Chandrayya Subbaiah: వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ హెలికాప్టర్ దిగుతున్నారు. ఆ క్రమంలోనే రాప్తాడు హత్యను టీడీపీ ఖాతాలో వేసి, “రెడ్‌బుక్ పాలన” అంటూ రచ్చ చేశారు. ఆధారాలు లేకుండా నిందించడం జగన్‌కు అలవాటే. కానీ, తాను అధికారంలో ఉన్న రోజుల్లో రాష్ట్రం రక్తపాతంతో రగిలిందన్న సత్యాన్ని మాత్రం మర్చిపోతారాయన. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం కక్ష రాజకీయాలకు బలైపోయారు. అప్పుడు ఈ గొప్ప మానవతా వాది జగన్ ఎక్కడున్నారో తెలియదు. ఉదాహరణకు టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య. 2022లో పల్నాడు జిల్లా గుండ్లపాడులో వైసీపీ నేతలు పట్టపగలు చంద్రయ్య గొంతు కోసి చంపారు.
నిందితులు పిన్నెల్లి సోదరుల అండదండలతో తిరిగారు. బాధితులనే గ్రామం నుంచి తరిమారు. ఇక టీడీపీ బీసీ నేత నందం సుబ్బయ్య హత్య ఆనాటి రాక్షస పాలనకు మరో ఉదాహరణ. 2021లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ టీడీపీ నేత, న్యాయవాది అయిన నందం సుబ్బయ్యను వైసీపీ అక్రమాలను ప్రశ్నించాడని కత్తులతో నరికి చంపారు. కళ్లలో కారం చల్లి, తలపై నరికి రక్తపు మడుగులో వదిలి వెళ్లారు. భార్య అపరాజిత అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కనుసన్నల్లోనే తన భర్తను హతమార్చారని ఆరోపించినా… పోలీసులతో కట్టుకథలు చెప్పించి “వ్యక్తిగత కక్ష” అని ముగించారు.
Chandrayya Subbaiah: జగన్ హయాంలో ఇలాంటి రాజకీయ హత్యలు లెక్కలేనన్ని జరిగాయి. రాయలసీమలోనైనా, గోదావరి జిల్లాల్లోనైనా ప్రతిపక్షాలపై దాడులకు దిగి ప్రాణాలు తీసేవారు. పోలీసులను ముందు పెట్టి తాడేపల్లి పెద్దల స్క్రిప్ట్ ప్రకారం కట్టు కథలు అల్లించి వైసీపీ రౌడీలను చట్టం నుండి తప్పించే వారు. బాధితులు నోరు విప్పితే రివర్స్ కేసులు పెట్టి వేధించారు. రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తే ఆనాడు పోలీసులు వైసీపీకి ఎంతటి తొత్తులుగా మారారో అర్థమవుతుంది. అప్పుడు మానవత్వం గురించి మాట్లాడని జగన్, ఇప్పుడు రాప్తాడు హత్యకు రాజకీయ రంగు పులమడం ముమ్మాటికీ హాస్యాస్పదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: SI Sudhakar warning: తెగిస్తే ఒక ఎస్సై చాలు.. జగన్‌కి అర్థమౌతోందా?
Chandrayya Subbaiah: వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయం చేసేందుకు హెలికాప్టర్ వేసుకుని మరీ రాప్తాడుకు వెళ్లిన జగన్.. అప్పట్లో తోట చంద్రయ్య, నందం సుబ్బయ్యల హత్యలు జరిగితే.. ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు హత్యలను “పాత కక్షలు” అని మాఫీ చేసిన వైసీపీ, ఇప్పుడు ఎక్కడ శవం దొరికినా కూటమి ఖాతాలో వేయాలని ఆరాటపడుతోంది. కానీ, ప్రజలు అంత మూర్ఖులేమీ కాదు. శవాలను అడ్డుపెట్టుకుని ఆడే ఈ రాజకీయ డ్రామాను ప్రజలు ఎల్లకాలం విశ్వసిస్తారు అనుకుంటే భ్రమే అవుతుంది.

