Bandaru Sravani: ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందంట అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యవహారశైలి. లీడర్లు, కార్యకర్తలకు కనీసం పలకరింపులు కరువయ్యాయట. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరోలాగా వ్యవహరిస్తున్నారట ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఏడాది కాలంలోనే సొంత పార్టీలో వ్యతిరేకత మూట కట్టుకున్న ఎమ్మెల్యే… ఆమె ఆడింది ఆట… పాడింది పాట అన్నట్టుగా ఉందట అక్కడ వ్యవహారం. ఎమ్మెల్యే అవినీతి వలయంలో కూరుకుపోయారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు అమాయకంగా కనిపించిన శ్రావణి… ఎమ్మెల్యే పదవి రాగానే తన అసలు స్వరూపం చూపిస్తున్నారట. ఆమె గెలుపు కోసం కష్టపడిన సొంత పార్టీ శ్రేణులను ఇప్పుడు పక్కన పెడుతున్నారట. స్టోర్ డీలర్ల పంపకాల్లో… కష్టపడిన కార్యకర్తలకు కాకుండా ఇతరులకు కేటాయించడంతో కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారంట ఎమ్మెల్యే మీద. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడిందని, ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 5 లక్షలు వసూలు చేసిందంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకొందరు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారట. ఇప్పుడు ఏకంగా టీడీపీ శ్రేణులు బుక్కరాయసముద్రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఎమ్మెల్యే మాకు వద్దంటూ.. ‘సేవ్ టీడీపీ’ అంటూ నిరసనలు చేశారు. అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో 15 నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాల అమలుతో సూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఛార్జ్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి స్కెచ్ వేశారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మండల కన్వీనర్లను నియమించుకొని స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. సింగనమల నియోజకవర్గంలో దానికి భిన్నంగా కన్వీనర్లు కూడా నియమించుకోలేకపోతున్నారు. ఆరు మండలాల్లో ఇప్పటివరకు మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరు. సమయం ఇచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకోరు. పెత్తనం మొత్తం తన తల్లి కనుసన్నల్లో జరుగుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ పనులు జరిగినా ఎమ్మెల్యేకు పర్సంటేజ్ ముట్టచెప్పాల్సిందే అనే ఆరోపణలు వినవస్తున్నాయి.
Also Read: PM Modi: ప్రధాని మోదీ కీలక ప్రకటన: ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ప్రారంభం
సింగనమల నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఓటర్లు అవకాశం ఇచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వీరు విఫలం చెందుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వారి రాజకీయ భవిష్యత్తుకు పుల్‌స్టాప్ పెట్టుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. బండారు శ్రావణి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమిపాలయ్యారు. ఓడిపోయినప్పటి నుంచి బండారు శ్రావణి పెద్దగా నియోజకవర్గంలో కనిపించలేదు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లోపెద్దగా పాల్గొనే వారు కాదు. దీంతో ఇంచార్జ్‌ని మార్చాలని అప్పట్లో పలువురు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ నియోజకవర్గం కావడంతో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అప్పట్లో గాలించింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై అవినీతి ఆరోపణలు రావడం మూలంగా వైసీపీ అభ్యర్థిని మార్చడం శ్రావణికి కలిసొచ్చింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన బండారు శ్రావణికి సానుభూతి లభిస్తుందని ఇటు టీడీపీ అధిష్టానం ఆలోచించింది. మరోవైపు బండారు శ్రావణి టికెట్ తనకే కేటాయించాలని సీఎం చంద్రబాబును వేడుకోవడంతో అధిష్టానం బండారు శ్రావణికే ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే వ్యవహారశైలి పూర్తిగా మారిపోయిందని క్యాడర్ అంటోంది.
సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై పూర్తి అసమ్మతి నెలకొందట. ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితుల్లో లేరట. లోకల్‌గా ఉన్న క్యాడర్‌ను ఎమ్మెల్యే దూరం పెడుతున్నారట. వీటన్నింటికీ ప్రధాన కారణం.. సూత్రధారి, పాత్రధారి అయిన ఆ నెల్లూరు పెద్దారెడ్డి వ్యవహారమే అంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ బలహీన పడుతోందని క్యాడర్‌లో ఆందోళన నెలకొంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకు వెళుతుందో తెలియని పరిస్థితి. ఎమ్మెల్యే పనితీరుపై ఇప్పటికే అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఆమెపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. చూడాలి మరి.. అధిష్టానం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో.