BC CM Bandi Sanjay

BC CM Bandi Sanjay: రేసులో లేనన్న సంజయ్‌! ఉండాల్సిందే అన్న అధిష్టానం?

BC CM Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రథ సారథి ఎవరు? ఇప్పుడు బీజేపీ కేంద్ర అధిష్టానికి అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది. బీఆర్‌ఎస్‌లో చీలికలు, కవిత, హరీష్‌ రావులు కొత్త పార్టీలు తెరుస్తారంటూ పుకార్లు, కాంగ్రెస్‌ను వెంటాడుతున్న వైఫల్యాలు, విమర్శలు, నియోజకవర్గాల్లో చెప్పలేనన్ని చిక్కుముడులు, మరోవైపు ఎన్నిక ఏదైనా అధికార పార్టీకి పోటీ ఇవ్వగలిగేది మేమే అన్నట్లుగా దూసుకెళ్తున్న బీజేపీ. స్పష్టంగా ఇదీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం. అంటే బీజేపీ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కలను సాకారం చేసుకునే దిశగా కీలక అడుగులు వేయాల్సిన తరుణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో బీజేపీని నడిపించే నాయకుడు ఎవరన్న దాని మీదే.. వచ్చే ఎన్నికల్లో ఫలితం ఆధారపడి ఉంది. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి, ఈటల, ఇతర నాయకుల కన్నా.. ఫైర్‌ బ్రాండ్‌ బండి సంజయ్‌కి పగ్గాలు అప్పగిస్తేనే ఆశించింది జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం కీలకం కాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవిత సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకున్నా, తీన్మార్‌ మల్లన్న లాంటి నాయకుల్ని ముందుంచి బీసీ ఘర్జనలు చేయిస్తున్నా.. ఇవన్నీ అందులో భాగమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయ్‌. ఈ క్రమంలో బీజేపీ బీసీ కార్డును సమర్థవంతంగా ప్లే చేయాలన్నా.. బీసీ నాయకుడు బండి సంజయ్‌కి పగ్గాలు అప్పగించడమే కరెక్ట్‌ అంటున్నారు పరిశీలకులు. బీజేపీ క్యాడర్‌ భావన కూడా ఇదే అంటున్నారు. మోడీ దేశ భక్తిని, హిందుత్వ అజెండాను, కార్యకర్తల్లో జోష్‌ను సమర్థవంతంగా క్యారీ చేయగలిగే ఏకైక నాయకుడు బండి సంజయ్‌. గత ఎన్నికలకు ముందు.. బండి స్పీడ్‌ చూస్తుంటే బీఆర్‌ఎస్‌ని దారుణంగా దెబ్బకొట్టి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చేలా ఉందన్న భావనతో, బీజేపీ కేంద్ర అధిష్టానం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే.. బండి సంజయ్‌ని తప్పించి, కిషన్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించడం. అది బీజేపీ కేంద్ర పెద్దలు చేసిన వ్యూహాత్మక తప్పిదంగా పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా కాంగ్రెస్‌ని అధికారంలోకి రాకుండా చేయాలన్న ఆలోచనతో బీజేపీ అలా చేసి ఉండొచ్చు కానీ.. ఈసారి కాంగ్రెస్‌నో, బీఆర్‌ఎస్‌నో దెబ్బకొట్టడం మాత్రమే బీజేపీ టార్గెట్‌ కాదు. తామే స్వయంగా అధికారంలోకి రావడమే దాని లక్ష్యం. దీంతో రేవంత్‌, కేసీఆర్‌లతో సమానంగా, దూకుడుగా దూసుకెళ్లగలిగే బండి సంజయ్‌ రథ సారథి అయితేనే ఆ లక్ష్యం నెరవేరుతుందని బీజేపీ హైకమాండ్‌ బలంగా నమ్ముతోందట.

అయితే బండికి పగ్గాలు అప్పగించడంలో కొన్ని ఇబ్బందులున్నాయ్‌. ఆయన కేంద్ర క్యాబినెట్‌లో సభ్యుడిగా ఉన్నారు. బీజేపీలో ఒకరికి, ఒకే సమయంలో రెండు పదవులు ఇవ్వడం కుదరదు. దీంతో బండికి తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే.. ఆయన్ను కేంద్ర క్యాబినెట్‌ నుండి తప్పించాలి. అదే సమయంలో.. తెలంగాణ బీజేపీ సీనియర్ల నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవాలి. అసలే బీజేపీ తెలంగాణ అధ్యక్ష కుర్చీపై ఈటల రాజేందర్‌ చాలా బలంగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈటల, కిషన్‌ రెడ్డి వర్గాలుగా విడిపోయారన్న వార్తలొస్తున్నాయ్‌. ఈ నేపథ్యంలో బండిని అధ్యక్ష కుర్చీలో కూర్చోబెడితే.. మూడో వర్గాన్ని బీజేపీ పెద్దలే తయారు చేసి, ప్రోత్సహించినట్లవుతుంది.

