BRS Cader: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ రజతోత్సవ సభను వేదికగా చేసుకోనున్నారని విశ్లేషకులు అంటున్నారు. గతంలో తెలంగాణ భవన్ సమీక్షలు, బస్సు యాత్రలు నిర్వహించినా క్యాడర్‌లో జోష్ రాలేదు. ఇప్పుడు భారీ సభ ద్వారా కార్యకర్తలను ఉత్తేజపరిచి, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీ మనుగడకు సైద్ధాంతికత, సంస్థాగత నిర్మాణం కీలకం. బీఆర్ఎస్‌కు సైద్ధాంతికత అంటే.. తెలంగాణ ప్రయోజనాలే అని చెబుతారు. కానీ, కేసీఆర్ మొదటి నుంచీ సంస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. సెంటిమెంట్ కలిసొచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చినా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సారు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిగా శ్రద్ధ తగ్గించారని పరిశీలకులు చెబుతుంటారు. ఫలితంగా, పదవులు లేకుండా నాయకులు నామమాత్రంగా మిగిలారు. ఇప్పుడైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఇంచార్జీలే చూసుకునేవారు కాబట్టి, మండల, జిల్లా నాయకులు క్రీయశీలంగా లేరు. దీని ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది, ఓటమికి అదే కారణమైంది. రాష్ట్ర కమిటీ ఆరేళ్ల క్రితం ప్రకటిస్తే, జిల్లా కమిటీలను 2022లో ప్రకటించారు. కానీ, పూర్తిస్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు కాలేదు. ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యేలనే బాధ్యులుగా కొనసాగించడం విమర్శలకు దారితీసింది. ఇటీవల కమిటీల ఏర్పాటు బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించినా, పురోగతి స్పష్టంగా లేదు. కేసీఆర్ కుటుంబ పార్టీగా బీఆర్ఎస్ మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: BRS Silver Jubilee: కేసీఆర్ ‘రజతోత్సవ’ ప్లాన్ చూస్తే మతి పోవాల్సిందే!
BRS Cader: కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత తప్ప ఇతరులకు అవకాశాలు తక్కువన్న విమర్శలున్నాయి. కేడర్‌ను బలోపేతం చేస్తామన్న ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా జనసమీకరణతో పాటు, పార్టీ నిర్మాణంపై ఆశలు రేకెత్తిస్తున్నారు కేసీఆర్. అధికారంలోకి వచ్చాక, ఉద్యమకారులను కాదని, వలస నాయకులకు పదవులు ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అసంతృప్తి గత ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అయినా జరిగిన తప్పులను గుర్తించి, పార్టీ ప్రక్షాళన, పునర్నిర్మాణం దిశగా అధినేత నిర్ణయాలు తీసుకుంటారని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
25 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్, 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్షంగా రజతోత్సవాలకు సిద్ధమైంది. 2001లో టీఆర్ఎస్‌గా స్థాపితమై, 2022లో బీఆర్ఎస్‌గా మారింది. అధికారం కోల్పోయి, 88 నుంచి 39 ఎమ్మెల్యేలకు పడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితాలను సాధించింది. ఇప్పుడీ సభ ద్వారా కొత్త ఊపు తెస్తారా? పార్టీ పునర్నిర్మాణానికి నాంది పలుకుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.