BR Naidu: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలుత అన్యమత ఉద్యోగులను బయటకు పంపాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హిందూ సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ నెలలో ప్రతి మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అన్నప్రసాద కేంద్రాల్లో నాణ్యత పెంచి, వడను మెనూలో జోడించారు. లడ్డు ఉత్పత్తిని రోజుకు 4.5 లక్షలకు పెంచడమే కాకుండా, ఆటోమేటెడ్ వ్యవస్థలు అందుబాటులోకి తెస్తున్నారు. భక్తుల అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్‌బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసి, క్యాంటీన్ల నిర్వహణను పారదర్శకంగా మార్చారు. ఏడుకొండలు కూడా స్వామివారివే. ఎక్కడా భూములు అన్యాక్రాంతం కాకూకడు. ఎక్కడా అక్రమ వ్యాపారాలు జరక్కూడదు అనే విధంగా చర్యలు తీసుకున్నారు. తిరుమల ఆస్తుల పరిరక్షణకు న్యాయపోరాటాలు వేగవంతం చేశారు. టీటీడీ కింద నడిచే సంస్థలు, విద్యాలయాల్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్లు, లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారు. ఏపీలో 5 వేల ఆలయాలు నిర్మించే భారీ బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో ఆలయాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. సైబర్ మోసాల నివారణకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: AP Cabinet Meeting: రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించి, అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టే తీర్మానం చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టును శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చే సిఫారసు ప్రభుత్వానికి పంపారు. 100 ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రాన్ని కోరారు. తిరుపతిలో అధునాతన ఫుడ్ ల్యాబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. విశ్రాంతి భవనాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టారు. ఆకాశగంగా, శిలాతోరణం వంటి ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచుతున్నారు. సిమ్స్ ఆసుపత్రికి అదనంగా నిధులు అందిస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి అన్నప్రసాదం, 100 గదుల వసతి ఏర్పాటు చేస్తున్నారు. వేద పారాయణ దారులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇలా మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న బీఆర్ నాయుడు, రెండో ఏడాది ఏఐ, ఐటీ అనుసంధానంతో భక్తులకు అద్భుతమైన దర్శన అనుభవాన్ని కల్పించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, క్యూ లైన్లను అత్యాధునిక టెక్నాలజీతో మానిటరింగ్ చేస్తారు. 60 ఆలయాలకు అన్నప్రసాద విస్తరణ, విదేశాల్లో ఆలయాలకు ట్రస్ట్ నిధులు వినియోగించబోతున్నారు. బీఆర్ నాయుడు సహజ శైలితో సరళత్వాన్ని తీసుకొచ్చి, టీటీడీ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ, భక్తుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నారు. టీటీడీ అధిపతిగా స్వామివారి సేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మహాన్యూస్ ఆకాంక్షిస్తోంది.

