అపరిచితుడి వేషాలపై ఆయన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. నేడు పులివర్తి నాని మాటలే నిజమయ్యాయి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు చంద్రగిరి ప్రజలు.
Also Read: Harish Rao: అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్‌పై చర్చ పెట్టండి.. చీల్చి చెండాడుతాం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్ కేంద్రంగా వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని అంటున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో 2022 సంక్రాంతికి వేసిన తిరుమల సెట్టింగ్‌లో కూడా ఇతగాడు ప్రత్యక్షమయ్యాడు. అతని ఫేస్‌బుక్ అకౌంట్ పరిశీలిస్తే… లెక్కలేనంత మంది వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు దొరుకుతున్నాయి. చివరకు లక్ష్మీ పార్వతితో సైతం మనోడు ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వెంకటేష్ నాయుడు తన మందీ మార్బలంతో వచ్చినప్పుడు… అక్కడి అధికారులు రాచమర్యాదలు చేసేవారట. అన్నింటికన్నా… జగన్ లండన్ పర్యటనలోనూ వెంకటేష్ నాయుడు తోడున్నాడని సమాచారం. ఆ సమయంలో జగన్ ఆర్థిక వ్యవహారాలను వెంకటేష్ నాయుడు టీమే పర్యవేక్షించిందని అంటున్నారు. ఒంగోలులో చెవిరెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేష్ నాయుడు.. తన ఎన్నికల అఫిడవిట్‌లో… తన చేతిలో, బ్యాంకులో అమౌంట్ అంతా కలిపినా పట్టుమని పది లక్షలు కూడా లేవని, సొంత ఇళ్లు లేదని పేర్కొన్నాడు. అటువంటి వెంకటేష్ నాయుడికి డెన్‌గా వాడుకునేందుకు హైదరాబాద్‌లో లగ్జరీ ప్లాట్‌ను ఎవరిచ్చారు? స్పెషల్ ఫ్లయిట్లు ఎవరు సమకూర్చారు? అనే విషయాలు తేలాల్సి ఉంది.
తెలంగాణ బీఆర్‌ఎస్ నాయకులతోనూ వెంకటేష్ నాయుడుకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ యువనేత కేటీఆర్ కోసం హిందూ పత్రికలో 10 లక్షలతో యాడ్ ఇచ్చాడు. రెగ్యులర్‌గా కేటీఆర్‌తో టచ్‌లో ఉండటమే కాకుండా, చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఏపీలో అవసరమైన నిధుల వ్యవహారాలన్నీ తానే చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడింది. మొత్తం మీద, మద్యం స్కామ్‌లో తనను కుట్రతో ఇరికించారని చెబుతున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చెవిరెడ్డి, జగన్ రెడ్డిలు ఇప్పుడేం సమాధానం చెబుతారో మరి.