Check for Kethireddy

Check for Kethireddy: ధర్మవరం వైసీపీ బాధ్యతలు తోపుదుర్తికి..!

Check for Kethireddy: అనంతపురం ఉమ్మడి జిల్లా అంటేనే టీడీపీ కంచుకోట. ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల ట్రాక్ రికార్డు చూస్తే, 2024 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలో 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 12 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిచి టీడీపీ కంచుకోటను బీటలువారే విధంగా వైసీపీ జెండా రెపరెపలాడించింది. అయితే, ఐదేళ్లు తిరిగేసరికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘోర ఓటమి చవిచూసింది వైసీపీ. కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేక బొక్కబోర్లా పడింది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లాల్లోనూ బలహీనపడుతూ వస్తోంది. నియోజకవర్గాల్లో అయితే పోరాడే నాయకుడే కరువైనట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితే అందుకో ఉదాహరణ. మార్నింగ్‌ స్టార్‌గా ధర్మవరంలో చక్రం తిప్పిన కేతిరెడ్డి పరిస్థితి ఇప్పుడు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇదే అదనుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. ధర్మవరంలో తన ఆఫీసు ఓపెన్‌ చేస్తా అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులూ ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ అంటూ హల్‌చల్ చేసేవారు. సోషల్ మీడియా స్టార్‌గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయం వైసీపీలో చాలా భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. 2019 నుంచి 2024 వరకు ధర్మవరం ఎమ్మెల్యేగా నిత్యం వార్తల్లో నిలిచారాయన. అనేక అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్ష నాయకులు కేతిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేతిరెడ్డి మాత్రం చాలా డిఫరెంట్‌గా స్పందించేవారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ పాలసీలను సైతం ఆయన విమర్శించారు. తన అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కేతిరెడ్డి బహిరంగంగానే విమర్శించారు. లిక్కర్, ఇసుక పాలసీలపై వైసీపీ నిర్ణయాలు తప్పని, అవే తమ ఓటమికి కారణమయ్యాయని కూడా బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వాలు డైరెక్ట్‌గా లిక్కర్, ఇసుక వంటి పాలసీల్లో ఇన్వాల్వ్ కాకూడదని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. అదేవిధంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు జల్లులు కురిపించారు కేతిరెడ్డి. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయానికి ఎసరు పెడతున్నాయి. ఇప్పుడు కేతిరెడ్డికి ఆ పార్టీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారా? రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి… పదేపదే ధర్మవరంలో పార్టీ ఆఫీసును ప్రారంభిస్తానని చెప్పడమే అందుకు సాంకేతమా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా పార్టీలో ఇంటర్నల్‌గా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా… ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు.. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరు లిక్కర్ ఫైల్స్‌లోకి ఎక్కింది. లిక్కర్‌ ముడుపులతోపాటూ, పేకాట డెన్‌లో ముడుపులు అందినట్టు విజిలెన్స్‌ తేల్చింది. దీంతో లిక్కర్‌ స్కామ్‌లో దర్యాప్తు చేస్తున్న సిట్‌ నుండి కేతిరెడ్డికి గండం ఎదురవుతోంది. మొత్తానికి ఈ మార్నింగ్‌ స్టార్‌ ఇప్పుడు రాజకీయం సుడిగుండంలో పడినట్టే అంటున్నారు పరిశీలకులు.

Also Read: AP HighCourt: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం ఫోటో వివాదం: పిల్ కొట్టివేత

ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి ఒక బలమైన నాయకుడు. అయినప్పటికీ, మరో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధర్మవరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభిస్తానని చెప్పడానికి కారణాలు ఏంటి? కేతిరెడ్డి వైసీపీ పార్టీని వీడనున్నారా? గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారా? ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉందా? వైసీపీ పెద్దలు ఆ రకంగా ఏమైనా అనుమానిస్తున్నారా? అందులో భాగంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని ధర్మవరంలో రంగంలోకి దించుతున్నారా? ప్రకాశ్ రెడ్డి ధర్మవరంలో వైసీపీ కార్యాలయాన్ని ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు? ఇలా అనేక ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లో తలెత్తుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా ఈ పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్ఠానం మాస్టర్ ప్లాన్ వేసిందా? నిజంగానే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధర్మవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తే, వైసీపీ రెండుగా చీలిపోయినట్టేనా? కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వర్సెస్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య వార్ మొదలైనట్టేనా? అసలు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఈ లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు వైసీపీ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుంది? ఈ పరిణామలు, తోపుదుర్తి వ్యాఖ్యలపై అధిష్టానం స్పందిస్తే తప్ప ఈ చర్చకు బ్రేక్‌ పడేలా లేదు. చూడాలి మరి, ధర్మవరంలో ఏం జరుగుతుందో. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *