BC Reservation Ordinance: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు బిసి డెడికేటెడ్ కమిషన్‌కు వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం… మరో వైపు ఆర్డినెన్స్‌ను తయారుచేసి రాజ్ భవన్‌కు పంపింది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 285(ఎ)ను సవరణ చేస్తూ ముసాయిదాను సిద్ధం చేసింది. ఎక్కడా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీ రాజ్ చట్టం 2018లో ప్రభుత్వం చిన్న సవరణ చేస్తున్నది. ఇందులోని 285(ఎ) సెక్షన్లో ఉన్న ”స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి” అన్న సెంటెన్స్‌లో ఒక పదాన్ని తొలగించి, ”స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయి” అని మార్చి ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది.
Also Read: MLC Kavitha: బీఆర్ఎస్కు కవిత షాక్: నా దారికి రావాల్సిందే.!
గతంలో చేసిన పంచాయతీరాజ్ చట్టానికి చిన్న సవరణే కావడం వల్ల ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా ఆమోదం తెలుపుతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, జీవోలపైన మాత్రమే వెళ్లే అవకాశముంటుందని అంచనా వేస్తున్నది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. ఒకవేళ రాజ్ భవన్ నుంచి ఆమోద ముద్ర రాకపోతే రాజకీయంగా విపక్షాలపై అటాక్ చేయడానికి మరో అస్త్రం దొరుకుతుందని అంటున్నది సర్కార్.
గవర్నర్ ఆర్డినెన్స్‌పై ఆమోదం తెలపగానే 42 శాతం రిజర్వేషన్ల ఇంప్లిమెంట్ జీవో విడుదల చేయడం, వారం రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు రావడం ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఈ ఆర్డినెన్స్ పైల్ ఉంది కాబట్టి… ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.
