Bhimavaram Bonanza : భీమవరం!! విచ్చేసిన అతిథులకు మర్యాదలు చేయడంలో ఈ ప్రాంత వాసులది అందవేసిన చేయి. ఇక సంక్రాంతి వచ్చిందంటే కోడిపందాలు, సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ పట్టణంలో అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఒకేలా ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా, స్నేహ బంధాన్ని వదులుకోరు. ఇక కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్య పట్టణంగా మారింది భీమవరం. ఇవన్నీ కొత్తగా చెప్పేవి ఏమీ కాదు గానీ, ప్రస్తుతానికి ఈ పట్టణం రాజకీయంగా కొత్త వైభవం సంతరించుకుంది. అన్ని రాజకీయ పార్టీల కీలక పదవులతో ఈ ప్రాంత నాయకులకు అదృష్టం వరించింది. అధికారపక్షమే కాకుండా మిత్రపక్షం, ప్రతిపక్షం నాయకులతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా కీలక పదవుల్లో ఉన్నారు. సో… ప్రస్తుతం పొలిటికల్ పదవులతో బరువెక్కి పోయింది భీమవరం.
మొట్టమొదటిగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గురించి చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాస వర్మకు చివరి నిమిషంలో అనూహ్యంగా పార్లమెంటు సీటు రావడం, భారీ మెజార్టీతో విజయం సాధించడం, కేంద్ర మంత్రి అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజంగా ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు వందల కోట్లతో తన నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు శ్రీనివాసవర్మ. అదే క్రమంలో చూస్తే పాకా సత్యనారాయణ తాజాగా రాజ్యసభ సభ్యులయ్యారు. ఈయన కూడా బిజెపిలో కీలక నేత. రాజ్యసభ రేసులో ఎక్కడా ఆయన పేరు వినిపించలేదు. కానీ కేంద్ర నాయకత్వం పాకా సత్యనారాయణ పేరు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంటే బిజెపిలో ఇక్కడ రెండు కీలక పదవులు మనకు కనిపిస్తున్నాయి.
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి చూస్తే.. భీమవరం నేతకు ఒక సముచితమైన పదవి ఇచ్చి గౌరవించింది. త్రిబుల్ ఆర్… ఈయన గురించి ఏం చెప్పినా, అతిశయోక్తిగానే ఉంటుంది. భీమవరం సమీపంలోని ‘ఉండి’కి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది టీడీపీ. ఇది కూడా అనూహ్యమైన పరిణామంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ముందు నుంచి ఆయన ఎంపీ అవుతారనుకున్నారు, తర్వాత ఎమ్మెల్యేగా వచ్చారు. మంత్రి అవుతారనుకున్నారు, చివరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. తనదైన శైలిలో సభను నిర్వహిస్తూ డిప్యూటీ స్పీకర్ హోదాకు కొత్త వన్నె తెస్తున్నారు త్రిబుల్ ఆర్. వినూత్నంగా దాతల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేన పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు పులపర్తి రామాంజనేయులు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు అంజిబాబు. ఎవ్వరూ ఊహించని పరిణామాలతో.. ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే ‘అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ’ చైర్మన్ అయ్యారు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు.
Also Read: AP Liquor Scam: ఏపీ మద్యం కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు
Bhimavaram Bonanza: ఇప్పటివరకు అధికార కూటమి పార్టీల గురించి చూసాం. కూటమి నాయకులకు పదవులు గొప్ప విషయం కాదు గానీ, ప్రతిపక్ష వైసిపికి కూడా ఇక్కడ కీలక పదవులు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత వెంట నడిచిన కొయ్యే మోషేన్ రాజుకు ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మన్‌గా అవకాశం ఇచ్చింది వైసిపి అధిష్ఠానం. మరో వైసిపి నేత కవురు శ్రీనివాస్.. జడ్పీ చైర్మన్‌గా ఉంటూ… అనూహ్య పరిణామాల మధ్య స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక వామపక్షాల మద్దతుతో పిడిఎఫ్ తరఫున టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు బొర్రా గోపిమూర్తి. టీచర్‌గా రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేసిన గోపిమూర్తి ఎవరూ ఊహించని మెజార్టీతో గెలుపొందారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు.. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుంటున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని మార్చినా… అధినేత నిర్ణయానికి కట్టుబడి పార్టీ విజయానికి కృషి చేశారు. దీంతో మంతెన రామరాజుకు మొదటి జాబితాలోనే ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చింది టిడిపి. ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పీతల సుజాతకు మహిళా ఆర్థిక అభివృద్ధి మండలి చైర్మన్ పదవి ఇచ్చింది టిడిపి అధిష్ఠానం. ఈమెదీ భీమవరం నియోజకవర్గమే.
చెప్పుకోవడానికి చాలా బలంగా, బరువుగా కనిపిస్తున్నాయి ఈ పదవులన్నీ. కేంద్రమంత్రి నుంచి, మహిళా ఆర్థిక అభివృద్ధి మండలి చైర్మన్‌ల వరకు ఎన్నో పదవులు ఉన్నాయి. ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే వేదిక మీద ప్రోటోకాల్ జాబితా చాంతాడంత ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలకు పదవులు ఉన్నాయి. అలాగే రాజకీయ ప్రాబల్యం కలిగిన అన్ని వర్గాలకూ సముచిత ప్రాతినిధ్యం కనిపిస్తుంది. అందరూ ప్రజలతో మమేకమయ్యే ప్రజా నాయకులు కావడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఇదిలా ఉంటే భీమవరానికి మరిన్ని పదవులు రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, టిడిపి నాయకులు కొత్తపల్లి నాగరాజు, కోళ్ల నాగేశ్వరరావులకు మంచి పదవులు వరించబోతున్నాయని చెబుతున్నారు. అయితే పదవుల్లో ఉన్న ఈ నాయకులందరూ తలో చేయి వేస్తే భీమవరం మహానగరమే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకూ నేతలెవరూ ఆ దిశగా ఆలోచించినట్లుగా కనిపించడం లేదని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. వారి పదవులకు న్యాయం చేయాలంటే వారు ఉన్న ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ఆ దిశగా నాయకులు ఆలోచన చేస్తారని, తమ తమ పదవులకు వన్నె తెస్తారని ఆశిద్దాం.