Also Read: Kishan Reddy: ‘ఆపరేషన్ సిందూర్’ ఒక చిన్న యుద్ధమా? ఖర్గే కు కిషన్ రెడ్డి ప్రశ్నల దాడి

BC CM Bandi Sanjay: ఈ ప్రమాదాన్ని ముంచే అంచనా వేసిన బీజేపీ హైకమాండ్‌ బండిని తెలంగాణ చీఫ్‌ను చేసేందుకు చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్‌ ఆలోచన ఏంటో స్పష్టంగా తెలిసిన బండి సంజయ్‌ కూడా.. చాలా తెలివిగా తాను అధ్యక్ష రేస్‌లో లేనంటూ రాజకీయ చాణక్యత ప్రదర్శిస్తున్నారు. కిషన్‌ రెడ్డి హైలెవెల్‌ లాబీయింగ్‌ చేసినా, రేవంత్‌కి సరిజోడీ నేనే అంటూ ఈటల ఎంతగా రక్తి కట్టించినా.. బీజేపీ అధ్యక్ష పదవి తనదే అన్న సంకేతాలు అందడం వల్లే.. బండి సంజయ్‌ నిండు కుండలా తొణకడం లేదు, బెనకడం లేదట. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా బండి చేతికి పగ్గాలు అందడం ఖాయం అంటోంది బీజేపీ క్యాడర్ కూడా‌. అధ్యక్ష పదవి విషయంలో ఈసారి హైకండ్‌ ఎలాంటి పొరపాటు చేయదని కూడా క్యాడర్‌ భావిస్తోంది.

కిషన్‌ రెడ్డి నాయకత్వంలో.. బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలే సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేర కాకపోయినా… సముచిత స్థానాలు సాధించడం, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటడం, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్‌ స్థానాన్ని ఆక్రమించి కాంగ్రెస్‌కు సమ ఉజ్జీగా నిలవడం.. మొత్తానికి ప్రస్తుతం బీజేపీ ఫామ్‌లోనే ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడానికి ఈ ఫామ్‌ సరిపోతుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. బీఆర్‌ఎస్‌లో కుటుంబ కలహాలు, కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితం అవడం, కేటీఆర్‌ కేసుల్లో చిక్కుకోవడం, ట్విట్టర్‌ వేదికగా పోరాడుతున్నా కేటీఆర్‌కి మునుపటి ప్రజాధరణ కనిపించకపోవడం, హరీష్‌రావు దాదాపుగా సిద్దిపేటకే పరిమితమవడం లాంటి వైఫల్యాలున్నా, ఖాళీ ఖజానాతో రాష్ట్రాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉందంటూ సీఎం రేవంత్‌ రెడ్డే ఒక రకంగా తమ ప్రభుత్వం వైఫల్యాలతో నడుస్తోందంటూ వ్యాఖ్యానిస్తుండటం.. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రత్యర్థుల లోపాలు, వైఫల్యాలను క్యాష్‌ చేసుకుంటూ… విజృంభించాల్సిన బీజేపీ… ఆ స్థాయిలో రాణించడం లేదన్న మాటలు వినబడుతున్నాయ్‌. ఆ లోటును భర్తీ చేయాలంటే.. బండి సంజయ్‌ని రంగంలోకి దింపాలన్న బలమైన అభిప్రాయం క్యాడర్‌ నుండి వ్యక్తమవుతోంది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీసీల మద్ధతు కోరబోతోంది. బీసీ సెంట్రిక్‌గానే ఎన్నికలకు వెళ్లనుంది. ‘ఫస్ట్‌టైమ్‌.. తెలంగాణకు బీసీ సీఎం’ అన్నది బీజేపీ నినాదం కాబోతోంది. ఇలా చూసుకున్నా.. ఆ బీసీ సీఎం అభ్యర్థి బండి సంజయే అవుతారన్నది విశ్లేషకుల అంచనా. చూడాలి మరి.. రానున్న రోజుల్లో ఏం జరగనుందో.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *