Bharathi Salute to Babu: వైసీపీ సోషల్‌మీడియా… ఉదయం ఉవ్వెత్తున ఎగసిపడి, సాయంత్రానికల్లా చప్పున చల్లారిపోవడానికి కారణం మరేంటో కాదు… జగన్ సతీమణిపై నీచంగా కామెంట్ చేసిన ఆ కిరణ్ చేబ్రోలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో.. అతను గంటల వ్యవధిలో అరెస్ట్ అవ్వడమే. వైసీపీ హయాంలో కిరణ్ చేబ్రోలు లాంటి ఉన్మాదులు ఆ పార్టీలో లెక్కబెట్టడానికి వీళ్లేనంత మంది ఉండేవారు. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్రారెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. అయితే వీళ్లంతా జగన్ హయాంలో విచ్చలవిడిగా తిరిగేవారు.
వీరి వల్ల బాధింపబడిన వాళ్లు ఎవరయ్యా అంటే.. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో మొదలుపెడితే.. హోం మంత్రి వంగలపూడి అనిత, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. ఇంకా టీడీపీ, జనసేన పార్టీల్లోని మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు అందరూ ఆ ఉన్మాదుల బాధితులే. కానీ ఏనాడు సదరు సోషల్‌మీడియా ఉన్మాదులపై అప్పటి జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అటువంటి జగన్ రెడ్డి సతీమణిపై.. ఇప్పుడు ఓ టీడీపీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడాడని తెలియగానే.. వెంటనే టీడీపీ నుండి సస్పెన్షన్ వేటు, ఆ వెంటనే అరెస్టు. ఈ పరిణామాన్ని అస్సలు ఊహించని వైసీపీ క్యాడర్, లీడర్లు… చంద్రబాబు కూడా జగన్‌లాగే తన కార్యకర్తని వెనకేసుకుని వస్తాడులే అని… తమ స్వభావానికి అనుగుణంగా సహజంగానే భావించారు. కానీ చంద్రబాబు తన రూటే సెపరేట్ అని నిరూపించారు.
ఏ పార్టీ వాడైనా సరే.. మహిళల జోలికి వస్తే.. వాడికి అదే చివరి రోజని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని ఆచరణలో పెట్టి చూపించారు. తన పార్టీ కార్యకర్త అయిన కిరణ్ చేబ్రోలుని పార్టీ నుండి నిర్ధాక్షిణ్యంగా గెంటేయడమే కాకుండా.. క్షణాల్లో అరెస్టు చేయించారు. ఇప్పుడు కిరణ్ చేబ్రోలు అనే వ్యక్తి ఈ కేసులో జైలుకెళ్లినా ఆశ్చర్యం లేదు. అదీ జగన్‌కి, చంద్రబాబుకి తేడా అని.. ఇప్పుడు టీడీపీ క్యాడర్ గర్వంగా కాలర్ ఎగరేస్తుంటే.. వైసీపీ సోషల్‌మీడియా సైన్యాలు మాత్రం ఒకింత నిరాశలో కూరుకుపోయారట. ఇప్పుడు వారిలో తమ అధినేత సతీమణిని… ఒకడు దారుణంగా దూషించాడన్న బాధ కన్నా… దానిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా పోయిందన్న బాధే ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు సోషల్‌మీడియా ట్రెండ్‌ని ఫాలో అవుతున్న అనలిస్టులు.
Also Read: Tahawwur Rana: తహవూర్ రాణాకు 18 రోజుల NIA కస్టడీ
Bharathi Salute to Babu: ఇక కిరణ్ చేబ్రోలు అరెస్టుతో కొందరు వైసీపీ నేతలు ఎంత డిజప్పాయింట్ అయ్యారంటే గోరంట్ల చేసిన రచ్చ చూస్తే అర్థమౌతుంది. కిరణ్ అరెస్టు విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్… కిరణ్‌పై దాడి చేసి, జగన్ వద్ద ఫస్ట్ నేనే మార్కులు కొట్టాస్తానంటూ బరిలోకి దిగిపోయారు. గతంలో పోలీసు అదికారిగా పనిచేసిన తన బుర్రకు పదును పెట్టిన మాధవ్.. కిరణ్‌ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి, తన వాహనంతో వెంబడించారు. మార్గమధ్యంలోనే పోలీసు వాహనాన్ని ఆపి కిరణ్‌పై దాడి చేయాలని గోరంట్ల భావించినట్లుగా సమాచారం. అయితే అప్పటికే తోకలాగా మాధవ్ వెంటరావడం గమనించిన మంగళగిరి పోలీసులు ఆ అవకాశాన్ని మాధవ్‌కు ఇవ్వకుండా చాకచక్యంగా కిరణ్‌ను గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి క్షేమంగానే చేర్చారు.
అయితే అప్పటికే కిరణ్‌పై దాడి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న మాధవ్.. తానున్నది ఎస్పీ కార్యాలయం అన్న విచక్షణను కోల్పోయినట్లున్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనం నుంచి దిగి.. పోలీసు భద్రత మధ్య వెళుతున్న కిరణ్‌పై దాడికి యత్నించారు. అయితే ఈ పరిణామం ఏదో జరుగుతుందని గ్రహించిన పోలీసులు గోరంట్లను నిలువరించారు. అంతేకాకుండా ఎస్పీ కార్యాలయంలోనే, పోలీసుల ఎదుటే అనుచితంగా ప్రవర్తించిన కారణంగా మాధవ్‌ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. టీడీపీ క్లీన్ గేమ్ ఆడి మంచి మార్కులు కొట్టేస్తే.. వైసీపీ క్యాడర్ ఆవేశపడి, గోరంట్ల వాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి పార్టీకి రావాల్సిన మైలేజ్‌కి కూడా గండికొట్టారు అంటున్నారు అనలిస్టులు.