BJP Focus On Royal KNL: బీజేపీ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నా అనుకున్న స్థాయిలో విజయాలు అయితే దక్కలేదు. బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసినా, సొంతంగా పోటీ చేసినా.. వారు అనుకున్న స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓట్లు రాబట్టుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. పార్టీ పిలుపునిస్తే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పనిచేయడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా.. ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ చతికిల పడుతోంది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో చేరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయాన్ని దక్కించుకుంది బీజేపీ. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని అసెంబ్లీ సీటు కేటాయించారు. ప్రముఖ డెంటల్ డాక్టర్ పార్థసారథికి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆదోనిలో మైనార్టీలు అధికంగా ఉన్నప్పటికి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై ప్రజలు విసిగిపోయి పార్థసారథిని గెలిపించారు. ఎమ్మెల్యే పార్థసారథి కూడా తనదైన శైలిలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే స్థానం గెలవడంతో బీజేపీకి ఆశలు చిగురించాయి. ఇన్నాళ్లూ బీజేపీ మరో పార్టీ నేతకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అనుకున్న స్థాయిలో సీట్లు గెలవడంతో బీజేపీ సొంతంగా బలపడడానికి మరిన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. కూటమి పాలన విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కూడా పెరిగాయి. బీజేపీ అధిష్టానం కూడా పార్టీ బలోపేతానికి ఇక్కడి నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తోంది. జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఉన్న చైర్మన్లు, కౌన్సిల్ మెంబర్లు ఇలా వివిధ స్థాయిల్లో పని చేస్తున్న నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. అసంతృప్తితో ఉన్న నాయకులను చేర్చుకొని పార్టీని బలపరుచుకుంటోంది. ఆదోని, ఎమ్మిగనూరులలో ఇటీవలే అంతర్గత విభేదాల కారణంగా ఇబ్బంది పడ్డ నాయకులకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇటు పార్టీలో ఉండే నాయకులను కూడా బుజ్జగిస్తూ పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరుకూ వారిని శాంతింపజేశారు. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు సెకండ్ క్యాడర్ లీడర్స్.
Also Read: RS Praveen Kumar: మేడిగడ్డ పిల్లర్ల పగుళ్లపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన విషయాల వెల్లడి
ఇటీవలే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నంద్యాల, కర్నూలు జిల్లాలలో పర్యటించారు. ఆయన పర్యటనలో కూడా పలువురు నాయకులు బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రాయలసీమ జిల్లాలలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులను సిద్ధం చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు బీజేపీ పెద్దలు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అటు బిజెపి రాష్ట్ర నాయకత్వం, ఇటు జిల్లా నాయకత్వం కలిసి పనిచేయడం ఎంతగానో ఉపయోగపడుతుందని బిజెపి కేడర్ కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే బిజెపి సంసిద్ధం కావడంతో పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది.