Bhanu Prakash: తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి హుండీ దొంగతనం కేసును నీరు కారుస్తున్నారనే విమర్శలు భక్తుల నుండి ఉత్పన్నమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2023లో పరకామణి హుండీ లెక్కింపులో చోరీ చేస్తూ దొరికిపోయిన పెద్ద జీయ్యంగారు మఠంలోని గుమస్తా రవి కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకోగా, సదురం రవికుమార్‌పై అప్పట్లో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసును కూడా నమోదు చేశారు. అయితే కేసు విచారణ సమయంలో రవికుమార్‌ను పోలీసులు విచారించగా.. అనేక విషయాలు వెలుగులోకి రావడంతో… ఒక్కసారిగా పోలీసులు, టీటీడీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.
రవికుమార్ ఆస్తుల విలువ మొత్తం 200 కోట్లు పైగా ఉన్నట్లు పోలీసు విచారణ తేలడంతో.. అటు అప్పుడున్నటువంటి పోలీసులు, టీటీడీ ఉన్నతాధికారులు లోపాయికారీ ఒప్పందంతో… లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేయించి, రవికుమార్‌ను బేషరతుగా విడిచిపెట్టారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసు మళ్లీ వార్తల్లోకి రావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ప్రోత్బలంతోనే కేసును లోక్‌అదాళత్‌లో రాజీ చేసుకున్నట్టు విజిలెన్స్ నివేదికలో సైతం బయటపడటంతో ఈ కేసుకి సంబంధించి విచారణ పున:ప్రారంభించాలని టీటీడీ భావించింది. దీంతో ఒక్కసారిగా అప్పట్లో చక్రం తిప్పిన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులు భయాందోళనకు గురై, కేసును నీరుగార్చే పనిలో తలమునకలయ్యారని సమాచారం.
Bhanu Prakash: ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలి సభ్యుడుగా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి ఈ కేసును వీలైనంత త్వరగా పున:ప్రారంభించాలని, పరకామణి దొంగ రవికుమార్‌ను అరెస్ట్ చేసి, వెంటనే విచారణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ చైర్మన్‌కు, ఈవోకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. భాను ప్రకాష్ రెడ్డి ఈ డిమాండ్ చేసి, దాదాపు 5 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు మరోసారి భాను ప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని మీడియా ముఖంగా లేవనెత్తారు.
Also Read: Chhaava in Parliament: పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్?
వీలైనంత త్వరగా సీఐడీకి కేసు అప్పజెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు భాను ప్రకాష్ రెడ్డి. దాదాపు 200 కోట్లు విలువ చేసే స్వామివారి సొమ్మును కాజేసిన రవికుమార్… ఇప్పటికీ ఫ్రీబర్డ్ లాగా బయట తిరుగుతూనే ఉన్నప్పటికీ, అతనిపై ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడంతో… దీని వెనకాల ఎవరున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీటీడీలో పనిచేసిన కొందరు అధికారులు డిప్యూటేషన్‌పై కొనసాగుతూ.. ఇప్పటికీ వైసీపీ నేతలతో, టీటీడీ మాజీ ఉన్నతాధికాలతో అంటగాగుతున్నారని విమర్శలు వినపడుతున్నాయి.
Bhanu Prakash: అప్పట్లో పరకామణికి సంబంధించి కీలక అధికారిగా వ్యవహరించిన ఓ వ్యక్తి.. రిటైర్డ్ అయినప్పటికీ ఇంకా టీటీడీలోనే కొనసాగుతున్నారని… ఇలాంటివారు ఉన్నప్పుడు న్యాయం ఎలా జరుగుతుందని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిని, ఆధారాలతో నిరూపించకపోతే… గత ప్రభుత్వంపై కూటమి చేసిన విమర్శలకు అర్థం లేకుండా పోతుందని సాక్షాత్తూ కూటమి పార్టీల కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ కేసును పున:ప్రారంభిస్తే… పరకామణి దొంగతనంలో వందల కోట్లు చేతులు మారిన అవినీతి అధికారుల బాగోతం బయటపడే అవకాశం ఉందని.. వెంటనే సీఐడీకి కేసు అప్పగించాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.