BRS Phone Tap Plan Fail

BRS Phone Tap Plan Fail: ఆధారాలు బయటపెట్టి రేవంత్‌ని దింపేయొచ్చుగా..!

BRS Phone Tap Plan Fail: ఆరోపణలకు ప్రత్యారోపణలే సమాధానమని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. ఫోన్‌ ట్యాపింగ్‌తో డిఫెన్స్‌లో పడ్డ గులాబీ పార్టీ… అందుకు విరుగుడుగా అదే ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గుప్పిస్తోంది. అందుకు కాంగ్రెస్‌లో ఉన్న వర్గ విభేదాలను అవకాశంగా తీసుకుంటోంది. కేంద్రంలో బీజేపీ సహకారంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారనీ, అందులో నలుగురు మంత్రులు, 25 మంది ఎంఎల్‌ఏలు.. ఉన్నారంటూ షాకింగ్‌ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల ఫోన్‌లతో పాటూ, ఏకంగా టీ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఫోన్‌ సైతం ట్యాపయ్యాయని తొలుత ఆరోపించిన బీఆర్‌ఎస్‌… ఆ ఆరోపణల వల్ల పెద్దగా ఫలితం లేకపోవడంతో.. డోస్‌ పెంచుతోంది. ఈ దిగజారుడుతనం సరిపోదు, అంతకు మించి దిగజారాలన్న ప్రతి సందర్భంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న ఆయుధం కౌశిక్‌ రెడ్డి. ఇప్పుడు కూడా ఆ ఆయుధాన్నే ప్రయోగించింది. సాక్షాత్తూ సీఎం… దుబాయ్‌లో, ఢిల్లీలో ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ పడుకుంది అన్నీ చెప్పేస్తా అంటున్నారాయన. మిస్‌ వరల్డ్‌ పోటీదారుల ఫోన్లు కూడా ముఖ్యమంత్రి ట్యాప్‌ చేశాడని గల్లీ లెవెల్‌ ఆరోపణలు చేస్తున్నాడు. ఇక కౌశిక్‌ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్‌, ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటోళ్లు జత కలిశారు. వీళ్ల వ్యవహారం చూస్తుంటే.. రేపో మాపో… రాహుల్‌, సోనియా, ప్రియాంకా గాంధీల ఫోన్లు కూడా రేవంత్‌ రెడ్డి ట్యాప్‌ చేశాడని ఆరోపించినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు విరుగుడుగా…. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలే కౌంటర్‌ వ్యూహంగా గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్‌ అవ్వడం వల్లే.. ఆ పార్టీలో ఫ్రస్టేషన్‌ పెరిగిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిరతకు ఆది నుండి అనేకానేక ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌… సీఎం, మంత్రుల మధ్య చీలిక తెచ్చేందుకు తెర మీదకు ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చారు. గతంలో కేటీఆర్‌ ఇవే ఆరోపణలు చేస్తే… మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి వంటి వారు ఖండించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వరుస కథనాలు రాస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్… ఆ వ్యతిరేకత నుండి బయటపడేందుకు ఈ చీఫ్ ట్రిక్స్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ వ్యవహారం దొంగే… దొంగ దొంగ అన్నట్టుగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు.

Also Read: Narayana Swami Approval: సిట్‌కి సింగిల్‌ రీజన్‌ చాలు.. మాజీ మంత్రికి రెండే ఆప్షన్లు..!

తమకు అంటిన బురదను ఇతరులకు కూడా అంటింటే ప్రయత్నంగా బీఆర్‌ఎస్‌ ఆరోపణల్ని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. అందుకు అనేక కారణాలున్నాయి. ఈ రోజు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేసిన ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ గతంలో చేసిన నిర్వాకాలేంటి? ప్రణీత్‌ రావ్‌ అనే ఎస్సైకి నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఏసీపీగా ప్రమోషన్‌ ఇచ్చి, ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం నియమించలేదా? ప్రభాకర్‌ రావు, ప్రణీత్‌ రావ్‌, శ్రవణ్‌ రావ్‌, రాధాకిషన్‌ రావ్‌, ఇలా సొంత సామాజికవర్గం వారిని నమ్మకంగా నియమించుకుని ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న చర్చ. గత ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల కదలికలు తెలుసుకోవడం కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ను ఉపయోగించే వారు. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచ్చల విడిగా సమాజాన్ని ప్రభావితం చేసే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానికి నిదర్శనంగా ప్రభుత్వం మారగానే సిట్‌ కార్యలయంలో పరికరాలన్నీ ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, హార్డ్‌ డెస్క్‌లు, సర్వర్లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడకుంటే ఇవన్నీ చేయాల్సి అవసరం ఏమున్నట్లు?

ALSO READ  AP Liquor: ఈరోజే మద్యం షాపుల లాటరీ.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు

గతంలో ఏ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోయినప్పుడు ఇలా సిట్‌ కార్యాలయంలో పరికరాలు ధ్వంసం చేయలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ఎస్‌ఐబీ వ్యవస్థని అడ్డుపెట్టుకుని ఈ ఫోన్‌ ట్యాపింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోందో.. ఆ ఎస్‌ఐబీని తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం. ఆనాడు హైదరాబాద్‌ నడిబొడ్డున ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ చంద్రను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో… మావోలపై డేగ కన్ను లాంటి వ్యవస్థ అవసరమని భావించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎస్‌ఐబీ వ్యవస్థని తీసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చినప్పుడు ఇలా ఎస్‌ఐబీ కార్యాలయంలో పరికరాలను ఏమీ ధ్వంసం చేయలేదే. ఆ తర్వాతి ప్రభుత్వాలు కూడా అలాంటి పనులు చేయలేదే. ఒకే సామాజికవర్గం అధికారులను ఎస్‌ఐబీలో పెట్టుకోలేదే. ఇజ్రాయిల్‌ నుండి ప్రత్యేక పరికరాలను తెప్పించుకోలేదే. చేయాల్సిన తప్పులన్నీ చేసి.. అన్నీ కళ్ల ముందు కనబడుతున్నా.. బీఆర్‌ఎస్‌ రివర్స్‌లో చేస్తోన్న ట్యాపింగ్‌ ఆరోపణల్ని చూసి… ప్రజలు పట్టించుకోకపోగా… నవ్వుకుంటున్న పరిస్థితి. అంతెందుకు.. ఆది నుండి రేవంత్‌ సర్కార్‌ని కూల్చాలని ఆశ పడుతున్న బీఆర్‌ఎస్‌.. తమ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి చేస్తున్న సంచలన ఆరోపణలకు సంబంధించి… ఆధారాలు బయటపెడితే సరిపోతుంది కదా… అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *